ఈ ‘మిసెస్ ఇండియా’.. వాళ్ల కోసం అందాల పోటీలు నిర్వహిస్తోంది!
భర్త-పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం.. 47 ఏళ్లొచ్చే దాకా ఇవే తన జీవితమనుకుందామె. అయినా అప్పుడప్పుడూ.. ‘ఇలాగే ఉండిపోకుండా నాకంటూ ప్రత్యేకత సంపాదించుకోవాలి..’ అన్న ఆలోచన ఆమె మనసులో మెదిలేది. ఇదే తనను తనకు ఆసక్తి ఉన్న మోడలింగ్ వైపు అడుగేసేలా చేసింది. ఈ క్రమంలో తానో అందాల కిరీటం....
(Photos: Instagram)
భర్త-పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం.. 47 ఏళ్లొచ్చే దాకా ఇవే తన జీవితమనుకుందామె. అయినా అప్పుడప్పుడూ.. ‘ఇలాగే ఉండిపోకుండా నాకంటూ ప్రత్యేకత సంపాదించుకోవాలి..’ అన్న ఆలోచన ఆమె మనసులో మెదిలేది. ఇదే తనను తనకు ఆసక్తి ఉన్న మోడలింగ్ వైపు అడుగేసేలా చేసింది. ఈ క్రమంలో తానో అందాల కిరీటం గెలవడమే కాదు.. ఇటువైపుగా రావాలనుకునే ఎంతోమంది మహిళల కలలకు రెక్కలు తొడుగుతోందామె. అందుకోసం ప్రత్యేకంగా ఓ అందాల పోటీనే నిర్వహించే స్థాయికి ఎదిగింది. తపన, ఆత్మవిశ్వాసం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న రంగంలో రాణించచ్చంటోన్న వినీతా శ్రీవాస్తవ స్ఫూర్తి గాథ ఇది!
వినీతది బిహార్. మాస్ కమ్యూనికేషన్స్ చదవాలనేది ఆమె కోరిక. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ, బీఈడీ పూర్తిచేసింది. ఇలా చదువు పూర్తయిందో లేదో అలా వివాహ బంధంలోకి అడుగుపెట్టిందామె. ఇక అప్పట్నుంచి ఇల్లు, కుటుంబ బాధ్యతలు.. ఇవే తన జీవితంగా మారిపోయాయి.
తపనే ముందుకు నడిపించింది!
అయితే వినీతకు అందం, ఫ్యాషన్‌పై ఆసక్తి ఎక్కువ. ఈక్రమంలోనే చాలాసార్లు అందాల పోటీల్లో పాల్గొనాలనిపించినా.. కుటుంబ బాధ్యతల వల్ల అది కుదిరేది కాదు. దీనికి తోడు ఐదుగురు పిల్లల తల్లైన ఆమెకు ఇంటి పనులతోనే రోజు గడిచిపోయేది. అయినా సరే.. ఎలాగైనా తన కల నెరవేర్చుకోవాలనుకుంది వినీత. తన 47వ ఏట ఇందుకు తీరిక కుదిరిందంటోందామె.
‘నాకు ఐదుగురు పిల్లలు. వాళ్ల ఆలనాపాలనతోనే నాకు రోజు గడిచిపోయేది. దీనికి తోడు నా రెండో కొడుక్కి సెరబ్రల్ పాల్సీ సమస్య ఉంది. మాట్లాడలేడు.. మంచం దిగలేడు. దాంతో నేను కచ్చితంగా వాడి పక్కనే ఉండాల్సి వచ్చేది. అయినా సరే.. ఏదో ఒక రోజున నాకు ఆసక్తి ఉన్న బ్యూటీ, ఫ్యాషన్ రంగాల్లో అడుగుపెట్టాలని బలంగా అనుకునేదాన్ని. పిల్లలు పెద్దయ్యాక అందుకు తీరిక దొరికింది. మరోవైపు నా ఆసక్తిని నా భర్త, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు.. నేను అందుబాటులో లేనప్పుడు నా కొడుకునీ కంటికి రెప్పలా చూసుకుంటామని మాటిచ్చారు. ఇలా వాళ్ల అండతోనే 47 ఏళ్ల వయసులో ‘క్లాసిక్ మిసెస్ ఇండియా ఓవర్సీస్ - 2017’ కిరీటం గెలిచాను. ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది వినీత.
వాళ్ల కలలకు ఊపిరై..!
అందాల కిరీటం గెలిచాక బోలెడంత ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న వినీతకు మరో ఆలోచన వచ్చింది. అదేంటంటే.. తనలాగే ఈ రంగంలో రాణించాలనుకునే మహిళలు ఎంతోమంది ఉంటారు.. వారికి తన వంతుగా చేయూతనందించాలని! ఈ ఆలోచనతోనే వయసు, సౌందర్య ప్రమాణాలతో సంబంధం లేకుండా తనే స్వయంగా ఓ అందాల పోటీని నిర్వహించడం మొదలుపెట్టిందామె. అలా 2019లో ‘విజనరా గ్లోబల్ మిస్ అండ్ మిసెస్ ఇండియా కాంపిటీషన్’కి శ్రీకారం చుట్టింది వినీత.
‘పెళ్లై ఇల్లే జీవితంగా గడుపుతోన్న మహిళలు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. కుటుంబ బాధ్యతల్లో లీనమై తమ కలల్ని, ఆశయాల్ని పక్కన పెట్టిన వారు మరెందరో! అలాంటి వాళ్లలో ఈ రంగంలోకి రావాలనుకుంటోన్న మహిళల కోసమే ఈ అందాల పోటీని నిర్వహిస్తున్నా. ఇందులో పాల్గొనదలచుకున్న వారికి వయోపరిమితి లేదు. లావు, నాజూకు, పొడవు, పొట్టి, చర్మ ఛాయ.. ఇలాంటి ఆంక్షలేవీ లేవు. అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆసక్తి ఉంటే చాలు.. ఎవరైనా ఈ కంటెస్ట్‌లో పాల్గొనచ్చు. తమ కలను నెరవేర్చుకోవచ్చు. ఈ మూడు సీజన్లలో ఎంతోమంది అలా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మరికొందరు వ్యాపారంలో, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు..’ అంటున్నారు వినీత.
కెరీర్‌లో రాణించేలా..!
ఇలా అందాల పోటీల్లోకి రావాలనుకునే మహిళల్ని ఈ దిశగా ప్రోత్సహించడమే కాదు.. మరికొంతమంది మహిళలకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్పిస్తూ వారిని ఆయా రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నారు వినీత. ఇందుకోసం ‘Visionara Academy’ పేరుతో ఓ సంస్థను స్థాపించారామె. ‘ప్రస్తుత ప్రపంచంలో పోటీని తట్టుకోవాలంటే నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు ప్రోది చేసుకోవడం చాలా ముఖ్యం. మా వద్ద ఈ నైపుణ్యాల్నే నేర్పిస్తున్నాం. ఎక్కడున్నా సరే.. ఆన్‌లైన్‌లోనే వీటిని నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇందుకోసం చదువు, అనుభవం వంటి సర్టిఫికెట్లు ఏమీ అవసరం లేదు. కంప్యూటర్/స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.. మా నిపుణులు చెప్పే ఆన్‌లైన్ పాఠాలు వినచ్చు..’ అంటున్నారు వినీత.
తన వేదికల ద్వారా ఎంతోమంది మహిళల కలలకు రెక్కలు తొడుగుతోన్న ఈ సూపర్ మామ్.. మనసులో సాధించాలన్న తపన, నిండైన ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. ఏ రంగంలోనైనా విజయం సాధించచ్చంటూ తన సక్సెస్‌తోనే నిరూపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.