Forbes List: అమెరికాలో.. మన ధనలక్ష్ములు!

వ్యాపార రంగంలో మహిళలు దూసుకుపోతున్నారు. అందులోనూ స్వశక్తితో ఎదిగే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తమ వ్యూహాలతో వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ.. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో శ్రీమంతురాళ్లుగా....

Published : 11 Jul 2023 20:58 IST

వ్యాపార రంగంలో మహిళలు దూసుకుపోతున్నారు. అందులోనూ స్వశక్తితో ఎదిగే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తమ వ్యూహాలతో వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ.. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో శ్రీమంతురాళ్లుగా ఎదుగుతున్నారు. అమెరికాలో అలాంటి మహిళా పారిశ్రామిక వేత్తల సంపదను పరిగణనలోకి తీసుకొని స్వయంకృషితో ఎదిగిన వంద మంది మహిళా సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది ఫోర్బ్స్‌ పత్రిక. ఇందులో భారత సంతతికి చెందిన నలుగురు మహిళా వ్యాపారవేత్తలు చోటు దక్కించుకున్నారు. మరి, వారెవరు? వాళ్ల వ్యాపార ప్రయాణమేంటో తెలుసుకుందాం రండి..

జయశ్రీ ఉల్లాల్‌, అరిస్టా నెట్‌వర్క్స్‌ సీఈఓ, అధ్యక్షురాలు

పెద్దగా లాభాలు లేని కంపెనీ బాధ్యతలు చేపట్టి.. తమ వ్యాపార దక్షతతో లాభాల బాట పట్టిస్తున్నారు కొందరు మహిళలు. జయశ్రీ ఉల్లాల్‌ కూడా అదే కోవకు చెందుతారు. 2008లో ప్రముఖ నెట్‌వర్కింగ్‌ కంపెనీ అరిస్టా నెట్‌వర్క్స్‌లో ఆమె చేరే నాటికి ఆ సంస్థలో కేవలం 50 మంది ఉద్యోగులే ఉన్నారు. అప్పటికి అంతగా లాభాలు కూడా నమోదు కాలేదు. అలాంటి సంస్థను 2020 నాటికి బిలియన్‌ డాలర్ల కంపెనీగా మార్చేశారు జయశ్రీ. గతేడాది 4.4 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించిందీ నెట్‌వర్కింగ్‌ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ సీఈఓ, అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జయశ్రీ. 2.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 19784 కోట్లు) నికర సంపదతో ఫోర్బ్స్‌ జాబితాలో 15వ స్థానంలో నిలిచారామె.
లండన్‌లో పుట్టిన జయశ్రీ.. దిల్లీలో స్కూలింగ్‌ పూర్తిచేశారు. ఆపై పైచదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె.. శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, శాంటాక్లారా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. అరిస్టాలో చేరకముందు పలు నెట్‌వర్కింగ్‌ సంస్థల్లో పనిచేసిన ఆమె.. ప్రస్తుతం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ స్నోఫ్లేక్‌ బోర్డ్ సభ్యుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.


నీర్జా సేథి, సింటెల్‌ సహ-వ్యవస్థాపకురాలు

అమెరికా వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు నీర్జా సేథి. 1980లో తన భర్త భరత్‌ దేశాయ్‌తో కలిసి సింటెల్‌ ఐటీ కన్సల్టింగ్‌ సంస్థను ప్రారంభించిన ఆమె.. మొదట సంస్థ కార్యకలాపాల్ని మిషిగన్‌లోని తన అపార్ట్‌మెంట్‌ వేదికగా నిర్వహించారు. ఆపై తన వ్యాపార వ్యూహాలతో సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు సాగించారు. అయితే 2018లో ఫ్రెంచ్‌ ఐటీ కంపెనీ ‘అటోస్‌ ఎస్‌ఈ’ ఈ సంస్థను 3.4 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో నీర్జా 510 మిలియన్‌ డాలర్ల నికర ఆస్తులు పొందినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. ప్రస్తుతం 990 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 8161 కోట్లు) సంపదతో ఫోర్బ్స్‌ జాబితాలో 25వ స్థానంలో ఉన్నారామె. దిల్లీ యూనివర్సిటీలో ఆర్ట్స్‌/సైన్స్‌ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన నీర్జా.. అదే విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. ఆపై ఓక్లాండ్‌ యూనివర్సిటీలో సైన్స్‌ విభాగంలో మాస్టర్స్‌ చదివారు.


నేహా నర్ఖడే, Oscilar వ్యవస్థాపకురాలు, సీఈఓ

స్వయంశక్తితో మిలియనీర్‌గా ఎదిగిన మహిళగా పేరు తెచ్చుకుంది పుణేకు చెందిన నేహా నర్ఖడే. జార్జియాలో టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్‌ చేసిన ఆమె.. ఒరాకిల్‌, లింక్డిన్‌.. వంటి ప్రముఖ కంపెనీల్లో పని చేసింది. ఈ క్రమంలోనే మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ‘Apache Kafka’ అనే సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది నేహ. ఆపై 2014లో ‘కాన్‌ఫ్లుయెంట్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థను నెలకొల్పింది. వ్యాపార సంస్థలు.. తమ ఉత్పత్తులు, సేవలు, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వారధి ఇది. ఇక ఈ ఏడాది  Oscilar అనే సంస్థను నెలకొల్పిన ఆమె.. ప్రస్తుతం ఈ కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌.. వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫిన్‌టెక్‌ సంస్థల్లో మోసాల్ని గుర్తించే సంస్థ ఇది. ప్రస్తుతం ఈ సంస్థ అభివృద్ధి కోసం వ్యూహాలు రచిస్తోన్న నేహ.. 520 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 4286 కోట్ల) ఆస్తులతో తాజా ఫోర్బ్స్‌ జాబితాలో 50వ స్థానంలో కొనసాగుతున్నారు.

‘నేను పెరిగి పెద్దయ్యే క్రమంలో నాన్న నాకు బోలెడన్ని పుస్తకాలు తెచ్చిచ్చేవారు. అవన్నీ ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాణించి మేటిగా నిలిచిన ఇందిరా గాంధీ, ఇంద్రా నూయీ, కిరణ్‌ బేడీ.. వంటి వాళ్లవే. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొనే ఐటీ రంగంలోకి వచ్చాను. మహిళలు తలచుకుంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు.. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠమిదే!’ అంటోన్న నేహ.. మంచి రచయిత్రి, వక్త కూడా!


ఇంద్రా నూయీ, పెప్సీకో మాజీ ఛైర్‌పర్సన్‌, సీఈఓ

ప్రముఖ శీతల పానీయాలు-స్నాక్‌ ఫుడ్‌ సంస్థ ‘పెప్సీకో’కు ప్రపంచవ్యాప్త గుర్తింపొచ్చిందంటే అందులో ఇంద్రా నూయీ పాత్ర కీలకమని చెప్పచ్చు. 1994లో ఈ సంస్థలో చేరిన ఆమె.. ‘సంస్థ వ్యూహాలు-అభివృద్ధి’ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. తన వ్యాపార వ్యూహాలతో సంస్థను లాభాల బాట పట్టించిన ఆమె.. 2006లో సీఈఓగా బాధ్యతలు అందుకున్నారు. 2018లో పదవీ విరమణ పొందారు. ఇక 2007లో ఈ సంస్థ బోర్డుకు ఛైర్మన్‌గా పదవి చేపట్టిన ఇంద్రా నూయీ.. 2019 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. 42 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీకి నాయకత్వం వహించిన తొలి మహిళగానూ గుర్తింపు పొందారామె.

‘యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’లో పబ్లిక్‌-ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఇంద్రా నూయీ.. పెప్సీకోలో చేరకముందు ‘బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌’కు కన్సల్టెంట్‌గా, ఆపై పలు సంస్థల్లో ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో పనిచేశారు. తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌లలో తనకెదురైన అనుభవాలు, తాను నేర్చుకున్న పాఠాల్ని గుదిగుచ్చి ‘మై లైఫ్‌ ఇన్‌ ఫుల్‌ : వర్క్‌, ఫ్యామిలీ అండ్‌ అవర్‌ ఫ్యూచర్‌’ పేరుతో ఓ పుస్తకం రాశారామె. ఇది న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ప్రస్తుతం 350 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2885 కోట్లు) సంపదతో తాజా ఫోర్బ్స్‌ జాబితాలో 77వ స్థానంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని