ఈ ఆహారంతో టీకా దుష్ప్రభావాలు దూరం!

కొవిడ్‌ టీకా తీసుకున్న వారిలో తలనొప్పి, తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, నీరసం, వికారం, వాంతులు.. వంటి దుష్ప్రభావాలు తలెత్తడం సహజమే! అయితే ఇలాంటి సమయంలో వీటి నుంచి త్వరగా కోలుకోవాలంటే మనం తీసుకునే ఆహారమే కీలకమంటున్నారు నిపుణులు. కొన్ని పదార్థాలు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Updated : 07 Jul 2021 18:18 IST

కొవిడ్‌ టీకా తీసుకున్న వారిలో తలనొప్పి, తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, నీరసం, వికారం, వాంతులు.. వంటి దుష్ప్రభావాలు తలెత్తడం సహజమే! అయితే ఇలాంటి సమయంలో వీటి నుంచి త్వరగా కోలుకోవాలంటే మనం తీసుకునే ఆహారమే కీలకమంటున్నారు నిపుణులు. కొన్ని పదార్థాలు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తృణధాన్యాలు (హోల్‌ గ్రెయిన్‌)

బార్లీ, బ్రౌన్‌ రైస్‌, ఓట్స్‌, క్వినోవా.. వంటి తృణధాన్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి టీకా దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తాయి. ఫైబర్‌తో పాటు పాలీఫినోల్స్‌ నిండి ఉండే ఈ పదార్థాలు జీర్ణవ్యవస్థలో తలెత్తే సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తితో పాటు శక్తి స్థాయులు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

నీటిని అందించాల్సిందే!

టీకా తీసుకునే ముందు, తర్వాత కూడా వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. దీనివల్ల నీరసం దరిచేరదు. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నారింజ, దోసకాయ, పాలకూర.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో బాగా సహాయపడతాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న భాగంలో వాపు, నొప్పితో పాటు ఒళ్లునొప్పులు, యాంగ్జైటీ.. వంటి సమస్యల్ని చాలా వరకు తగ్గిస్తాయివి. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఫ్లేవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో శరీరానికి అందుతాయి.

పసుపు పాలు

రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడే సుగుణాలు పసుపులో బోలెడన్ని ఉన్నాయి. దీనిలోని యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి. ఇక యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహకరిస్తాయి. ఇందులోని కర్క్యుమిన్‌ అనే సమ్మేళనం జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీన్ని ఎలాగూ కూరల్లో వాడుతుంటాం కాబట్టి దాంతో పాటు సూప్స్‌, సలాడ్స్‌, పాలు, స్మూతీస్‌లోనూ చేర్చుకుంటే మరీ మంచిది.

కూరగాయలు

క్యాలీఫ్లవర్‌, బ్రకలీ, క్యాబేజీ, పాలకూర, బచ్చలికూర, గ్రీన్‌ యాపిల్‌, బీన్స్‌.. వంటి పదార్థాల్లో విటమిన్లు-ఎ, సి, కె, పొటాషియం, ఫోలేట్‌, మెగ్నీషియం.. అధికంగా లభిస్తాయి. ఇవి జీవక్రియల్ని సమన్వయ పరిచి.. టీకానంతర సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తాయి. కాబట్టి కూరలతో పాటు వీటిని సూప్స్‌లోనూ చేర్చుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.

అల్లం టీ

వ్యాక్సినేషన్‌ దుష్ప్రభావాలను దూరం చేసుకోవాలంటే అల్లం టీ చక్కటి ఔషధమంటున్నారు నిపుణులు. ఇందులోని అమైనో ఆమ్లాలు, ఎంజైములు.. శారీరక వాపు, మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి. అల్లం టీ ఇష్టం లేనివారు నిపుణుల సలహా మేరకు జింజెరాల్‌ సప్లిమెంట్స్‌ తీసుకున్నా ప్రయోజనముంటుంది.

వీటిని దూరం పెట్టండి!

* ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో ఉండే అధిక క్యాలరీలు, చెడు కొవ్వులు రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా టీకా వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.

* చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. ఇవి అంతిమంగా నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

ఈ జాగ్రత్తలతో పాటు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడమూ మంచిదే! ఇలా టీకా తీసుకున్న తర్వాత సాధారణంగా వచ్చే దుష్ప్రభావాల నుంచైతే త్వరగానే కోలుకోవచ్చు. ఒకవేళ ఈ అనారోగ్యాలు రోజుల తరబడి వేధిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్