Women IGs: ఆ సవాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నాం.. ఈ స్థాయికి చేరాం!

‘వృత్తిలో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఎన్నో విషయాలు నేర్చుకోగలం.. ఆ అనుభవమే మనల్ని అందలమెక్కిస్తుంది..’ అంటున్నారు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా అధికారులు అనీ అబ్రహాం, సీమా ధుండియా. పారామిలిటరీ బలగాల్లోకి చేరిన తొలి తరం మహిళలుగా పేరుగాంచిన వీరు.. తాజాగా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ)...

Published : 04 Nov 2022 14:10 IST

(Photos: Twitter)

‘వృత్తిలో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఎన్నో విషయాలు నేర్చుకోగలం.. ఆ అనుభవమే మనల్ని అందలమెక్కిస్తుంది..’ అంటున్నారు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా అధికారులు అనీ అబ్రహాం, సీమా ధుండియా. పారామిలిటరీ బలగాల్లోకి చేరిన తొలి తరం మహిళలుగా పేరుగాంచిన వీరు.. తాజాగా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ)గా పదోన్నతి పొందారు. తద్వారా ఈ హోదా దక్కించుకున్న తొలి మహిళా ద్వయంగా చరిత్రకెక్కారు.

సీఆర్‌పీఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌)లోకి మహిళల్ని నియమించుకోవడం 1987 నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో తొలి దశలో విధుల్లో చేరారు అనీ అబ్రహాం, సీమా ధుండియా. తమ 35 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన ఈ మహిళా ఆఫీసర్లు.. తాజాగా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ)గా పదోన్నతి పొందారు. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్‌ కేంద్ర కార్యాలయం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అనీ.. ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (RAF)’కు ఐజీగా, సీమా.. సీఆర్‌పీఎఫ్‌ బిహార్‌ సెక్టార్‌కు ఐజీగా నియమితులయ్యారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళలుగా నిలిచిందీ ద్వయం.

ఆ ధైర్యమే అందలమెక్కించింది!

దిల్లీకి చెందిన సీమ.. 1987లో తొలి దశ మహిళా సీఆర్‌పీఎఫ్‌ బలగాల్లో విధుల్లో చేరారు. ఆపై రెండో మహిళా బెటాలియన్‌ను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో కొన్నేళ్ల పాటు ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌’కు డీఐజీగా పనిచేసిన సీమ.. దేశవ్యాప్తంగా అతి ప్రమాదకర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు.

‘మొదట్లో భద్రతా బలగాల్లో చేరడానికి మహిళలు భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రాన్రానూ చాలామంది మహిళలు ఈ విభాగాల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఇక్కడ మహిళలకు అనువైన వాతావరణ పరిస్థితులు, సౌకర్యాలు లభిస్తుండడంతో పాటు ప్రతిభ-పనితీరుకు తగ్గట్లుగా పదోన్నతులు కల్పించడం కూడా ముఖ్య కారణాలుగా చెప్పచ్చు. నేను సీఆర్‌పీఎఫ్‌లో చేరిన కొత్తలో పురుషాధిపత్యం ఎక్కువగా ఉండేది. అలాగని మా ప్రతిభ వాళ్లకు ఏమాత్రం తీసిపోదు. ఇదే విషయాన్ని నిరూపిస్తూ ముందుకు సాగాం. ఇంకా చెప్పాలంటే ప్రతిభ-పనితీరులో వాళ్ల కంటే ఓ మెట్టు పైనే ఉండేవాళ్లం. ఈ కృషి వల్లే కొన్నాళ్ల కు మాకూ పురుషులతో సమానమైన ఆదరణ, సౌకర్యాలు దక్కడం ప్రారంభమైంది. ఈ 35 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అతి సున్నితమైన, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాను. ఇక ఇప్పుడు నన్ను ఐజీగా నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ బృహత్తర బాధ్యతలో భాగంగా పూర్తి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఇది నా ఒక్కదాని విజయమే కాదు.. సీఆర్‌పీఎఫ్‌ బలగాల్లో మహిళలు సాధించిన గొప్ప ఘనత. ఇతర మహిళా ఆఫీసర్లు కూడా ఇలాంటి ఉన్నత స్థానాల్ని అధిరోహించాలని కోరుకుంటున్నా..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు సీమ.


‘అయోధ్య’లో తొలి పోస్టింగ్!

సవాళ్లు ఎదురైనప్పుడే మనలోని సత్తా ఏంటో నిరూపించుకోవచ్చంటున్నారు మరో ఆఫీసర్‌ అనీ. 35 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో క్లిష్టమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారామె. ఈ క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటున్నారీ మహిళా అధికారిణి.
‘1986లోనే సీఆర్‌పీఎఫ్‌లో చేరినా.. ఏడాది శిక్షణ ముగిశాక ఆ మరుసటి ఏడాది మమ్మల్ని విధుల్లోకి తీసుకున్నారు. ఇక 1992లో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఏర్పడ్డాక.. అందులోకి బదిలీ అయ్యా. సీఆర్‌పీఎఫ్‌లో భాగంగా నాకు అయోధ్యలో తొలి పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ రామ మందిరానికి సంబంధించిన అల్లర్లు జరుగుతున్నాయి. దీనివల్ల మొదట్లో అక్కడ పనిచేయడం కాస్త క్లిష్టంగానే అనిపించినా.. చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రమాదకర ప్రాంతాల్లోనూ విధులు నిర్వర్తించాను. ఉగ్రవాద ప్రాంతమైనా, ఎన్నికలు జరిగే చోటైనా, తిరుగుబాటుదారుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలన్నా.. ఇలా క్లిష్టమైన ప్రాంతాల్లో పనిచేయడం మా కర్తవ్యం! ఈ క్రమంలో ఇటు కుటుంబానికి ప్రాధాన్యమివ్వడం, అటు వృత్తిలో సక్సెసవడం అంటే.. పూర్తిగా సవాళ్లతో కూడుకున్న అంశం. అయినా ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మహిళలే మహిళల్ని ముందుకు నడిపించగలరనేది నా నమ్మకం. అందుకే మా స్ఫూర్తితో భద్రతా బలగాల్లో మహిళల పాత్ర, ప్రాధాన్యం మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నా..’ అంటారు అనీ.

లైబీరియాలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన తొలి మహిళా పోలీస్‌ యూనిట్‌కు ‘కంటింజెంట్ కమాండర్స్‌’గానూ విధులు నిర్వర్తించారు ఈ ఇద్దరు మహిళా అధికారులు. వీళ్ల పనితీరును మెచ్చిన భారత ప్రభుత్వం ఇద్దరినీ ‘రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌’, ‘ఉత్కృష్ట్‌ సేవా పదక్’ వంటి పురస్కారాలతో గౌరవించింది. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు అవార్డులూ, రివార్డులూ అందుకున్నారీ ఇద్దరు మహిళా ఐజీలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్