Frozen Vegetables: వీటిని ఎలా వండుకోవాలా తెలుసా?

ప్రస్తుతం అన్ని రకాల సూపర్‌మార్కెట్లు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ లభిస్తున్నాయి. పంట చేతికొచ్చిన వెంటనే ఆయా కూరగాయల్ని శీతలీకరిస్తూ వీటిని తయారుచేస్తారు. ఆయా సీజన్లలో కొన్ని రకాల కూరగాయలు అందుబాటులో లేనప్పుడు వీటిని....

Published : 23 Jul 2023 10:33 IST

ప్రస్తుతం అన్ని రకాల సూపర్‌మార్కెట్లు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ లభిస్తున్నాయి. పంట చేతికొచ్చిన వెంటనే ఆయా కూరగాయల్ని శీతలీకరిస్తూ వీటిని తయారుచేస్తారు. ఆయా సీజన్లలో కొన్ని రకాల కూరగాయలు అందుబాటులో లేనప్పుడు వీటిని వాడే అవకాశముంటుంది. అయితే వండుకునే క్రమంలో మాత్రం కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఎలా ఎంచుకోవాలి?

తాజాగా దొరికే కాయగూరల్ని అప్పటికప్పుడే కట్‌ చేసుకొని వండుకుంటాం కాబట్టి అందులోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. అయితే ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌తో ఈ ప్రయోజనం ఉండదేమో అనుకుంటారు చాలామంది. అయితే శీతలీకరణ పద్ధతి వల్ల కొన్ని రకాల కాయగూరల పోషక విలువల్లో హెచ్చుతగ్గులుండచ్చని, అది కూడా చాలా తక్కువ శాతంలోనే అని చెబుతున్నారు నిపుణులు. ఏదేమైనా వీటిని ఎంచుకునే ముందు మాత్రం ఆ ప్యాకెట్‌ లేబుల్‌ని క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి అంటున్నారు. ఎందుకంటే శీతలీకరించిన కాయగూరల్లో చాలావరకు ప్రిజర్వేటివ్స్‌ ఉండవట! అత్యంత అరుదుగా మాత్రమే చక్కెర/ఉప్పు/సాస్‌లు/ఇతర ఫ్లేవర్లుండే అవకాశం ఉంటుందట! కాబట్టి ఇలాంటివి లేకుండా, ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండా తయారుచేసినవి ఎంచుకోవడం మేలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇవి నెలల తరబడి నిల్వ ఉంటాయి, ఏడాది పొడవునా దొరుకుతాయి కాబట్టి.. ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.

వండుకోవడానికీ ఓ పద్ధతుంది!

ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ని సాధారణ కాయగూరల్లా కాకుండా.. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో వండుకోవడం/ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. తద్వారా రుచి తగ్గకుండా, పోషకాలు కోల్పోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

ఆయా రకాల ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ని ఎలా వండుకోవాలి? ఎంత సమయం వాటిని ఉడికించాలి? అనే విషయం ఆ ప్యాకెట్‌ లేబుల్‌పై స్పష్టంగా రాసి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు.. ముందుగా వీటిని గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకురావాలా? లేదంటే అలాగే వండుకోవాలా అనే విషయాన్నీ లేబుల్‌పై పరిశీలించడమూ ముఖ్యమేనట! లేదంటే ఆహారం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుందట!

అయితే వీటిని పూర్తిగా గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాకే వండుకోవడమంటే చాలా సమయం వృథా అవుతుంది. అలాగని రాత్రి ఫ్రిజ్‌లో నుంచి తీసి బయటపెట్టి ఉదయం వండుకుంటే అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్య లేకుండా ఉండాలంటే.. అవెన్‌లో వీటిని కొన్ని నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ప్రస్తుతం ఇందుకోసం డీఫ్రాస్టింగ్‌ సెట్టింగ్స్‌ చేసుకునే అవకాశం ఉన్న అవెన్స్‌ కూడా దొరుకుతున్నాయి.

శీతలీకరించిన కాయగూరలు గడ్డకట్టినట్లుగా ఉంటాయి కాబట్టి.. ఎక్కువసేపు ఉడికించాలనుకుంటారు చాలామంది! కానీ ఆ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని ముందు వేడి నీటిలో కాసేపు ఉంచి.. ఆపై శీతలీకరిస్తారట! తద్వారా అవి కాస్త ఉడికిపోయి ఉంటాయి కాబట్టి.. ప్యాకేజ్‌పై పొందుపరిచినట్లుగా నిర్ణీత సూచనల మేరకు వీటిని ఉపయోగించడం మంచిది. ఒకవేళ ఎక్కువగా ఉడికించినా.. అవి రుచి కోల్పోయి, పోషకాలు తరిగిపోయే అవకాశాలుంటాయట! కాబట్టి కావాలనుకుంటే ఫోర్క్‌ సహాయంతో అవి ఉడికాయా లేదా అనేది పరిశీలిస్తే సరిపోతుంది.

సాధారణ కాయగూరల్లాగే ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌తో నచ్చిన రుచికరమైన వంటకాల్ని తయారుచేసుకోవచ్చు. అంతేకాదు.. వీటిని కొన్ని రకాల వంటకాల రుచి పెరగడానికీ వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రోస్టింగ్‌, స్టీమింగ్‌, సాటింగ్‌ (తక్కువ నూనెతో వంట చేయడం).. వంటి పద్ధతుల్లో తయారుచేసే వంటకాల్లో వీటిని ఉపయోగించడం లేదంటే వీటినే ఆయా పద్ధతుల్లో వండుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుందంటున్నారు.

వండుకోగా మిగిలిపోయిన ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ని నిల్వ చేయడానికీ ఓ పద్ధతుంటుందంటున్నారు నిపుణులు. వాటిని అలాగే ఫ్రిజ్‌లో పెట్టడం కాకుండా.. ముందు గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకొచ్చి.. ఆపై గాలి చొరబడని బ్యాగ్‌ లేదా డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేయాలి. అప్పుడే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.. వాటిలోని పోషకాలు కూడా నిలిచి ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని