Published : 12/02/2023 12:51 IST

అందుకే అమ్మాయిలకు ఈ పోషకాలు అందాల్సిందే!

వృత్తి ఉద్యోగాలు, ఇంటి పనుల బిజీలో పడిపోయి చాలామంది మహిళలు తమకు తాము సమయం కేటాయించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆహారం విషయంలోనూ అశ్రద్ధ చూపేవారు లేకపోలేదు. ‘ఈ పూటకి ఏదో ఒకటి తిన్నామా.. కడుపు నిండిందా..’ అన్న ధోరణితోనే ఉంటారు అతివలు. ఈ నిర్లక్ష్యమే క్రమంగా పోషకాహార లోపానికి దారితీస్తుందని, దీని ప్రభావం అంతిమంగా నెలసరి ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ పోషకాహార లోపాన్ని సరిచేసుకోవడానికి చక్కటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆ సమస్యలకు చెక్‌ పెట్టే ‘ఐరన్’!

నెలనెలా నెలసరి సమయంలో మన శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంది. ఇది క్రమంగా రక్తహీనత (ఐరన్‌ లోపం)కు దారితీస్తుంది. అలాగే ఐరన్‌ లోపమున్నా పిరియడ్స్‌ సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువగా అవుతుంటుంది. తద్వారా నీరసం, అలసట, కడుపునొప్పి.. వంటి దుష్ప్రభావాలు తప్పవు! సుమారు 30 శాతం మంది మహిళలు నెలసరి సమయంలో, 42 శాతం మంది గర్భం ధరించే సమయంలో ఐరన్‌ లోపంతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ లోపాన్ని సవరించుకోవడానికి ఐరన్‌ అధికంగా లభించే ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో మాంసం, చేపలు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్‌, బీన్స్‌, పప్పుధాన్యాలు.. వంటివి తప్పనిసరిగా రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే శాకాహారుల్లో కూడా ఐరన్‌ లోపం ఎక్కువగా తలెత్తుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అలాంటివారు సోయా, టొమాటో, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, సీజనల్‌ పండ్ల ద్వారా ఆ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.

థైరాయిడ్ బాగుండాలంటే..

హార్మోన్ల అసమతుల్యత మన శరీరంలో ఎన్ని సమస్యల్ని తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెలసరి క్రమం తప్పడం, గర్భధారణ సమస్యలు, బరువులో హెచ్చుతగ్గులు.. వంటివన్నీ అందులో భాగమే! థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేసే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు అదుపు తప్పినా ఇలాంటి సమస్యలే వస్తాయి. మరి, దీన్ని సవరించుకోవాలంటే అయొడిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోవడం తప్పనిసరి! ఈ క్రమంలో పాలు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు, నల్ల ఎండుద్రాక్ష .. వంటివి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. అయొడిన్ జీవక్రియల పనితీరును మెరుగుపరిచి బరువును అదుపులో ఉంచుతుంది.

ఇది సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది!

పీసీఓఎస్‌.. ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న సమస్య ఇది. నెలసరి సమస్యలు, సంతానలేమి, అధిక బరువు.. వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుందిది. అయితే పీసీఓఎస్‌ ఉన్న వారిలో విటమిన్‌ డి స్థాయులు కూడా తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో అండం నాణ్యతను పెంచి, సంతాన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్‌-డిని ప్రధాన పోషకంగా పేర్కొంటారు నిపుణులు. అందుకే ఈ విటమిన్‌కు, గర్భధారణకు అవినాభావ సంబంధం ఉందని చెబుతుంటారు. కాబట్టి సంతాన సమస్యల్ని దూరం చేసుకోవాలంటే విటమిన్‌-డి పొందడం చాలా అవసరం. ఇందుకోసం ఉదయాన్నే నీరెండలో ఓ అరగంట పాటు ఉండడంతో పాటు పాలు, పెరుగు, చేపలు, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, మాంసం, చిలగడదుంప, అవకాడో.. వంటి పదార్థాల్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

అందుకే ముందు నుంచే ‘ఫోలేట్’!

విటమిన్‌-బి గ్రూపులో ఒకటైన ఫోలేట్‌ గర్భం ధరించిన మహిళలకు చాలా అవసరం. గర్భిణుల్లో ఇది లోపిస్తే పుట్టబోయే పిల్లల నాడీ వ్యవస్థలో లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవడానికి మూడు నాలుగు నెలల ముందు నుంచే ఫోలికామ్లం సప్లిమెంట్లు వేసుకోమని సలహా ఇస్తుంటారు నిపుణులు. ఇక వీటితో పాటు బ్రకలీ, ఆకుకూరలు, శెనగలు, పప్పుధాన్యాలు.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులకే కాదు.. సాధారణ మహిళలకూ ఈ పోషకం అవసరమే! ఎందుకంటే ఇది లోపిస్తే మన శరీరంలో రక్తహీనత తలెత్తుతుందంటున్నారు నిపుణులు. అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం ముఖ్యం!

మెనోపాజ్‌ దశలో బి-12 ఎందుకంటే..?!

మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి దశలోనూ పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. లేదంటే అది ఇతర అనారోగ్యాలకు కారణమయ్యే అవకాశముంది. అయితే మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టిన మహిళలకు మాత్రం విటమిన్‌ బి-12 అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. అది లోపిస్తే రక్తహీనతకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే నీరసం, అలసట, బరువు తగ్గడం, మతిమరుపు, ఆందోళన.. వంటి సమస్యలు తలెత్తుతాయట! అందుకే మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు ఆ సమయంలో ఎదురయ్యే అనారోగ్యాలను దూరం చేసుకొని చురుగ్గా ఉండాలంటే బి-12 అధికంగా లభించే చేపలు, మాంసం, గుడ్లు, పాలు, సెరల్స్‌.. వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ మరీ అత్యవసరమైతే మాత్రం వైద్యుల సలహా మేరకు బి-12 ఇంజెక్షన్స్‌ కూడా తీసుకోవచ్చట!

ఇక వీటితో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్‌-ఎ వంటి పోషకాలు కూడా మనకు ప్రతి దశలోనూ అవసరమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని