Summer Tips: పండ్లు, కూరలు.. వేసవిలో తాజాగా ఇలా!
వేసవిలో పండ్లు, ఆకుకూరలు చాలా త్వరగా పాడైపోతుంటాయి. ఫ్రిజ్‌లో పెట్టినా వాటి తాజాదనం నిలవడం కష్టం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చూద్దాం రండి..
వేసవిలో పండ్లు, ఆకుకూరలు చాలా త్వరగా పాడైపోతుంటాయి. ఫ్రిజ్‌లో పెట్టినా వాటి తాజాదనం నిలవడం కష్టం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చూద్దాం రండి..
కరివేపాకు, కొత్తిమీర ఎండిపోతున్నాయా?
ఎండాకాలంలో కొత్తిమీర, కరివేపాకు ఫ్రిజ్‌లో పెట్టినా మరుసటిరోజే వాడిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఐస్ ట్రేలో సగం వరకు కరిగించిన బటర్/నెయ్యిని పోసి అందులో తరిగిన కొత్తిమీర/కరివేపాకు వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు రోజుల తర్వాత, ఆ క్యూబ్స్‌ని జిప్‌లాక్ కవర్లలోకి మార్చి రిఫ్రిజిరేటర్లో భద్రపరచాలి. కూరలు ఉడికేటప్పుడు ఈ క్యూబ్స్‌ని అందులో వేస్తే సరి!
ఆకుకూరలు వాడిపోకుండా..
అలాగే ఆకుకూరలు ఎక్కువ రోజులపాటు తాజాగా ఉండాలంటే వాటిని కడిగి, ఆరబెట్టి, సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఐస్ ట్రేలలో ముప్పావు వంతు నింపి, ఆకులు మునిగే వరకు నీరు పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. వీటికి ఇతర పదార్థాల వాసన పట్టకుండా ఉండాలంటే ఈ ఐస్‌ట్రేలకు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ చుడితే సరిపోతుంది.
నచ్చిన సూప్.. నిమిషాల్లో..
వెజిటబుల్ సూపులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టిఫిన్‌కి, భోజనానికి మధ్యలో కలిగే ఆకలికి, సాయంకాలం స్నాక్ టైంకి నూనెతో చేసిన చిరుతిళ్ల కన్నా వెజిటబుల్ సూపులు ఎంతో మంచివి. కానీ సూప్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుందనే కారణంతో చాలామంది ఆరోగ్యం విషయంలో రాజీ పడుతుంటారు. ఇకపై అలాంటి అవసరం లేదు. కావల్సినప్పుడల్లా మీ ఫేవరెట్ సూప్‌ని చిటికెలో తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
పాలకూర, గుమ్మడికాయ, క్యారట్ వంటి వాటిని ప్యూరీ చేసుకుని రెండు రోజుల పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. అవి గట్టిపడిన తర్వాత జిప్‌లాక్ కవర్లో భద్రపరుచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మరిగే నీటిలో ఈ క్యూబ్స్ వేసుకుని సూప్ తయారు చేసుకోవచ్చు.
పండ్లను తాజాగా ఉంచండిలా...
కొన్ని రకాల పండ్లను వెంటనే వాడకపోతే వాటిని నిల్వ చేయడానికి ఫ్రీజర్‌ను ఆశ్రయించాలి. ఆయా పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఐస్‌ట్రేలో ముప్పావు వంతు కవర్ చేయాలి. మిగిలిన పావు భాగం నీటితో నింపాలి. రెండు రోజుల తర్వాత జిప్‌లాక్ కవర్లలోకి మార్చి ఫ్రీజర్లో భద్రపరచాలి. తినాలనుకున్నప్పుడు ఓ గంట ముందు ఫ్రీజర్‌లోంచి తీస్తే తాజా పండ్లు రడీ..! స్మూతీ చేసుకోవాలంటే ఫ్రీజర్‌లోంచి తీసిన వెంటనే వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.