వీటితో పీసీఓఎస్‌ను తగ్గించుకోవచ్చు!

పీసీఓఎస్.. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు, ఇన్సులిన్ స్థాయులు పెరిగినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. తద్వారా స్త్రీలలో నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక బరువు, మొటిమలు....

Published : 14 Sep 2022 20:20 IST

పీసీఓఎస్.. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు, ఇన్సులిన్ స్థాయులు పెరిగినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. తద్వారా స్త్రీలలో నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక బరువు, మొటిమలు, సంతానలేమి, అవాంఛిత రోమాలు వంటి పలు సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. పీసీఓఎస్ సమస్యను ఎంత త్వరగా నయం చేసుకుంటే అంత మంచిది.. లేదంటే గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం.. వంటి ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. మరి ఇందుకోసం డాక్టర్ సూచించిన మందులతో పాటు వ్యాయామం, సరైన పోషకాహారం.. వంటివి తప్పనిసరి. వీటితో పాటు ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలనూ ఉపయోగించడం వల్ల పీసీఓఎస్ నుంచి తొందరగా విముక్తి పొందచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

దుష్ప్రభావాలను తగ్గిస్తుంది..

మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాల్లో అవిసె గింజలు కూడా ఒకటి. వీటిలో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో విడుదలైన గ్లూకోజ్, ఇన్సులిన్‌లను ఉపయోగించుకుని పీసీఓఎస్ ద్వారా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి రోజూ వీటిని బ్రేక్‌ఫాస్ట్ లేదంటే పండ్ల రసాల్లో భాగంగా తీసుకోవడం మంచిది.

ఇన్సులిన్ అదుపులో..

పీసీఓఎస్ సమస్య తగ్గించుకోవాలంటే.. ముందుగా శరీరంలోని ఇన్సులిన్ స్థాయుల్ని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకు మెంతులు బాగా ఉపయోగపడతాయి. కొన్ని నీళ్లలో కాసిన్ని మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత వడకట్టిన నీటిని రోజూ పరగడుపున, లంచ్, డిన్నర్‌కి ఐదేసి నిమిషాల ముందు.. ఇలా మూడుసార్లు కొద్ది మోతాదులో తీసుకోవాలి. ఇలా రోజూ కొన్ని రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే రోజూ వంటకాల్లో మెంతిపొడినైనా ఉపయోగించవచ్చు. అలాగే మెంతుల వల్ల అధిక బరువు నుంచి విముక్తి పొందే అవకాశం కూడా ఉంటుంది.

బరువు తగ్గేలా..

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీసీఓఎస్‌తో పాటు ఏర్పడే మరో సమస్య స్థూలకాయం. ఇలా రోజురోజుకీ పెరుగుతున్న అధిక బరువు వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అధిక బరువు నుంచి ఎంత త్వరగా విముక్తి పొందితే అంత మంచిది. ఈ క్రమంలో తేనె బాగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె.. కొద్ది మొత్తాల్లో కలుపుకొని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి. తేనె ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి.. తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. తద్వారా శరీర బరువును క్రమంగా తగ్గించుకోవచ్చు.

చిటికెడు చాలు!

మధుమేహాన్ని అదుపు చేసే అద్భుతమైన ఔషధం దాల్చినచెక్క. ఇది పీసీఓఎస్ సమస్యను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగని దీన్ని మరీ ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది. కాబట్టి మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లో భాగంగా.. పెరుగు, పండ్ల రసాలు.. వంటివి తీసుకున్నప్పుడు వాటిపై చిటికెడు చల్లుకోవాలి. లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగొచ్చు. తద్వారా ఇన్సులిన్ స్థాయులు, రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా పీసీఓఎస్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.

పలు సమస్యలకు పరిష్కారం!

శరీరంలోని విషపదార్థాలను తొలగించడం, బరువును అదుపు చేయడంతో పాటు సంతానలేమికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఉసిరి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లే ఇందుకు కారణం. ఉసిరి.. రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి వీలైనప్పుడల్లా ఉసిరి రసం, లేదంటే ఉసిరికాయల్ని నేరుగా తీసుకోవడం మంచిది. ఫలితంగా పీసీఓఎస్ సమస్య కూడా నయమయ్యే అవకాశం ఉంటుంది.

ఆండ్రోజెన్లు అదుపులో..

పీసీఓఎస్‌తో బాధపడుతున్న మహిళల్లో అండాలు సరిగ్గా విడుదల కావు. దీంతో వారి శరీరం ఆండ్రోజెన్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. కాబట్టి అవి అలాగే నిల్వ ఉండిపోతాయి. తద్వారా ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు, ముఖం జిడ్డుగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు ఇలాంటి మహిళల్లో సంతానలేమి అవకాశాలు కూడా ఎక్కువే. ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే.. రోజూ ఉదయాన్నే పరగడుపున కొన్ని తులసి ఆకుల్ని నమలాలి. లేదా తులసి ఆకులు వేసి మరిగించిన నీరు తాగాలి. తులసి శరీరంలోని ఆండ్రోజెన్లను అదుపులో ఉంచుతుంది. తద్వారా సమస్య నుంచి క్రమంగా బయటపడచ్చు.

ఆండ్రోజెన్లను అదుపు చేయడానికి ఉపయోగపడే మరో ఔషధం చేపనూనె సప్లిమెంట్లు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్, ఆండ్రోజెన్ స్థాయుల్ని బ్యాలన్స్ చేస్తాయి. కాబట్టి చేపలు ఎక్కువగా తినడం, నిపుణుల సలహా మేరకు చేపనూనె సప్లిమెంట్లను ఉపయోగించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్