యోగ సాధనే.. వ్యాపార సూత్రంగా..!

ఇటు ఇంట్లో, అటు ఆఫీస్‌లో బాధ్యతలు పెరిగే కొద్దీ ఒక రకమైన అసహనానికి గురవుతాం.. దీనివల్ల కలిగే ఒత్తిడి, యాంగ్జైటీ ఒకానొక దశలో మనల్ని మానసికంగా కుంగదీస్తాయి. ఉద్యోగం చేసే క్రమంలో ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంది ముంబయికి చెందిన నమిత.

Published : 21 Jun 2024 12:30 IST

(Photos: Instagram)

ఇటు ఇంట్లో, అటు ఆఫీస్‌లో బాధ్యతలు పెరిగే కొద్దీ ఒక రకమైన అసహనానికి గురవుతాం.. దీనివల్ల కలిగే ఒత్తిడి, యాంగ్జైటీ ఒకానొక దశలో మనల్ని మానసికంగా కుంగదీస్తాయి. ఉద్యోగం చేసే క్రమంలో ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంది ముంబయికి చెందిన నమిత. ఈ ఒత్తిడితో సహవాసం చేసే కంటే యోగాతో తిరిగి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చన్న సూత్రాన్ని పాటించిన ఆమె.. ఆపై అదే యోగాను తన వ్యాపార సూత్రంగా మలచుకుంది. ప్రస్తుతం యోగాతో ఎంతోమంది జీవితాల్లో మార్పులు తెస్తూ.. వారి ఆరోగ్యానికి బాటలు వేస్తోన్న ఈ యోగిని గురించి ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం..!

నమిత సొంతూరు హరియాణా. ఆమె తండ్రి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. తల్లి వ్యవసాయ శాఖలో పనిచేసేవారు. ఇలా ఉన్నత విద్యా కుటుంబం నుంచి వచ్చిన ఆమె కూడా చిన్న వయసు నుంచే చదువులో రాణించింది. దిల్లీ యూనివర్సిటీలో గణితశాస్త్రంలో ‘బీఏ ఆనర్స్‌’ పూర్తి చేసిన నమిత.. మహారాష్ట్రలోని సింబయాసిస్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ‘మార్కెటింగ్‌-ఫైనాన్స్‌’ విభాగాల్లో మాస్టర్స్‌ పట్టా అందుకుంది.

ఉద్యోగంలో ప్రశాంతత కరువై..!

చదువు పూర్తయ్యాక సిటీ బ్యాంక్‌, రిలయన్స్ రిటైల్‌.. వంటి ప్రముఖ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె.. తన ప్రతిభతో అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగింది. ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో ఆమెకు పదోన్నతి ద్వారా ఉన్నత హోదా కూడా లభించింది. ‘కెరీర్‌లో నాకు దక్కిన గొప్ప అవకాశమిది! అయితే ప్రమోషన్‌తో పాటే బాధ్యతలూ భారీగా పెరిగాయి. అదనపు పనుల భారం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది. దీంతో ఒక్కోసారి ఓపిక నశించిపోయేది. ఈ ఒత్తిడి నాకు తెలియకుండానే నా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒకానొక దశలో కుంగుబాటుకూ లోనయ్యా. ఆరోగ్యపరంగానూ పలు సమస్యల్ని ఎదుర్కొన్నా. దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్న నేను.. నా మానసిక/శారీరక సమస్యల నుంచి బయటపడేందుకు తగిన మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టా. ఈ అన్వేషణే నాకు యోగాను పరిచయం చేసింది..’ అంటూ చెప్పుకొచ్చింది నమిత.

‘యోగా’లోని మహత్తు గ్రహించి..!

యోగా గురించి మరింత లోతుగా తెలుసుకునే క్రమంలో.. యోగ సాధన ద్వారా లభించే ప్రశాంతతను మించింది ఈ సృష్టిలో మరేదీ లేదని గ్రహించింది నమిత.. ఇందులోనే పూర్తి నైపుణ్యాలు సాధించాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతోనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె.. పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు/విద్యాసంస్థల్లో.. యోగా, యోగా ఫిలాసఫీ, ప్రాణాయామం, ఆయుర్వేద శాస్త్రాల్లో.. వివిధ కోర్సులు చేసింది. అమెరికాలోని ‘హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో ఆయుర్వేద పాకశాస్త్ర పద్ధతులపై నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌కూ హాజరైందామె. మరోవైపు యూఎస్‌ఏలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి మొక్కల ఆధారిత పోషకాహారానికి సంబంధించిన ఆన్‌లైన్ కోర్సు పూర్తి చేసి.. సంబంధిత సర్టిఫికేషన్‌ కూడా పొందింది. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో నిర్వహించిన పలు యోగా వర్క్‌షాప్స్‌లో కూడా భాగమైంది నమిత.

వ్యాపారంతో చైతన్యం..!

ఇలా యోగాపై పూర్తి పట్టు సాధించిన నమిత.. ఆయుర్వేద శాస్త్రం, ఆరోగ్యకరమైన జీవనశైలి పైనా పూర్తి అవగాహన పెంచుకుంది. ఈ క్రమంలోనే తానూ తన మానసిక సమస్యల్ని జయించి.. తిరిగి ఆరోగ్యంగా మారింది. అయితే ఈ నైపుణ్యాలను తనలోనే ఉంచుకోవడం కంటే.. నలుగురికీ పంచుతూ.. వారిలోనూ ఆరోగ్య స్పృహ పెంచాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచతోనే 2017లో ముంబయిలో ‘యోగానమా’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది నమిత. ఈ వేదికగా ఆయా అంశాలకు సంబంధించిన వీడియో కంటెంట్‌ను రూపొందించడం, ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగత - బృంద యోగా తరగతులు నిర్వహించడం, కార్పొరేట్‌ వర్క్‌షాప్స్‌ ఏర్పాటుచేయడం, ఆయుర్వేదం - ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం.. వంటివి చేస్తోందీ యోగిని. అలాగే గ్రూప్‌ యోగా యాక్టివిటీల కోసం.. అందులో రిజిస్టర్‌ చేసుకున్న వారిని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్తూ.. వారికి అటు వెకేషన్‌ అనుభవాల్ని, ఇటు యోగా శిక్షణనూ ఏకకాలంలో అందిస్తోంది.

సర్వరోగ నివారిణి.. యోగా!

తన యోగా పరిజ్ఞానంతో ఎంతోమంది జీవితాల్లో మార్పులు తీసుకొస్తోన్న నమిత.. ఈ సాధనతో ఎలాంటి అనారోగ్యాన్నైనా దూరం చేసుకోవచ్చని చెబుతోంది. ‘యోగాతో శారీరక, మానసిక అనారోగ్యాల్ని దూరం చేసుకొని సంపూర్ణ ఫిట్‌నెస్‌ సాధించచ్చు. అంతేకాదు.. శక్తిస్థాయుల్ని పెంచుకొని, జీవక్రియల పనితీరునూ మెరుగుపరచుకోవచ్చు.. చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు. ఇక మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, పీసీఓఎస్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.. మొదలైన వాటిని అదుపు చేసే శక్తి యోగా సొంతం. అలాగే ప్రాణాయామం, ధ్యానం.. మనలో ప్రవర్తనా లోపాల్ని సరిచేసి.. మెదడు మరింత చురుగ్గా పనిచేసేలా చేస్తుంది..’ అని చెబుతోన్న నమిత.. లక్ష్యంపై స్పష్టత ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధించచ్చంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్