మొటిమలను తగ్గించే ఆహారం..!

చర్మ ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభావం ముఖం పైన ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీనికి ఉదాహరణే మొటిమల సమస్య. ఎంత అందమైన ముఖానికైనా వన్నె తగ్గించే సమస్య ఇది.

Published : 05 Jul 2024 12:42 IST

చర్మ ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభావం ముఖం పైన ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీనికి ఉదాహరణే మొటిమల సమస్య. ఎంత అందమైన ముఖానికైనా వన్నె తగ్గించే సమస్య ఇది. అందుకే వీటిని తగ్గించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదో ఒకసారి చూద్దామా..

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు..

ముఖంపై మొటిమలు రావడానికి కారణమయ్యే సీబమ్ ఉత్పత్తిని అరికట్టే సామర్థ్యం ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల్లో ఉంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికే కాదు, మొటిమలను తగ్గించడంలోనూ ఈ ఆమ్లాలు సమర్థంగా పనిచేస్తాయి. చేపలు, ఆకుకూరలు, వాల్‌నట్స్, ఆలివ్‌నూనె, బీన్స్, గుడ్లు, అవిసె గింజల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని మధ్యాహ్నం లేదా రాత్రిపూట ఆహారంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్ టీ..

గ్రీన్ టీతో చర్మానికి ఎంతో మేలు కలుగుతుందని చాలాసార్లు వినే ఉంటాం. చర్మ కాంతిని మెరుగుపరచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కేవలం సౌందర్యానికే కాదు, చర్మ ఆరోగ్యానికి కూడా గ్రీన్ టీ చక్కటి ఔషధం లాంటిది. మొటిమల సమస్య ఎక్కువగా బాధిస్తున్నవారు రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోయి, మొటిమల సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు. దీనికి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలే కారణం.

టొమాటోతో..

టొమాటోలలో ఉండే ‘లైకోపిన్’ అనే యాంటీఆక్సిడెంట్ చర్మ సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. వీటిని వంటల్లో ఎక్కువగా వాడడం వల్ల మొటిమల సమస్య నుంచి సులభంగా గట్టెక్కవచ్చు. టొమాటోలను సూప్ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాన్ని పొందచ్చు.

ద్రవ పదార్థాలు..

సరిపడినన్ని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ సులభమైన చిట్కాను పాటించేవారు మాత్రం తక్కువే అని చెబుతున్నారు నిపుణులు. అయితే చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే అన్నిటికంటే కీలకమైంది నీరే. అందుకే మొటిమల సమస్య దరిచేరకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యను తగ్గించుకోవడానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలనేది నిపుణుల సలహా. వీటితో పాటు రోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్లు లేదా తాజా కూరగాయల రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


ఇవి వద్దు!

మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయులు ఎంత ఎక్కువగా ఉంటే, మొటిమలు వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయట. దీనికి కారణం.. ఇవి చర్మం పైన ఉండే స్వేద రంధ్రాలను మూసేసి, వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో బయటకు పోకుండా అడ్డుకుంటాయి. అందుకే మొటిమల సమస్యతో బాధపడేవారు చక్కెర శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకుంటే మంచి ఫలితాలను పొందచ్చట.

మరిన్ని చిట్కాలు..

⚛ ‘విటమిన్ ఇ’ ఎక్కువగా ఉండే నట్స్, గుడ్లు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకుంటే మొటిమల సమస్య బాధించదు.

⚛ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా మొటిమల సమస్య ఎక్కువవుతుంది.

⚛ వేళకు నిద్రపోవడం, కనీస వ్యాయామం వల్ల మొటిమల సమస్య దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తలలో చుండ్రు లేకుండా చూసుకోవడం వంటివి కూడా మొటిమలను తగ్గించుకునే ప్రత్యామ్నాయ మార్గాలే...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్