Published : 07/11/2022 21:15 IST

పబ్లిక్‌ టాయిలెట్స్ వినియోగించాల్సి వస్తే..!

ప్రయాణాలు, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. అక్కడి టాయిలెట్స్ వినియోగించుకోవడానికి చాలామంది మహిళలు వెనకాడుతుంటారు. కారణం.. ఎక్కువమంది ఉపయోగించుకోవడం వల్ల అవి అపరిశుభ్రంగా మారడమే! అలాంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయేమోనని భయపడుతుంటారు. ఇక ఈ సమస్యలన్నీ ఎందుకని నీళ్లు తాగకపోవడం, మూత్రం ఆపుకోవడం.. వంటివి చేసేవారూ లేకపోలేదు. వాస్తవానికి అపరిశుభ్రమైన టాయిలెట్లు వినియోగించడం వల్ల యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. కాబట్టి రద్దీ ప్రదేశాల్లో టాయిలెట్స్‌ వినియోగించుకున్నా ఇన్ఫెక్షన్లు సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

⚛ రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎంత శుభ్రం చేసినా టాయిలెట్‌ సీట్‌ తడిగా, అపరిశుభ్రంగానే కనిపిస్తుంది. కాబట్టి దాన్ని నేరుగా వినియోగించుకోకుండా.. ముందుగా దాన్ని ఓ టాయిలెట్‌ పేపర్‌తో శుభ్రం చేసి, ఆపై శుభ్రమైన టాయిలెట్‌ పేపర్‌ని పరచుకొని వినియోగించుకోవచ్చు. అలాగే టాయిలెట్‌ సీట్‌ శానిటైజర్‌ స్ప్రేలు కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే అంతకంటే ముందు ఓసారి ఫ్లష్‌ చేయడం మర్చిపోవద్దు.

⚛ ఇదంతా ఎందుకని చాలామంది సీట్‌కి అంటకుండా స్క్వాటింగ్‌ పొజిషన్‌లో ఉండి పని పూర్తిచేసుకుంటారు. కానీ దీనివల్ల కటి వలయంలోని కండరాలు బలహీనపడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ పద్ధతి కూడదంటున్నారు. ఒకవేళ మీరు వెళ్లే టాయిలెట్లో ఇండియన్‌ తరహా టాయిలెట్‌ ఉంటే అది వినియోగించుకోవడం ఉత్తమం అంటున్నారు. లేదంటే పై పద్ధతిని పాటించడం మంచిది.

⚛ కొంతమంది ఫోన్‌, హ్యాండ్‌బ్యాగ్‌.. ఇలా ఏది పడితే అది టాయిలెట్‌లోకి తీసుకెళ్తుంటారు. అక్కడ పెట్టే వీల్లేక ఆ గదిలోనే వాటిని పెట్టేస్తుంటారు.. లేదంటే హ్యాంగర్స్‌కి తగిలిస్తుంటారు. దీనివల్ల అక్కడి క్రిములు, బ్యాక్టీరియా ఈ వస్తువులకు అంటుకుంటాయి. అదీ ప్రమాదకరమే! కాబట్టి ఇలాంటి వస్తువుల్ని టాయిలెట్‌ బయటే ఏర్పాటుచేసిన అరల్లో అమర్చుకోవడం, లేదంటే మీ వెంట ఉన్న కుటుంబ సభ్యులకు ఇవ్వడం మంచిది.

⚛ టాయిలెట్‌ సీట్ పైనే కాదు.. డోర్‌ హ్యాండిల్స్‌, నాబ్స్‌, ఫ్లష్‌, జెట్‌ స్ప్రేలపై కూడా వేల సంఖ్యలో క్రిములుంటాయి. కాబట్టి వాటిని నేరుగా తాకకుండా టాయిలెట్‌ పేపర్‌తో తాకి, ఆపై చెత్త డబ్బాలో పడేయడం మంచిది.

⚛ టాయిలెట్‌ని వినియోగించుకున్నాక చేతులు సబ్బుతో, నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకానీ.. పైపైన కడిగేసుకొని టిష్యూతో తుడుచుకోవడం కూడా ప్రమాదకరమే!

⚛ చేతులు కడుక్కున్నాక ఆరబెట్టుకోవడానికి కొంతమంది హ్యాండ్‌ డ్రయర్స్‌ని ఉపయోగిస్తుంటారు. కానీ ఇది కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే టాయిలెట్‌ గది లోపల ఉండే ఈ డ్రయర్ పైనా వేల కొద్దీ క్రిములుంటాయట! దాంతో చేతుల్ని ఆరబెట్టుకుంటే అవి తిరిగి చేతుల పైకి చేరతాయి. కాబట్టి తడి చేతుల్ని టిష్యూ లేదా చేతి రుమాలుతో తుడుచుకోవడం మంచిది.

⚛ ఉపయోగించుకున్న శ్యానిటరీ న్యాప్‌కిన్లు అలాగే వదిలేయకుండా పేపర్లో చుట్టి చెత్తడబ్బాలో పడేయాలి. లేదంటే వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

⚛ రద్దీగా ఉండే ప్రదేశాల్లోని టాయిలెట్స్‌ని వినియోగించుకోవడం వల్ల లైంగిక సంక్రమణ వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉందని భయపడుతుంటారు కొంతమంది. కానీ ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. ఇలాంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర సూక్ష్మక్రిములు.. శరీరం బయట ఎక్కువ సమయం జీవించలేవని, అందులోనూ టాయిలెట్‌లో అయితే అవి మరింత వేగంగా నశించిపోయే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిందేమీ లేదంటున్నారు.

అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొంతమందిలో వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు, వైట్‌ డిశ్చార్జి.. వంటి సమస్యలొస్తుంటాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకుంటే సమస్య ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని