Updated : 22/01/2022 15:19 IST

వానల్లో పాదాల సంరక్షణ ఇలా...

వర్షం కురిస్తే చాలు.. నీటిలోనే జీవనం.. వర్షం వల్ల రోడ్లపైకి బురద వచ్చి చేరుతుంది. లేదంటే వర్షపు నీరు అంతా రహదారిపైనే నిలిచిపోతుంది. అలాంటి సందర్భాల్లో కాళ్లకు బురద అంటుకోవడంతో పాటు.. ప్రమాదకరమైన క్రిములు సైతం మన పాదాల మీదకు చేరుకుంటాయి. దీనికి తోడు పాదాలు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి కాబట్టి అవి ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. వర్షాకాలంలో సైతం పాదాల అందాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు..

పాదరక్షలు ఇలా..

వర్షాకాలంలో వేసుకొనే పాదరక్షల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో వీటివల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కాలంలో వీలైనంత వరకు బూట్లను ధరించకుండా ఉండాలి. ఎందుకంటే వర్షం కురుస్తున్న సమయంలో టూవీలర్ పైన వెళుతున్నప్పుడు లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు వీటిలోకి నీరు చేరే అవకాశం ఉంది. ఈ నీటిలో పాదాలు ఎక్కువ సమయం ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే పాదాలను పూర్తిగా కప్పి ఉంచే పాదరక్షలకు దూరంగా ఉండాలి. వాటికి బదులు పాదాలకు గాలి తగిలేలా ఉండే ఫుట్‌వేర్ ఎంచుకోవడం మంచిది.

శుభ్రత కూడా ముఖ్యమే..

మనం ఎన్ని చిట్కాలు పాటించినా పాదాల శుభ్రత విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇన్ఫెక్షన్లకు గురవ్వాల్సి వస్తుంది. అందుకే వర్షాకాలంలో బయట నుంచి తిరిగి రాగానే పాదాలను లిక్విడ్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదంటే సబ్బును ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాదాలను బాగా పొడిగా తుడుచుకొని వేళ్ల మధ్యలో యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి. అలాగే కాలిగోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. లేదంటే వాటిలో మురికి చేరి దురదలు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాదాలు పొడిగా ఉన్నాయని నిర్ధరించుకున్న తర్వాతే సాక్స్ తొడుక్కోవాలి.

స్క్రబ్ తప్పనిసరి..

వర్షాకాలంలో పాదాలను రోజూ స్క్రబ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల పాదాలు పగలకుండా ఉంటాయి. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ లేదా లిక్విడ్ సోప్ కలుపుకోవాలి. దీనిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఫుట్ స్క్రబ్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే రోజూ ప్యుమిస్ స్టోన్‌ని ఉపయోగించి పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోవడమే కాకుండా పాదాలకు రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అయితే దీనికోసం నాణ్యమైన ఉత్పత్తులను వాడటం మంచిది.

గాయాలు లేకుండా..

పాదాలకు గాయాలు ఉన్నట్లయితే వాటి ద్వారా బ్యాక్టీరియా, రోగాలను కలిగించే ఇతర క్రిములు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. వర్షాకాలంలో ఈ బెడద మరీ ఎక్కువ. అందుకే పాదాలకు గాయాలవకుండా చూసుకోవాలి. ఒకవేళ గాయాలున్నట్లయితే తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం. రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కచ్చితంగా యాంటీసెప్టిక్ క్రీం రాసుకోవాలి.

ఇవి వద్దు..

సాధారణంగా చాలామంది పాదాల అందాన్ని పెంచుకోవడానికి పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు. అయితే వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెడిక్యూర్ చేయించుకోకపోవడమే మంచిది. కొన్ని బ్యూటీ పార్లర్స్‌లో అందరికీ ఒకే వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే తప్పనిసరిగా పెడిక్యూర్ చేయించుకోవాలనుకున్న సందర్భంలో నీటిలో మరగబెట్టి శుభ్రం చేసిన వస్తువులు ఉపయోగించేలా చూసుకోవాలి. ఈ సమయంలో ప్రత్యేకించి ఫిష్ పెడిక్యూర్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. చేపలు ఉంచిన నీటిని ఎప్పటికప్పుడు మార్చకపోతే అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో పాదాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని