Published : 20/09/2021 18:26 IST

ఐయామ్ వెరీ సారీ.. అనేద్దాం వందోసారి..!

అనూష, రాధిక ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. మొదటిసారి చూసినవాళ్లు అక్కచెల్లెళ్లే అనుకోవాలి.. అలా ఉండేవాళ్లు! అయితే ఓ చిన్న గొడవ వల్ల ఇప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. తప్పెవరిది? అన్న విషయం పక్కన పెడితే తప్పు చేసిన వాళ్లు ఆ విషయాన్ని ఒప్పుకోవడం, అటుపక్కవాళ్లూ క్షమించడం వల్లే బంధాలు గట్టిపడతాయి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం 'క్షమించడం' అంటూ ఠాగూర్ సినిమాలో చిరంజీవి సీరియస్ డైలాగ్ చెప్పినా.. క్షమించడం, క్షమాపణ అడగటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అయితే క్షమించడానికి మంచి మనసుండాలి.. అలాగే క్షమాపణ అడగడానికి చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం, నేర్పు ఉండాలి. ఇవన్నీ మన సొంతమైతే - మనం కూడా 'అందరివాళ్లు' గా మారడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీరూ అలా మారాలనుకుంటున్నారా? అయితే 'సారీ' అనే మ్యాజికల్ వర్డ్‌కున్న పవర్ ఏంటో మీరే తెలుసుకోండి...

జీవితం మనకు ఎన్నో బంధాలను అందించింది. కానీ వాటిని కాపాడుకునే బాధ్యతను మాత్రం మన చేతుల్లోనే ఉంచింది. ఎందుకో తెలుసా?? ఆ బంధాలనేవి అద్దాల్లాంటివి. ఒక్కసారి పగిలితే తిరిగి అతుక్కోవు. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగని ఎంత సొంతవారైనా మనుషులన్నాక అభిప్రాయభేదాలు సహజం. అలాంటి సందర్భాల్లో తెలిసో, తెలియకో మన వల్ల ఇతరులు, ఇతరుల వల్ల మనం 'హర్ట్' అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి... అలా ఒకసారి 'హర్ట్' అయ్యాం అని ఆ బంధాన్నే తెంచేసుకోలేం కదా.. ఇలాంటప్పుడే 'క్షమించడం' 'క్షమాపణ కోరడం' అన్నవి అవసరమవుతాయి. మనమేదైనా తప్పు చేస్తే ఒకే ఒక్క తారకమంత్రం సారీతో.. వాటిని ఒప్పుకోవడం వల్ల ఇతరులు మనల్ని అపార్థం చేసుకునే వీలుండదు. అలాగే ఇతరులు చేసిన తప్పును క్షమించడం వల్ల వాళ్ల మనసుల్లో నిలిచిపోవడమే కాకుండా, మన మనసూ ప్రశాంతంగా ఉంటుంది.

కోపతాపాలకు సెలవు

సులువుగా క్షమాపణ కోరడం, క్షమించగలగటం ఇద్దరి మధ్య కోపతాపాలను తగ్గిస్తుంది. ఒకరి పట్ల ఇంకొకరికి గౌరవాన్ని పెంచుతుంది. ఎదుటివాళ్లు చేసిన పనులు, మాటల వల్ల మనకు కోపం రావడం సహజం. అయితే కోపాన్ని అదుపు చేసుకోగలగడమే మన గొప్పతనం. అలా అని లోపల విపరీతమైన కోపం ఉన్నా.. బయటకు వారిని క్షమించేసి, లోలోపల ఉడికిపోవడం సరికాదు. కాబట్టి ఎదుటివారిని మనస్ఫూర్తిగా క్షమించగలిగే క్షమా గుణాన్ని అలవర్చుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

క్షమాపణలో దశలు

అయితే 'క్షమించమని అడగడం' మన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఎంత పెద్ద పొరపాట్త్లెనా చేసేయొచ్చు. తర్వాత సింపుల్‌గా 'సారీ' అంటే సరి అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. క్షమించమని అడగడమంటే జస్ట్ సారీ చెప్పి వెళ్లిపోవడం కాదు.. క్షమాపణ కోరడంలోనూ వివిధ దశలుంటాయి. మనం చేసే తప్పు తీవ్రతపై అవి ఆధారపడి ఉంటాయి.

* చిన్నచిన్న పొరపాట్త్లెతే దానికి మనం ఫీలవుతున్నామన్న భావన ఎదుటివారికి తెలిసేలా సారీ చెప్పాలి.

* రెండో దశలో జరిగిన పొరపాటుకు మనదే బాధ్యత అని తెలియజేయడం ముఖ్యం. ఇంకోసారి ఈ పొరపాటు జరగనివ్వమనే భావన మన మాటల్లో ధ్వనించాలి.

* మూడో దశలో మనం చేసిన పొరపాటు ఏ పరిస్థితుల్లో జరిగిందో వారికి వివరించే ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో జరిగిన దాంట్లో మన తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేయకూడదు. మన తప్పును ఒప్పుకుంటూనే దానికి దారితీసిన కారణాలను చెప్పాలి.

* ఇవి మూడూ చేసిన తర్వాత వారిని క్షమాపణ అడగగలిగితే వారు తప్పక క్షమిస్తారు.

* ఆ తర్వాత దశలో మనం చేసిన తప్పును ఒప్పుకుంటున్నామన్న భావనను వీలైతే స్పర్శ ద్వారా తెలియజేయాలి. చేతులు పట్టుకోవడం, మరీ దగ్గరివారైతే కౌగిలించుకోవడం ద్వారా మన మనసులోని భావాలను వ్యక్తం చేయచ్చు.

క్షమించే గుణమూ ఉండాలి

పొరపాటు చేసినప్పుడు ఎదుటివారిని క్షమాపణ అడగడమే కాదు. ఎదుటివారు క్షమాపణ చెప్పినప్పుడు వారిని మన్నించగలిగే మనస్తత్వమూ ఉండాలి. వాళ్ల తప్పులను క్షమించడం వాళ్లకెంత అవసరమో మనకూ అంతే అవసరం. లేకపోతే దానికి సంబంధించిన ఆలోచనలు మన మనసులో ఉండిపోతాయి. తీవ్రంగా బాధిస్తాయి... అవతలివారు తప్పు చేసినప్పుడు వారేం చెప్పదల్చుకున్నారో.. ఒకసారి పూర్తిగా వినండి. వాళ్లే పరిస్థితిలో ఆ పని చేశారో కనుక్కోండి. వాళ్లు చెప్పే కారణాలు 'రీజనబుల్'గా అనిపిస్తే మనసారా వాళ్లను క్షమించండి. దీనికోసం ఒక్కసారి మిమ్మల్ని మీరు వాళ్ల పరిస్థితిలో వూహించుకొని ఆలోచించండి. ఓసారి క్షమించిన తర్వాత మళ్లీ వారి తప్పును గుర్తు చేసుకోకండి.

చూశారుగా.. క్షమాపణ అడగడం, మన్నించడం రెండూ మన సంబంధబాంధవ్యాలలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మీ ఆత్మీయులెవరైనా 'ఐయామ్ వెరీ సారీ.. అన్నాగా వందోసారి' అన్నప్పుడు పెద్దమనసుతో వారిని క్షమించేయండి! అలాగే మీరు 'సారీ' చెప్పాల్సొచ్చినప్పుడూ వెనకాడకండి.. అప్పుడు మీ రిలేషన్‌షిప్ ఎప్పటికీ 'హ్యాపీ రిలేషన్‌షిప్' గానే మిగిలిపోతుంది!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి