Updated : 26/04/2022 18:09 IST

బెల్లాన్ని ఇలా తీసుకుంటే ప్రయోజనాలెన్నో!

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే బెల్లం తినాల్సిందే!

మలబద్ధకం వేధిస్తోందా? దానికీ బెల్లమే పరిష్కారం!

నెలసరి నొప్పులతో సతమతమవుతున్నారా? బెల్లం ఉందిగా!

ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లం తింటే నయం కాని అనారోగ్యమంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. అయితే ఈ బెల్లాన్ని నేరుగా కంటే.. కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దాని సుగుణాలు రెట్టింపవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం మరింత ప్రభావవంతంగా పని చేస్తుందంటున్నారు. అజీర్తి దగ్గర్నుంచి ఆకలిని అదుపు చేసే దాకా, నెలసరి సమస్యల్ని తగ్గించడం దగ్గర్నుంచి చనుబాలు ఉత్పత్తి చేసే దాకా.. ఇలా ప్రతి ఒక్కటీ బెల్లంతో ముడిపడి ఉంటుందట.  ఈ క్రమంలో బెల్లాన్ని ఏయే పదార్థాలతో కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి.

క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. వంటి ఎన్నో ఖనిజాలను; బి-కాంప్లెక్స్‌, ‘సి’, ‘డి 2’, ‘ఇ’.. వంటి విటమిన్లను కలిగున్న బెల్లాన్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఈ క్రమంలో బీపీని అదుపు చేయడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం, రక్తహీనతను తగ్గించడం.. ఇలా బెల్లం చేసే మేలు ఎంతో! అయితే దీన్ని నేరుగా కంటే ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే ఇందులోని సుగుణాలు రెట్టింపై ఎన్నో అనారోగ్యాల నుంచి విముక్తి పొందచ్చట.

ఇలా తీసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు!

బెల్లం+నెయ్యి

ఈ రెండూ కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి విముక్తి పొందచ్చు.

బెల్లం+ధనియాలు

నెలసరి సమయంలో అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందచ్చు. నెలసరి నొప్పుల్నీ తగ్గించుకోవచ్చు. స్పాటింగ్ మాత్రమే అవుతోందని బాధపడే వారికి ఆ సమస్య తగ్గి ఎప్పటిలాగే పిరియడ్స్‌ ప్రారంభమవుతాయి.

బెల్లం+సోంపు

నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.. దంతాలపై పాచి పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.

బెల్లం+మెంతులు

జుట్టు ఆరోగ్యం రెట్టింపవుతుంది.. కుదుళ్లు దృఢంగా మారతాయి.. తెల్ల  జుట్టు రాకుండా జాగ్రత్తపడచ్చు.

బెల్లం+గోంద్

ఎముకల్ని దృఢంగా చేయడానికి ఈ ఫుడ్‌ కాంబినేషన్‌ చక్కగా ఉపకరిస్తుంది. అలాగే పాలిచ్చే తల్లులు తీసుకుంటే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తవుతాయి.

బెల్లం+అలీవ్‌ గింజలు

మనం తీసుకునే ఆహారంలోని ఫోలికామ్లం, ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇక చర్మంపై ఏర్పడిన పిగ్మెంటేషన్‌ని తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.

బెల్లం+నువ్వులు

దగ్గు, జలుబు, ఫ్లూ.. వంటివి దరిచేరకుండా పాడుతుంది.

బెల్లం+పల్లీలు

శరీరంలో సత్తువను పెంచడానికి, ఆకలిని అదుపు చేయడానికి, ఆహారపు కోరికల్ని తగ్గించడానికి ఈ ఫుడ్‌ కాంబినేషన్‌ అద్భుతంగా పని చేస్తుంది.

బెల్లం+పసుపు

ఇది తింటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

బెల్లం+శొంఠి పొడి

జ్వరం నుంచి త్వరగా కోలుకోవడానికి, శరీరంలోని వాపును తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని