వీటితో.. కడుపు చల్లగా..!

ఈ రోజుల్లో చాలామంది కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడడం చూస్తూనే ఉంటాం. ప్రత్యేకించి వేసవిలో ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. మనకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అది పొట్ట నుంచే....

Updated : 26 May 2023 18:06 IST

ఈ రోజుల్లో చాలామంది కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడడం చూస్తూనే ఉంటాం. ప్రత్యేకించి వేసవిలో ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. మనకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అది పొట్ట నుంచే మొదలవుతుంది. కాబట్టి, పొట్ట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకేనేమో ఎవరికైనా సహాయం చేసినప్పుడు ‘నీ కడుపు చల్లగుండ’ అని దీవిస్తుంటారు. అయితే పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేసుకుంటే చాలు. కానీ, కొంతమంది ఫాస్ట్‌ఫుడ్‌, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యమిచ్చి లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. మన భారతీయ సంప్రదాయంలో పొట్టకు మేలు చేసే వంటకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని వంటకాల గురించి తెలుసుకుందాం..

కిచిడీ...

భారతీయ వంటకాల్లో కిచిడీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. పప్పు, బియ్యంతో చేసే ఈ వంటకం చాలామందికి సుపరిచితమే. బియ్యంలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కానీ పప్పు, నెయ్యిలో ఉండే ఫైబర్‌, కొవ్వు పదార్థాలు వీటిని సమతుల్యం చేస్తాయి. ఈ వంటకంలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ఎసిడిటీ సమస్యలను దూరం చేయడమే కాకుండా జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది.

ఇడ్లీలు...

మనం ఉదయాన్నే రకరకాల టిఫిన్స్‌ ఆరగిస్తాం. అయితే ఇందులో చాలావరకు మైసూర్‌ బజ్జీ, పూరీ, దోశ వంటి నూనెతో కూడిన ఆహారపదార్థాలే ఎక్కువగా ఉంటాయి. కొంతమంది మాత్రమే ఇడ్లీ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించేవారు తమ మెనూలో ఇడ్లీని చేర్చుకుంటారు. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేస్తాయి. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

నిమ్మకాయ పచ్చడి...

చాలామంది వంటల్లో రకరకాల మసాలాలు దట్టిస్తుంటారు. ఒకవేళ వంటకం స్పైసీగా లేకుంటే దానికి పచ్చళ్లను జత చేస్తుంటారు. ఈ క్రమంలో ముఖ్యంగా నిమ్మకాయ పచ్చడి వల్ల ఎన్నో లాభాలున్నాయి. నిమ్మకాయలో జీర్ణక్రియ సాఫీగా జరగడానికి కావాల్సిన ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఫలితంగా కడుపుబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉండే విటిమిన్‌ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

పెరుగన్నం..

ఎన్ని రకాల వంటకాలతో భోజనం చేసినా పెరుగన్నం తింటే కానీ అది పూర్తి కాదు. పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్‌, పీచుపదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేట్లు చేస్తాయి. ఇందులో ప్రోబయోటిక్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులోని మినరల్స్‌ వల్ల శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది.

ఉసిరి పచ్చడి...

ఉసిరిలో విటిమిన్ సి అధికంగా ఉంటుంది. ఉసిరి పొట్టలోకి చేరిన ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా చేస్తుంది. అందులోని పోషకాలు శరీరానికి అందడమే కాకుండా జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది. ఇందులో ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు అజీర్తి, గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తాయి.

గమనిక: ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. అతి అనర్థం అన్నట్టు ఏదైనా సరే.. అతిగా తీసుకుంటే అనర్థాలు తప్పవు. కాబట్టి, వీటికి ప్రాధాన్యమిస్తూ మిగతా ఆహారపదార్థాలను కూడా బ్యాలన్స్‌ చేస్తూ తీసుకోవడం వల్ల సరైన ప్రయోజనాలను పొందగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్