స్నేహం చిరకాలం...

స్నేహలత పేరులో స్నేహం ఉంటుంది తప్ప, తనతో ఎవరూ ఎక్కువ కాలం స్నేహం చేయరు. ఆ బంధాన్ని నిలుపుకోవడం తెలియక, ఎప్పటికప్పుడు కొత్త స్నేహితులను వెతుక్కుంటుంది.

Published : 11 Jul 2024 03:33 IST

స్నేహలత పేరులో స్నేహం ఉంటుంది తప్ప, తనతో ఎవరూ ఎక్కువ కాలం స్నేహం చేయరు. ఆ బంధాన్ని నిలుపుకోవడం తెలియక, ఎప్పటికప్పుడు కొత్త స్నేహితులను వెతుక్కుంటుంది. తన క్లాస్‌మేట్‌ శ్రేయకైతే స్నేహబృందమే... ఉంటుంది. ఈ బంధం చిరకాలమవ్వాలంటే కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేంటో చూద్దాం.

ప్రస్తుతం వేగవంతమైన జీవితంలో స్నేహితులతో నిరంతరం టచ్‌లో ఉండలేకపోవచ్చు. పనిభారం, కుటుంబ బాధ్యతలతో మనకంటూ సమయం మిగలకపోవచ్చు. అయినా శ్రేయోభిలాషులుగా మన మంచి కోసం నిలిచే స్నేహితులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఉన్న సమయంలోనే వ్యక్తిగత బంధాలను పటిష్ఠం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన స్నేహితులే కదా అని సరదాగా ఇతరుల ముందు హేళనగా మాట్లాడకూడదు. అది వారిని అవమానించడమే కాదు, ఇరువురి మధ్య ఉన్న స్నేహాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది.  పరస్పరం గౌరవించుకుంటేనే ఆ స్నేహానికి బలమైన పునాది ఏర్పడుతుంది. 

శ్రోతగా...

జీవితంలో ఏ బంధంలోనైనా ఎదుటివారికి స్పేస్‌ ఇవ్వాలి. అవతలివారికేదైనా సాయం అవసరమైనప్పుడు అసత్యాలు చెబుతూ తప్పించుకోకుండా, నిజాయతీగా ప్రవర్తించాలి. పారదర్శకత ఉంటేనే స్నేహం బలపడుతుంది. కలిసి గడిపే కొద్ది సమయంలో హాయిగా సరదాగా గడపాలి. ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడానికి, విమర్శించడానికి ప్రయత్నించకూడదు. అవతలివారితో ఏదైనా సమస్య ఉందనిపిస్తే చర్చ ఆరోగ్యకరంగా ఉండాలి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడానికి సిద్ధపడాలి. అలాకాకుండా మన అభిప్రాయాన్ని మాత్రమే అవతలివారు వినాలనే నియంతృత్వ విధానాన్ని పాటిస్తే మాత్రం ఎంతోకాలం ఆ బంధం నిలవదు.

ప్రచారం వద్దు...

స్నేహంపై నమ్మకంతో ఎదుటివారు తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నప్పుడు వాటిని ఇతరులకు చెప్పి, ప్రచారం చేయకూడదు. అలాగే బయటివ్యక్తులు మన స్నేహితుల గురించి చులకనగా మాట్లాడితే ఖండించాలి. మీ మధ్య చిన్నచిన్న విభేదాలొచ్చినప్పుడు మూడోవ్యక్తికి ఆస్కారం ఇవ్వకుండా ఇరువురూ కూర్చుని పరిష్కరించుకోగలగాలి. గుంభనంగా ఉండాల్సిన విషయాలను మీరే గాసిప్‌ చేయడానికి ప్రయత్నిస్తే అవతలివారిని చులకన చేసినట్లే అవుతుంది. అపార్థాలకు తావు లేకుండా స్నేహితుల మధ్య అవగాహన ఉంటే చాలు, ఆ స్నేహబంధం చిరకాలం అవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్