Published : 16/10/2022 09:59 IST

కాఫీ.. హెల్దీగా ఇలా..!

కప్పు కాఫీ తాగనిదే చాలామందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. బద్ధకాన్ని వదిలించుకోవడానికి..తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి..ఇలా వివిధ కారణాలతో కాఫీని ఆశ్రయిస్తుంటారు. ఇక వర్షాకాలంలో అయితే చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కప్పుల మీద కప్పుల కాఫీ లాగించేస్తుంటారు. అయితే ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్న సూత్రం కాఫీకి కూడా వర్తిస్తుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఇందులోని కెఫీన్‌ మన శరీరానికి హాని కలగజేస్తుంది. ఈ క్రమంలో కాఫీపై నియంత్రణ పాటించాలంటున్నారు నిపుణులు. దీంతో పాటు కాఫీ దుష్ర్పభావాలను తగ్గించుకొని, దీని ప్రయోజనాలు పొందేందుకు కొన్ని చిట్కాలు కూడా సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.

కాఫీ ప్రయోజనాలు పొందండిలా!

✬ కాఫీ తయారీకి నాణ్యమైన గింజలనే ఉపయోగించాలి. రసాయనాలతో మిళితమైన కాఫీ బీన్స్‌ను వాడడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి.

✬ సాధ్యమైనంతవరకు చక్కెరతో పాటు ఎలాంటి ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్స్‌ కలుపుకోకూడదు. 

✬ కాఫీ పైన క్రీమ్ వాడేవారు ఫ్రక్టోజ్, ట్రాన్స్‌ఫ్యాట్ తక్కువ మోతాదులోఉన్న క్రీమ్‌ను మాత్రమే ఎంచుకోవాలి.

✬ దాల్చిన చెక్క కాఫీకి మరింత రుచిని అందించడమే కాదు...రక్తంలోని చక్కెర స్థాయులను అదుపు చేస్తుంది.

✬ ఉదయాన్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లాగించేస్తుంటారు చాలామంది. అయితే ఇలా తీసుకోవడం వల్ల కాఫీలోని ఆమ్ల కారకాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు.

✬ కాఫీ తయారుచేసేటప్పుడు చిటికెడు యాలకుల పొడిని కలపడం వల్ల కాఫీ వల్ల కలిగే ఎసిడిటీని తగ్గించవచ్చు.

✬ కాఫీలోని కెఫీన్‌ శరీరంలోని ఇతర పదార్థాలతో కలిసి నీటి స్థాయులను తగ్గిస్తుంది. కాబట్టి కాఫీ తాగిన పది నిమిషాల్లోపు కాసిన్ని మంచి నీళ్లు తాగడం వల్ల ఈ దుష్ర్పభావం నుంచి బయటపడవచ్చు.

✬ స్పైసీ, ఫ్రైడ్‌ ఫుడ్స్ తిన్న తర్వాత కాఫీ తీసుకోకూడదు.

✬ వీలైనంతవరకు సాయంత్రం, రాత్రి వేళల్లో కాఫీ తాగకపోవడమే ఉత్తమం. ఎందుకంటే కాఫీలోని కార్టిసాల్‌, అడ్రినలిన్‌ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

✬ అతి వేడి పదార్థాలు, పానీయాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాఫీ విషయంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. అందుకే పొగలు కక్కే కాఫీ కాకుండా కాస్త చల్లారిన తర్వాతే తీసుకోవాలి.

✬ చాలామంది ఉరుకులు పరుగులు పెడుతూ క్షణాల్లో కాఫీ కప్పులను ఖాళీ చేస్తుంటారు. ఫలితంగా కాఫీ ప్రయోజనాలను పూర్తిగా పొందలేరు. అందుకే ప్రశాంతంగా కూర్చొని... నెమ్మదిగా సిప్‌ చేస్తూ... కాఫీ రుచిని ఆస్వాదించాలంటున్నారు నిపుణులు.


వీరు కాఫీకి దూరంగా ఉండాలి!

✬ జీర్ణక్రియ సమస్యలున్న వారు కాఫీకి దూరంగా ఉంటే మంచిది. మరీ తప్పదనుకుంటే రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.

✬ గర్భం ధరించిన మహిళలు... పాలిచ్చే తల్లులు కాఫీ తాగకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తాగాలనుకుంటే మాత్రం డాక్టర్ సలహాలు తీసుకోవాలంటున్నారు.

✬ ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా కాఫీని దూరం పెట్టడం మేలు. ఒకవేళ కాఫీని కచ్చితంగా రుచి చూడాలనుకుంటే మాత్రం భోజనం చేసిన తర్వాత తాగడం మంచిది.

✬ యాంగ్జైటీ, డిప్రెషన్‌ సమస్యలున్న వారు కాఫీతో పాటు కెఫీన్ ఉండే ఇతర పానీయాలను కూడా పూర్తిగా దూరం పెట్టాలి.

✬ పిల్లలకు కూడా కాఫీ ఇవ్వకూడదు... కాఫీ తాగని పిల్లలతో పోల్చితే తాగే పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని