పీసీఓఎస్ ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

హార్మోన్ల అసమతుల్యత.. ఇది మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా దీని కారణంగా పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)తో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ సమస్య మనదేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

Updated : 05 Sep 2021 15:06 IST

హార్మోన్ల అసమతుల్యత.. ఇది మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా దీని కారణంగా పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)తో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ సమస్య మనదేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రపంచంలోనైతే దాదాపు 60-70 శాతం మంది స్త్రీలు దీని బారిన పడి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చక్కటి జీవనశైలి, ఆహారపుటలవాట్లను పాటిస్తే పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. సెప్టెంబర్‌ మాసాన్ని ‘పీసీఓఎస్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఈ సమస్యతో బాధపడే మహిళలు పాటించాల్సిన కొన్ని ఆహార నియమాలేంటో తెలుసుకుందాం రండి..

మన శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్‌ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది క్రమంగా పీసీఓఎస్‌కి దారితీస్తుంది. దీనివల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవడం, మూడ్‌ స్వింగ్స్‌.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.. అలాగే పెరిగిన బరువూ తగ్గచ్చు.

ఏం తినాలి?

విటమిన్‌-బి లోపం లేకుండా!

మన శరీరంలో ‘బి’ విటమిన్‌ లోపం కూడా పీసీఓఎస్‌కు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ సమస్యతో బాధపడే మహిళల్లో దాదాపు 80 శాతం మందిలో విటమిన్‌-బి లోపం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. దీనివల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, స్థూలకాయం, అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరిగిపోవడం, గర్భం ధరించడంలో ఆటంకాలు ఎదురవడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో విటమిన్‌-బి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో ఆకుకూరలు, చేపలు, గుడ్లు.. వంటివి తప్పకుండా తీసుకోవాలి. తద్వారా సమస్యను అదుపులో ఉంచుకోవడంతో పాటు బరువు కూడా క్రమంగా తగ్గచ్చు.

‘కొవ్వులూ’ మంచివే!

కొవ్వులు అనగానే చాలామందిలో నెగెటివ్‌ భావనే ఉంటుంది! అవి శరీరానికి హాని చేయడంతో పాటు బరువు పెరిగేలా చేస్తాయని చాలామంది అభిప్రాయం. కానీ కొవ్వుల్లో మంచి కొవ్వులు కూడా ఉన్నాయి. వీటిలో ఉండే అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు హార్మోన్లను సమతులం చేయడానికి, తద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అలాగే అండం ఉత్పత్తిని తగ్గించే ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ప్రభావం శరీరంపై పడకుండా, గర్భాశయానికి రక్తప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తాయి. అంతేకాదు.. పీసీఓఎస్‌ వల్ల క్రమం తప్పిన నెలసరిని మళ్లీ గాడిలో పెట్టడానికీ ఈ మంచి కొవ్వులు సహకరిస్తాయి. కాబట్టి అవకాడో, ఛీజ్‌, డార్క్‌ చాక్లెట్‌, కోడిగుడ్లు, చేపలు, నట్స్‌, ఆలివ్‌ నూనె.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల్ని కొన్ని రోజుల్లోనే గుర్తించచ్చు.

యాంటీ ఆక్సిడెంట్లతో బ్యాలన్స్‌ చేయండి!

పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళల్లో ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ (శరీరంలో ఫ్రీ రాడికల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ అదుపు తప్పడం) స్థాయులు అధికంగా ఉంటాయి. తద్వారా దీని ప్రభావం కణజాలాలపై పడుతుంది. కాబట్టి దీన్ని అదుపులో ఉంచుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో బెర్రీ పండ్లు (స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్బెర్రీ, గోజీ బెర్రీ), డార్క్‌ చాక్లెట్‌, గ్రీన్‌ టీ, ఆకుకూరలు, బీన్స్‌.. వంటివి రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. అయితే ఈ ఆహార పదార్థాల్లోనూ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్నవే ఎంచుకోవాలి. లేదంటే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం రక్తంలో చక్కెర స్థాయుల్ని పెంచుతుంది. అది మధుమేహానికి దారితీస్తుంది.

అందుకే ‘పీచు’ ఎక్కువగా!

సాధారణ మహిళలతో పోల్చితే పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళలు టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదం నాలుగు రెట్లు అధికమని పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి రక్తంలో ఇన్సులిన్‌ స్థాయులు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇందుకోసం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న పదార్థాలతో పాటు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఓట్స్‌, బీన్స్‌, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌, పప్పులు.. వంటివి మనం రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి.

 

వేటిని దూరం పెట్టాలంటే..!

* చక్కెరలు అధికంగా ఉండే పదార్థాల వల్ల బరువు మరింతగా పెరగడంతో పాటు డయాబెటిస్‌ సమస్య కూడా పొంచి ఉంది.. కాబట్టి వీటికి దూరంగా ఉంటూనే.. ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌ని కూడా మరీ ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి.

* ప్రాసెస్డ్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌, ఫ్రైడ్‌ ఫుడ్‌లో ఉండే ఉప్పు, ప్రిజర్వేటివ్స్‌, మసాలాలు శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోయేలా చేస్తాయి. కాబట్టి పీసీఓఎస్‌తో బాధపడుతోన్న వారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

* పాలు, పాల పదార్థాలు శరీరానికి పోషకాలు అందించినప్పటికీ పీసీఓఎస్‌ ఉన్న మహిళలు మాత్రం వీటిని మితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పదార్థాల్లోని కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని పెంచుతాయట! ఫలితంగా ఇది మధుమేహానికి దారితీసే ప్రమాదం ఉంది.

* మాంసంలోని శ్యాచురేటెడ్‌ కొవ్వులు, కొలెస్ట్రాల్‌ వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే వీటి ద్వారా శరీర బరువు కూడా పెరుగుతుంది. కాబట్టి హార్మోన్లను సమతులం చేసుకొని బరువును అదుపులో ఉంచుకోవాలంటే మాంసాన్ని వీలైనంత తక్కువగా తీసుకోవడమే మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. ఫలితంగా పీసీఓఎస్‌ను మన అధీనంలోకి తెచ్చుకోవచ్చు.

పీసీఓఎస్‌ అనేది దీర్ఘకాలిక సమస్య. దాని గురించే బాధపడుతూ కూర్చుంటే తగ్గే సమస్య కాదిది. కాబట్టి ఈ ఆహారపుటలవాట్లను పాటిస్తూనే నిద్రకు సరైన సమయం కేటాయించండి.. వ్యాయామం, ధ్యానం వంటివి అలవర్చుకోండి.. అప్పుడే ఈ సమస్యను మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు.. ఏమంటారు?!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్