Immunity Boosters: పరగడుపునే ఇవి తీసుకుంటున్నారా?
కొందరికి నిద్ర లేచింది ఆలస్యం.. కాఫీ లేదా టీ తాగందే ఉండలేరు. అయితే వీటికి బదులు పరగడుపున కొన్ని పదార్థాల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
కొందరికి నిద్ర లేచింది ఆలస్యం.. కాఫీ లేదా టీ తాగందే ఉండలేరు. అయితే వీటికి బదులు పరగడుపున కొన్ని పదార్థాల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
ఉసిరి
ఉసిరిలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపునే తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
తేనె
పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇలా తేనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
తులసి
రోజూ తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తినాలి.. నీటిని తాగేయాలి. తద్వారా దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపమశమనం పొందచ్చు. అంతేకాదు తులసి రసం తాగితే చర్మానికి, శిరోజాలకు, దంతాలకు కూడా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.
వెల్లుల్లి
సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి. అందుకే వెల్లుల్లిని రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే తీసుకోమంటున్నారు నిపుణులు. ఈక్రమంలో ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి, ఆపై గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.