ఈ డైట్‌తో చలికాలంలో షుగర్‌ని అదుపులో ఉంచుకోండి
close
Updated : 03/12/2021 21:25 IST

ఈ డైట్‌తో చలికాలంలో షుగర్‌ని అదుపులో ఉంచుకోండి!

కాలాలు మారే కొద్దీ మన రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మారుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణ ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగానే ఉంటుంది. రకరకాల సీజనల్‌ వ్యాధులు, అనారోగ్యాలు కలిసి ముప్పేట మనపై దాడి చేస్తాయి. దీనికి ప్రధాన కారణం శీతాకాలంలో వీచే విపరీతమైన చలిగాలులే. అందుకే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మధుమేహ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శీతాకాలంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల డయాబెటిక్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయులు బాగా పెరుగుతాయి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే గుండె, మూత్రపిండాలు, నరాలు, కళ్లు వంటి ముఖ్యమైన అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో రక్తంలో చక్కెర స్థాయుల్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. అదుపులో ఉంచుకునేందుకు తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఈ కూరగాయలతో మేలు!

శీతాకాలంలో ఫైబర్‌ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు బాగానే లభ్యమవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడమే కాకుండా శరీర బరువును అదుపులో ఉంచుతాయి. క్యారట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, బచ్చలి కూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ, గ్రీన్‌బీన్స్‌, బఠానీలు, మొక్కజొన్న వంటి కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితముంటుంది. ప్రధానంగా క్యారట్‌, ముల్లంగి వంటి దుంపల్లో ఫైబర్‌తో పాటు ఎ, బి6, సి, ఇ, కె-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా జింక్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్, కాపర్‌, అయొడిన్‌.. వంటి ఖనిజాలు కూడా శరీరానికి అందుతాయి. ముఖ్యంగా వీటిలోని జింక్‌ ఇన్సులిన్‌ స్థాయిని పెంచి డయాబెటిక్‌ రోగులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.

ఈ పండ్లలో పుష్కలంగా పోషకాలు!

సిట్రస్‌ జాతికి చెందిన పండ్లలో ఫైబర్‌, విటమిన్‌-సి పుష్కలంగా ఉంటాయి. నారింజ, నిమ్మ, యాపిల్, దానిమ్మ, కివీ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిక్‌ రోగుల్లో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి. వీటిలోని ఫైబర్‌, సూక్ష్మ, స్థూల పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరంలోని కణజాలాల క్షీణతను నివారిస్తాయి. ఈ క్రమంలో ఎంతో రుచికరమైన బెర్రీ పండ్లను డయాబెటిక్ రోగులకు సూపర్‌ఫుడ్‌గా గుర్తించింది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్. వీటిలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌తో పాటు గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. బెర్రీ ఫ్రూట్స్‌ వల్ల రక్తంలో చక్కెర స్థాయులు, ఇన్సులిన్‌ స్థాయులు మెరుగుపడతాయని ఓ అధ్యయనంలో తేలింది. వీటిని స్మూతీలు, జ్యూస్‌ల రూపంలో తీసుకుంటే మంచిది.

ప్రొటీన్ కోసం మాంసం!

రక్తంలోని చక్కెర స్థాయులు పెరగడం వల్ల కణజాలాలకు తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. దీనిని నివారించాలంటే ప్రొటీన్ ఎంతో అవసరం. ఇందుకోసం మాంసం, చేపలతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే గుడ్లను బాగా తీసుకోవాలి. అయితే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే రెడ్‌మీట్‌కు దూరంగా ఉంటే మంచిది.

వీటి విషయంలో జాగ్రత్త!

* బియ్యం, బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులు సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచిది. మరీ తినాలనిపిస్తే మితంగా తీసుకోవాలి.

* ఆహారంలో తప్పనిసరిగా రైస్‌ తీసుకోవాలంటే ప్రాసెస్ చేయని బ్రౌన్‌ రైస్‌ మంచి ప్రత్యామ్నాయం. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నప్పటికీ ఫైబర్‌ లాంటి శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.

* బెల్లంలోనూ చక్కెర స్థాయులను పెంచే గుణాలుంటాయి. గ్లైసెమిక్‌ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ బాధితులు బెల్లంతో తయారుచేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

* శీతాకాలంలో మొక్కజొన్నతో చేసిన బ్రెడ్‌లు, రోటీలను చాలామంది ఇష్టంగా తింటుంటారు. అయితే డయాబెటిక్‌ రోగులు మాత్రం మొక్కజొన్న పదార్థాలను మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు చలికాలంలో వీటిని తీసుకోకపోతే మరీ మంచిదంటున్నారు.

* సాధారణంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి వేడి వేడి టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటారు. వీటి కారణంగా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పానీయాలకు దూరంగా ఉండాలి.

* గొంతునొప్పి, సాధారణ జలుబు, ఇతర అనారోగ్యాల నుంచి రక్షణ పొందేందుకు తేనెను ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేకాదు.. శీతాకాలంలో వచ్చే పలు సీజనల్‌ వ్యాధుల నుంచి తేనె ఉపశమనం కలిగిస్తుంది. అయితే మధుమేహ రోగులు మాత్రం తేనెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇది న్యాచురల్ స్వీట్‌నర్‌. అయినా ఇందులో కూడా చక్కెర అధికంగానే ఉంటుంది.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని