Published : 05/07/2022 16:48 IST

ఈ పోషకాలతో సంతాన భాగ్యం!

అమ్మతనం కోసం ఎంతగానో పరితపిస్తుంటారు మహిళలు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యల కారణంగా ప్రస్తుతం ఎంతోమంది స్త్రీలు మాతృత్వానికి దూరమవుతున్నారు. మరికొంతమంది ఐవీఎఫ్‌, అద్దె గర్భం.. వంటి కృత్రిమ పద్ధతుల్లో గర్భం ధరించి అమ్మలవుతున్నారు.  అయితే  మనం తీసుకునే ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా గర్భం ధరించడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు.  ఈ క్రమంలో పోషకాలతో నిండి ఉన్న పదార్థాలను రోజువారీ ఆహారపుటలవాట్లలో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ సంతాన భాగ్యాన్ని ప్రసాదించే ఆ పోషకాలేంటి? సంతానలేమిని అవెలా దూరం చేస్తాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

పీసీఓఎస్‌, థైరాయిడ్‌, నెలసరి క్రమం తప్పడం, అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత.. గర్భం ధరించాలనుకునే మహిళలకు ఈ సమస్యలు పెను సవాలుగా మారుతున్నాయి. అయితే చక్కటి జీవనశైలితో ఆయా సమస్యల్ని అదుపులో పెట్టుకున్నట్లే.. ఆరోగ్యకరమైన పోషకాహారంతో సంతానానికి నోచుకోవచ్చంటున్నారు నిపుణులు.

అండం నాణ్యత పెంచే యాంటీ ఆక్సిడెంట్లు!

గర్భం ధరించాలంటే అండం విడుదలవడం ఎంత ముఖ్యమో.. దాని నాణ్యత కూడా అంతే ముఖ్యం. అయితే మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ అండాశయాల్లో ఉత్పత్తయ్యే అండాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మరి, ఆ సమస్యను తగ్గించుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో ‘సి’, ‘ఇ’ విటమిన్లు, ఫోలేట్‌, బీటా కెరోటిన్‌, ల్యూటిన్.. వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు, నట్స్‌, ధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత పెంచుకోవాలన్నా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇలా అండం, వీర్యకణాల నాణ్యత పెరిగితే గర్భం ధరించే అవకాశాలు చాలా వరకు మెరుగుపరచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

అల్పాహారం కడుపు నిండా తినాలట!

అల్పాహారమంటే చాలా లైట్‌గా తీసుకునే వారే మనలో చాలామంది ఉంటారు. కానీ ఇదే బ్రేక్‌ఫాస్ట్‌ని కడుపు నిండా తీసుకోవడం వల్ల హార్మోన్ల ప్రభావాన్ని నియంత్రించి.. పీసీఓఎస్‌ అదుపులోకొస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. సాధారణ బరువుండి పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళలు తమ అల్పాహారంలో భాగంగా ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకుంటే వారి శరీరంలో ఇన్సులిన్, టెస్టోస్టిరాన్‌ స్థాయులు తగ్గుతాయట! ఎందుకంటే ఈ రెండింటి స్థాయులు ఎక్కువగా ఉండడం వల్ల సంతానలేమికి దారితీస్తుంది.. కాబట్టి వీటిని తగ్గించుకుంటే సంతానం కలిగే సామర్థ్యం పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే మీ బరువును బట్టి ఎలాంటి అల్పాహారం తీసుకోవచ్చో ఓసారి పోషకాహార నిపుణుల్ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

ఆ ‘కొవ్వులు’ వద్దు!

చెడు కొవ్వులు (ట్రాన్స్‌ ఫ్యాట్స్‌) రక్తంలో ఇన్సులిన్‌ స్థాయుల్ని పెంచి అండోత్పత్తి, గర్భధారణపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌, ఫ్రైడ్‌ ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు.. వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే సోయా, ఆలివ్‌.. వంటి నూనెల్ని వంటల కోసం ఉపయోగించాలి. ఇక ‘ఎ’, ‘డి’, ‘ఇ’, ‘కె’, ‘కె2’.. వంటి విటమిన్లు అధికంగా లభించే పాలు, పాల పదార్థాలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ఉండే మంచి కొవ్వులు సంతాన సమస్యల్ని క్రమంగా దూరం చేసి గర్భధారణను ఫలవంతం చేస్తాయట!

పీసీఓఎస్‌ ఉంటే..!

పీసీఓఎస్‌ ఉన్న వారిలో అధిక బరువు, ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌.. వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. అయితే ఈ సమస్యల్ని తగ్గించుకొని పీసీఓఎస్‌ను అదుపు చేసుకోవాలంటే తీసుకునే ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, నట్స్‌, గింజలతో పాటు వంటల్లో కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనె.. వంటివి ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలాంటి తక్కువ కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులోకొస్తుంది. తద్వారా శరీరంలో ఇన్సులిన్‌ స్థాయులు అదుపులో ఉంటాయి.. నెలసరి కూడా క్రమంగా వస్తుంది.. పీసీఓఎస్‌ కంట్రోల్‌ అవుతుంది. ఇవన్నీ జరిగితే సంతానానికి నోచుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని