Varnika Shukla : నా కూతురి కోసం అతని వేధింపులు భరించా!

పెళ్లై, పిల్లలు పుట్టాక మహిళల జీవితమే మారిపోతుంది. కన్న బిడ్డలే తమ సర్వస్వంగా భావిస్తుంటారు. భర్త, అత్తమామల నుంచి వేధింపులు ఎదురైనా.. తన పిల్లలు తండ్రి ప్రేమకు దూరం కాకూడదని వాటినీ....

Published : 08 May 2023 19:42 IST

(Photos: Instagram)

పెళ్లై, పిల్లలు పుట్టాక మహిళల జీవితమే మారిపోతుంది. కన్న బిడ్డలే తమ సర్వస్వంగా భావిస్తుంటారు. భర్త, అత్తమామల నుంచి వేధింపులు ఎదురైనా.. తన పిల్లలు తండ్రి ప్రేమకు దూరం కాకూడదని వాటినీ భరించేవారు ఎంతోమంది! ఉత్తరప్రదేశ్‌కు చెందిన వర్ణికా శుక్లా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎన్నో కలలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె.. భర్త ప్రేమకు నోచుకోలేకపోయింది.. ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న అక్కసుతో అత్తమామల నుంచి ఆరళ్లూ తప్పలేదామెకు. అయినా తన కూతురి కోసం అన్నీ మౌనంగా భరించింది వర్ణిక. ఇక ఒకానొక దశలో సహనం కోల్పోయి వైవాహిక బంధం నుంచి బయటికొచ్చేసిన ఆమె.. ఏకంగా ‘మిసెస్‌ ఇండియా కిరీటా’న్నే ఒడిసిపట్టింది. ప్రస్తుతం సింగిల్‌ మదర్‌గా తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూనే.. మరోవైపు డిజిటల్‌ క్రియేటర్‌గానూ రాణిస్తోంది. ‘స్వీయ నమ్మకంతో కష్టపడితే అసాధ్యమనేదే లేదం’టోన్న ఈ బ్యూటిఫుల్‌ మామ్.. ఇటీవలే తన కథను ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌తో పంచుకుంది. ఎంతోమంది మహిళల్లో, ఒంటరి తల్లుల్లో స్ఫూర్తి నింపుతోన్న ఆ కథేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..

‘మాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌. సంప్రదాయ విలువలకు ప్రాధాన్యమిచ్చే కుటుంబంలో పుట్టిపెరిగాను. పీజీ వరకు చదువుకున్నా. అందరమ్మాయిల్లాగే నేనూ నా వైవాహిక బంధం గురించి ఎన్నో కలలు కన్నాను. దిల్లీలో మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ద్వారా నాకు కాబోయే భర్తను కలుసుకున్నాను. 2012లో ఇరువైపులా పెద్దల అంగీకారంతో మా పెళ్లైంది.

‘ఆడపిల్ల పుట్టింద’ని!

రోజులు గడుస్తున్న కొద్దీ నా భర్తలో క్రమంగా మార్పు గమనించా. తను బయటికి కనిపించేంత సున్నితమైన వ్యక్తి కాదని నాకు అర్థమైంది. తనకు అనుమానమెక్కువ.. మా ఇద్దరి మధ్య గొడవైనప్పుడల్లా తన వాదనే నెగ్గాలనుకునేవాడు. ఒకవేళ అలా జరగకపోతే తనకు తాను హాని తలపెట్టుకోవడానికీ వెనకాడే వాడు కాదు. నేను గర్భవతినయ్యాక పని మీద తను లండన్‌ వెళ్లాడు. ఆ సమయంలో నేను మా పుట్టింటికి వెళ్లకూడదని, తన తల్లిదండ్రులే నా వద్దకొచ్చి నన్ను చూసుకుంటారని చెప్పాడు. కానీ ఎవరూ రాలేదు. ఒంటరిగానే ఆ తొమ్మిది నెలలు గడిపా. ఇక పాప పుట్టాక పరిస్థితులు మరింత దిగజారాయి. మా అత్తింటి వారిది గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబం.. పైగా నిరక్షరాస్యులు.. ఆడపిల్ల పుట్టిందని ఆరళ్లు పెట్టేవారు.. మాటలతో హింసించేవారు. అయినా అన్నీ భరించా. ఇక నేను కూడబెట్టుకున్న డబ్బుతో నా కూతురి మొదటి పుట్టినరోజు ఘనంగా నిర్వహించా. కానీ అది నా భర్తకు నచ్చక నలుగురిలోనే నాపై చేయి చేసుకున్నాడు. అయినా నా కూతురి కోసం మౌనంగా భరించా. కానీ ఒక రోజు నా పాప పైనా దాడి చేశాడు. అది నన్ను చాలా బాధపెట్టింది. అప్పుడే అతనితో అనుబంధం తెంచుకొని బయటకొచ్చేశా.

నా కూతురికి నేనే రోల్‌ మోడల్!

అలా 2016లో ఇంటి నుంచి బయటికొచ్చేసిన నేను పలు సవాళ్లను ఎదుర్కొన్నా. ఆ సమయంలో మా పుట్టింటి వారే నాకు అండగా నిలిచారు. అయినా నా బిడ్డ నాన్న లేకుండా పెరుగుతుందన్న ఆలోచనలు, నా కంటూ సొంత గుర్తింపు లేదన్న బాధ నన్ను వెంటాడేవి. అప్పుడే ఈ సమస్యల వలయం నుంచి ఎలాగైనా బయటపడాలన్న పట్టుదల పెరిగింది. ఇదే 2018 లో నేను ‘గ్లామాన్‌ మిసెస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొనేలా చేసింది. అమ్మానాన్నల్ని ఒప్పించి నన్ను నేను నిరూపించుకోవడానికే ఈ పోటీల్లో పాల్గొన్నా. పట్టుదలతో కిరీటం ఒడిసిపట్టా. ఈ పోటీల్లోనే ‘బెస్ట్‌ క్యాట్‌వాక్‌’ సబ్‌టైటిల్‌ కూడా నాకే వచ్చింది. ఇక అదే ఏడాది ‘ప్లస్‌ సైజ్‌ మోడలింగ్‌ పోటీ’లో పాల్గొని ‘ప్రయాగ్‌రాజ్‌లోనే తొలి ప్లస్‌ మోడల్‌’గా గెలుపొందా. ఈ విజయాలు నాలో ఆత్మవిశ్వాసం నింపాయి. నా జీవితంలో నేను పడ్డ కష్టాలకు ప్రతిఫలమివి. ప్రస్తుతం నేను ఒంటరి తల్లిగానే నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. స్వీయ నమ్మకంతో కష్టపడితే సాధించలేనిదేదీ ఉండదని నా కూతురికి నిరూపించి చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.. అలాగే నా కూతురికి అత్యుత్తమ జీవితాన్నివ్వాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నా.. ‘అమ్మా.. నువ్వే నాకు అమ్మ, నాన్న’ అని తను అంటుంటే ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోతుంటుంది. ప్రస్తుతం టీచర్‌గా, ఫ్రీలాన్స్‌ మోడల్‌గా, డిజిటల్‌ క్రియేటర్‌గా కొనసాగుతున్నా. మరోవైపు షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ నటిస్తున్నా.

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో సవాళ్లుంటాయి. మన ప్రత్యేకతలపై దృష్టి పెట్టి వాటిని అధిగమించినప్పుడే.. మనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోగలం.. మన పిల్లలకూ ఆదర్శంగా నిలవగలం..’ అంటోంది వర్ణిక. ఇలా ఆమె పంచుకున్న కథ ప్రస్తుతం ఎంతోమంది ఒంటరి తల్లుల్లో, గృహహింస బాధితుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని