Published : 01/03/2023 15:01 IST

వేసవిలో.. ఈ పదార్థాలకు దూరంగా..!

క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి.. వేసవి కాలంలో కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉంటేనే మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటా పదార్థాలు? రండి.. తెలుసుకుందాం..!

అమితంగా వద్దు..!

కాలానుగుణంగా వచ్చే పండ్లను చాలామంది ఇష్టపడతారు. అందులోనూ వేసవిలో విరివిగా లభించే మామిడిపండ్ల కోసం ఏడాదంతా వేచి చూస్తుంటాం. అలాగని సీజనంతా అవే తింటామంటే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరే చేజేతులా పాడు చేసుకున్న వారవుతారు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో కడుపుబ్బరం, అజీర్తి, విరేచనాలు.. వంటి సమస్యలు తలెత్తచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో చక్కెరలుంటాయి. వీటివల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత ఇష్టమున్నప్పటికీ ఈ పండ్లను మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

ఫ్రైడ్ ఫుడ్స్, నాన్‌వెజ్..

వేసవిలో ఫ్రైడ్‌ఫుడ్స్, జంక్ ఫుడ్, మాంసాహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. అసలే ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుందంటే.. ఇక వీటిని తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. కారణం.. వీటిలో అధిక మొత్తంలో ఉండే నూనె. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే అవకాశాలూ లేకపోలేదు. అంతేకాదు.. ఈ తరహా పదార్థాలు తీసుకుంటే శరీరంలో అత్యధికంగా వేడి పుట్టి.. చెమట ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాగే అజీర్తి సమస్య కూడా తలెత్తుతుంది. కాబట్టి వేసవిలో వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం.

వీటినీ తగ్గించాల్సిందే..!

అలాగే వేసవిలో మసాలాలు వీలైనంత వరకు తగ్గించాలి. వీటి వల్ల కూడా శరీరంలో అధిక మొత్తంలో వేడి ఉత్పత్తవుతుంది. అలాగే మసాలాలు ఎక్కువైతే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇవి కూడా!

⚛ చాలామంది ఎండలోంచి ఇంటికి రాగానే.. లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఎండ వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్.. వంటివి తీసుకుంటుంటారు. అయితే ఇవి వేసవి వేడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంలో అత్యధికంగా వేడి ఉత్పత్తయ్యేలా చేస్తాయి.

⚛ అలాగే టీ, కాఫీలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. కారణం.. వాటిలో ఉండే కెఫీన్, ఇతర పదార్థాలతో కలిసి శరీరంలోని నీటి స్థాయులను తగ్గించేస్తుంది. ఫలితంగా ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని