Published : 25/11/2021 19:25 IST

రక్తహీనత ఉందా? ఇవి తినండి!

ఇనుము/ఐరన్‌.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఐరన్ లోపిస్తే హెమోగ్లోబిన్ స్థాయులు తగ్గి రక్తహీనత బారిన పడే ప్రమాదం ఎక్కువ! ఇలాంటి సమస్యతో బాధపడుతోన్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నాయి తాజాగా విడుదలైన ‘గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్ట్‌’, ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’. మన దేశంలో 15-49 ఏళ్ల వయసున్న మహిళల్లో సుమారు 57 శాతం మంది రక్తహీనతను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. అంతేకాదు.. ఐదేళ్ల లోపు చిన్నారుల్లోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉందంటున్నాయి అధ్యయనాలు. నిజానికి ఇది ఎన్నో అనారోగ్యాలకు మూల కారణమవుతోందంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకే ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. మరి, ఏంటా పదార్థాలు? రండి.. తెలుసుకుందాం!

రక్తహీనత మూలంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. అలసట, నీరసం.. వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు.. నెలసరి సమయంలో బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవడం, ఒకవేళ గర్భం వచ్చినా అది నిలవకపోవడం, ప్రసూతి మరణాలు/మాతృ మరణాలు పెరిగిపోవడం.. వంటి ప్రత్యుత్పత్తి సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని అధిగమించాలంటే ఐరన్‌ అధికంగా ఉండే పదార్థాల్ని మెనూలో చేర్చుకోమంటున్నారు.

కిస్‌మిస్

ఇనుము లోపం ఉన్న వారికి కిస్‌మిస్‌ దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. వంద గ్రాముల కిస్‌మిస్‌లో 1.9 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. ఇది రోజూ కావాల్సిన దానిలో పదిశాతం.. రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఐరన్‌తో పాటు మరెన్నో పోషకాలను మిళితం చేసుకున్న కిస్‌మిస్‌లతో తీపి తినాలన్న కోరికను కూడా అదుపు చేసుకోవచ్చు. వీటిని ఉదయాన్నే ఓట్‌మీల్‌, సలాడ్స్‌, పెరుగు.. వంటి వాటిలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే స్నాక్స్‌ సమయంలోనూ తినచ్చు.

నువ్వులు

నువ్వులు తింటే వేడి చేస్తుందని వీటిని చాలామంది దూరం పెడుతుంటారు. కానీ అసలు విషయం తెలిస్తే రోజూ వీటిని తప్పకుండా తీసుకుంటారు. వందగ్రాముల నువ్వుల్లో ఏకంగా 14.6 శాతం ఐరన్ ఉంటుందట. అంటే రోజూ తీసుకోవాల్సిన ఐరన్‌లో దాదాపు ఎనభై శాతం అన్నమాట. నువ్వులను సలాడ్లు, పెరుగు, ఇతర ఆహారపదార్థాల్లో చల్లుకొని తీసుకోవడం, కూరల్లో నువ్వుల పొడి వేసుకోవడంతో పాటు నువ్వులు, బెల్లం కలిపి చేసిన ముద్దలు తీసుకోవడం వల్ల ఐరన్ శాతం ఇట్టే పెరుగుతుంది. ముఖ్యంగా గర్భధారణ వయసులో ఉన్న మహిళలకు ఐరన్ చాలా అవసరం కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.

డార్క్ చాక్లెట్

టేస్టీ టేస్టీగా ఆరోగ్యాన్ని పొందడం అంటే ఇదేనేమో..! చాక్లెట్ తినడం అంటే మనలో చాలామందికి ఇష్టం. అయితే అదే చాక్లెట్‌ని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. వంద గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుందట. ఇది మనం రోజూ తీసుకోవాల్సిన మొత్తంలో నలభై ఐదు శాతానికి పైనే.. ఇందులో కేవలం ఐరన్ మాత్రమే కాదు.. మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఇంకెన్నో పోషకాలు కూడా ఉంటాయి. అయితే ఎంత మంచిదైనా డార్క్ చాక్లెట్‌ని రోజూ ఓ చిన్న ముక్క కంటే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

ఎండుఫలాలు..

ఎండిన టొమాటోలు, అల్‌బుకారా, పీచ్, ప్రూన్స్, ఆప్రికాట్స్.. ఇలా ఎండిన ఫలాలన్నింటినీ తీసుకోవడం వల్ల ఐరన్ శాతం ఎంతో పెరుగుతుంది. ఈ ఫలాలన్నింటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రోజూ వీటన్నింటినీ కలిపి కనీసం ఒక్క సర్వింగ్ తీసుకుంటే చాలు.. మనం తీసుకోవాల్సిన ఐరన్‌లో పది నుంచి ఇరవై శాతం శరీరానికి అందినట్లే..! అంతేకాదు.. ఇందులోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా క్యాలరీలు కూడా తక్కువగా ఉండడం వల్ల బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. అయితే మరీ ఎక్కువగా కాకుండా రోజుకో రకం చొప్పున.. రెండు, మూడు పండ్లు మాత్రమే తినడం శ్రేయస్కరం.

ఇవి కూడా!

* కప్పు పాలకూర ద్వారా రోజు అందాల్సిన ఐరన్‌లో 15 శాతం లభిస్తుందట! దీంతో పాటు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి.

* కప్పు ఉడికించిన కాయ ధాన్యాల నుంచి సుమారు 37 శాతం ఐరన్‌ని పొందచ్చంటున్నారు నిపుణులు. అందుకే పప్పులు, రాజ్మా, చిక్కుళ్లు, శెనగలు.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.

* మాంసం, చేపల్ని కూడా వారానికోసారి మెనూలో చేర్చుకోవడం వల్ల ఐరన్‌తో పాటు ఇతర పోషకాల లోపం లేకుండా జాగ్రత్తపడచ్చు.

* వీటితో పాటు టోఫు, బ్రకలీ, క్వినోవా, గుమ్మడి గింజలు, బెల్లం.. వంటివి కూడా రోజువారీ శరీరానికి అందాల్సిన ఐరన్‌లో నుంచి కొంత శాతాన్ని భర్తీ చేస్తాయి.

ఇలా ఐరన్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూనే.. మరీ అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు ఐరన్‌ ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు.. వంటివి వేసుకొని శరీరంలో రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని