Updated : 23/04/2022 19:32 IST

Sunburn: మండే ఎండలకు చర్మం కందిపోకుండా..!

వేసవి కాలంలో చాలామందికి ఎదురయ్యే సమస్యల్లో చర్మం కందిపోయి నల్లగా మారడం కూడా ఒకటి. మరి, అలా జరగకుండా ఉండడానికే బయటికి వెళ్లేముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటాం.. అంటారా..? అయితే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలతో పోరాడే శక్తి ఈ లోషన్ల కంటే మనం ఆహారంగా తీసుకునే కొన్ని పదార్థాలకే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉండే కొన్ని రకాల పోషకాలు, సమ్మేళనాలే చర్మంపై ఎండ పడినప్పుడు కందిపోకుండా కాపాడతాయట. మరింకెందుకాలస్యం.. ఆ పదార్థాలేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోతే సరి..!

ఈ పండ్లు..

ఎండ కారణంగా చర్మం కందిపోకుండా ఉండడానికి పండ్లు ఎంతగానో సహకరిస్తాయి. ముఖ్యంగా దానిమ్మ, స్ట్రాబెర్రీ, జామ.. వంటి పండ్లలో ఉండే పోషకాలు ఇందుకు బాగా దోహదం చేస్తాయి. దానిమ్మలో పుష్కలంగా లభించే ఎల్లాజిక్ ఆమ్లం సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మేనుపై పడకుండా అడ్డుకుంటుంది. అలాగే చర్మంలో కొత్త కణాలను ఉత్పత్తి చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇక స్ట్రాబెర్రీలో అధికంగా లభించే విటమిన్ సి కూడా ఈ సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. అలాగే బ్లూబెర్రీ, రాస్బెర్రీ.. వంటివి కూడా ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఏ కాలంలోనైనా విరివిగా లభించే జామ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంతో పాటు చర్మ క్యాన్సర్, ఇతర మేని సంబంధిత సమస్యలు రాకుండా సంరక్షిస్తాయి. వీటితో పాటు పుచ్చకాయ, కివీ, యాపిల్.. వంటి పండ్లూ చర్మానికి ఎండ నుంచి రక్షణ కల్పిస్తాయి.

గ్రీన్ టీ తాగుతున్నారా?

గ్రీన్ టీ.. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేవారు ఈ టీ తాగుతుంటారు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పరంగా దోహదం చేయడం మాత్రమే కాదు.. ఎండ నుంచి చర్మానికి తగిన రక్షణ సైతం కల్పిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే టానికామ్లం, ఇతర సమ్మేళనాలు ఎండ కారణంగా చర్మం కందిపోకుండా కాపాడతాయి. కాబట్టి ఎవరైతే రోజూ గ్రీన్ టీ తాగుతారో వారికి సన్‌బర్న్ సమస్య చాలా తక్కువగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.

టొమాటోతో టాటా..

మార్చితో మొదలయ్యే ఎండలు దాదాపు జూన్ వరకూ కొనసాగుతాయి. ఈ మూడునాలుగు నెలల పాటు చర్మాన్ని ఎండ నుంచి సంరక్షించుకోవాలంటే కొద్దిగా ఆలివ్ నూనెలో పావు కప్పు టొమాటో పేస్ట్‌ను కలుపుకొని రోజూ తీసుకోవడం వల్ల సూర్యరశ్మి వల్ల చర్మం కందిపోకుండా జాగ్రత్తపడచ్చు. ఎందుకంటే టొమాటోలో ఎక్కువగా లభించే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి అధిక సమయం రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు.. ఈ రెండు పదార్థాలూ ఆరోగ్యానికీ ఎంతో మంచివి.

ఆలూతో..

బంగాళాదుంప.. దీంతో చేసిన వంటకాలంటే మనలో చాలామందికి ఇష్టం. అయితే ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడడంలో బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పిండి పదార్థాలు ఎండ వల్ల చర్మం కందిపోకుండా రక్షిస్తాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా బంగాళాదుంపను మెత్తగా చేసుకొని చర్మంపై ఎండ తగిలే ప్రదేశంలో రాస్తే సరి.. అంతేకాదు.. ఇది మేని మెరుపుకీ ఉపయోగపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని