Published : 04/10/2021 18:20 IST

ఆహార పదార్థాల్లోని ‘కల్తీ’ని కనిపెట్టండిలా!

‘కల్తీకి కాదేదీ అనర్హం’ అన్నట్లు ప్రస్తుతం మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులన్నీ ‘కల్తీ’ మయం అవుతున్నాయి. పాలు, నీళ్లు, కారం, నెయ్యి, వంటనూనెలు, పొడులు, మసాలా దినుసులు... ఇలా మార్కెట్లో దొరికే పదార్థాలన్నీ చాలావరకు కల్తీ ఉత్పత్తులతో కూడి ఉన్నవే. ఇక పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు, రంగు వచ్చి ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ రకాల రసాయనాలు వినియోగిస్తున్నారు.

కల్తీని కనిపెట్టేందుకు!

కల్తీ ఉత్పత్తులు, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు ‘భారత ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’ తరచూ కొన్ని చిట్కాలు పంచుకుంటోంది. ‘డిటెక్టింగ్‌ ఫుడ్‌ అడల్ర్టెంట్స్’ పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు పంచుకుంటోంది. వీటి ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలు మంచివా? కల్తీవా? అనే విషయాలపై సులభంగా అవగాహన కల్పిస్తోంది. మరి ఆహార పదార్థాల నాణ్యత, స్వచ్ఛతకు సంబంధించి FSSAI ఇటీవల పంచుకున్న కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి.

కారంలో కల్తీని కనిపెట్టండిలా!

గతంలో మిరపకాయలను బాగా ఎండబెట్టి ఆ తర్వాత కారం పొడిగా చేసి వాడుకునేవారు. కానీ ఇప్పుడు చాలామంది మార్కెట్లో దొరికే కారం పొడులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే దీనినే అవకాశంగా తీసుకుని చాలామంది కారం తయారీలో కల్తీ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. కారం బాగా రంగు వచ్చేందుకు ఇటుక పొడి, ఇసుక, సోప్‌స్టోన్‌ పౌడర్‌, ఉప్పు, టాల్కం పౌడర్, ఇతర సింథటిక్ ఉత్పత్తులను కలిపేస్తున్నారు. వీటిని తీసుకుంటే క్యాన్సర్‌ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 
ఈ క్రమంలో కారంలో కల్తీని గుర్తించాలంటే... ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్‌ కారం పొడి కలపాలి. కొద్దిసేపయ్యాక నీటి అడుగుభాగంలో ఉన్న కారం పొడిని కొద్దిగా అరచేతిలోకి తీసుకుని వేలితో రుద్దండి. రాళ్లలా గట్టిగా అనిపిస్తే అందులో ఇటుక పొడి/ఇసుక కలిపినట్లు. అలా కాకుండా సబ్బులా మృదువుగా అనిపిస్తే కారంలో సోప్‌ స్టోన్‌ పౌడర్‌ కలిపారని అర్థం చేసుకోవాలి.

పచ్చి బఠానీలు మంచివేనా?

ఫైబర్‌ లాంటి పోషకాలతో నిండిన పచ్చి బఠానీలు వంటకాలకు మరింత రుచిని అందిస్తాయి. చాలామంది బరువు తగ్గేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అయితే మార్కెట్లో దొరికే బఠానీలు చాలావరకు కృత్రిమ రంగులతో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ముప్పు తప్పదు.

వీటిల్లోని కల్తీని గుర్తించాలంటే... ఒక గాజు గ్లాసులో పచ్చి బఠానీలు తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి అర్ధగంట పాటు పక్కన పెట్టాలి. నీరంతా ఆకుపచ్చ రంగులోకి మారితే ఆ బఠానీల్లో కృత్రిమ రంగులు మిక్స్‌ చేశారని అర్థం. కల్తీ లేని బఠానీలు నీళ్లలో కూడా రంగు పోకుండా అలాగే ఉంటాయి.

ఈ ప్రయోగంతో కల్తీ నూనెను కనిపెట్టొచ్చు!

మన వంటకాల్లో ఎక్కువగా వినియోగించే పదార్థాల్లో వంట నూనె కూడా ఒకటి. అయితే గత కొన్నేళ్లుగా వంట నూనెల ధరలు కొండెక్కుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు నూనెను కల్తీ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా వంటనూనెలో ట్రై- ఆర్థో- క్రెసిల్- ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని వినియోగించి కల్తీ చేస్తున్నారు. ఫాస్ఫరస్ తో నిండిన ఈ పెస్టిసైడ్‌ నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పక్షవాతం తదితర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

ఈ నేపథ్యంలో ఒక చిన్న ప్రయోగం ద్వారా మనం వాడే నూనెలో ట్రై- ఆర్థో- క్రెసిల్- ఫాస్ఫేట్ ఉందో లేదో కనిపెట్టచ్చు...ముందుగా రెండు మిల్లీ లీటర్ల నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకుని పసుపు రంగులో ఉన్న వెన్నను రెండింటిలో వేయాలి. కొద్దిసేపయ్యాక ఏ పాత్రలోని నూనె రంగు మారకుండా ఉంటే అది స్వచ్ఛమైనది. అంటే అందులో ట్రై- ఆర్థో- క్రెసిల్- ఫాస్ఫేట్ లేదని అర్థం. అదే నూనె ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

వంట నూనె పసుపు రంగులో ఉందా?

ఇక వంట నూనెకు పసుపు రంగును తీసుకొచ్చేందుకు మరికొందరు ‘మెటానిల్‌ ఎల్లో’ ను వినియోగిస్తున్నారంటోంది FSSAI. ఇది నిషేధిత రంగు పదార్థమని దీనిని వాడడం వల్ల మెదడుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందంటోంది. అందుకే నూనెలోని మెటానిల్ రంగును కనుగొనేందుకు ఒక చిట్కాను పంచుకుంది. అదేంటంటే..

* ముందుగా ఒక టెస్ట్‌ ట్యూబ్‌లో మిల్లీ లీటర్‌ నూనెను తీసుకోవాలి.

* ఇందులో 4 మిల్లీ లీటర్ల డిస్టిల్డ్‌ వాటర్‌ను కలిపి టెస్ట్‌ ట్యూబ్‌ను బాగా షేక్‌ చేయాలి.

* ఇప్పుడు ఈ మిశ్రమంలోంచి 2 మిల్లీ లీటర్ల ద్రవాన్ని మరొక టెస్ట్‌ ట్యూబ్‌లోకి తీసుకోవాలి.

* ఇందులో 2 మిల్లీ లీటర్ల గాఢ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం వేసి బాగా కలపాలి.

* కొద్ది సేపయ్యాక టెస్ట్‌ ట్యూబ్ లోపల పై భాగంలో ఎర్రటి రంగు పొర ఏర్పడితే ఆ నూనెలో మెటానిల్ ఎల్లోను మిక్స్‌ చేశారని అర్థం.

* అలా కాకుండా ట్యూబ్‌లోని నూనె అంతా ఒకే రంగులో ఉంటే అది స్వచ్ఛమైనదని అర్థం చేసుకోవాలి.

పసుపులోని కృత్రిమ రంగులను గుర్తించండిలా!

వంటగదిలో విరివిగా ఉపయోగించే పసుపులో రోగ నిరోధక శక్తి గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే గాయాలు తగిలినప్పుడు మొదట పసుపే పూస్తుంటారు. అయితే పసుపులో కృత్రిమ రంగులను కలపడం వల్ల గాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రభావం ఉంది. పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో పసుపులోని కల్తీని గుర్తించాలంటే... గ్లాసు నీళ్లలో కాసింత పసుపు పొడిని కలపాలి. ఒకవేళ పసుపులో కృత్రిమ రంగులు కలిసుంటే గ్లాసులోని నీరంతా పూర్తి పసుపులోకి మారుతుంది. అదే స్వచ్ఛమైన పసుపు అయితే పసుపంతా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది. నీరు లైట్‌ యెల్లో కలర్‌లోకి మారుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని