బొజ్జగణపయ్యకు ప్రత్యేకంగా...

పండగలు, పబ్బాలు అంటే పిండివంటలు లేకుండా వూహించలేం. అందులోనూ విఘ్ననాయకుడైన వినాయకుడిని పూజించే చవితి పండగంటే చెప్పేదేముంటుంది? సకల విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే బొజ్జ గణపయ్య కడుపారా విందారగించడానికి సర్వస్వం సిద్ధం చేయద్దూ!

Published : 09 Sep 2021 20:57 IST

పండగలు, పబ్బాలు అంటే పిండివంటలు లేకుండా వూహించలేం. అందులోనూ విఘ్ననాయకుడైన వినాయకుడిని పూజించే చవితి పండగంటే చెప్పేదేముంటుంది? సకల విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే బొజ్జ గణపయ్య కడుపారా విందారగించడానికి సర్వస్వం సిద్ధం చేయద్దూ! మరింకెందుకాలస్యం? బుజ్జి గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్పెషల్స్‌తో రడీ అయిపోండి మరి!

మోదక్

కావల్సినవి

బియ్యప్పిండి - కప్పు (బియ్యాన్ని గంటముందు నానబెట్టి, తరవాత ఆరబెట్టి పొడిలా చేసుకోవాలి)

బెల్లం తురుము - కప్పు

తాజా కొబ్బరి తురుము - కప్పు

వేయించిన గసగసాలు - మూడు చెంచాలు

నెయ్యి - రెండు చెంచాలు

ఉప్పు - చిటికెడు

యాలకులపొడి - అరచెంచా.

తయారీ విధానం

అడుగు మందంగా ఉన్న బాణలిలో కప్పు నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. నిమిషం తరవాత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంట తగ్గించి బియ్యప్పిండి వేసేయాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉంటే రెండు నిమిషాలకు అది దగ్గరకు అవుతుంది. అప్పుడు దింపేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో పావుకప్పు నీళ్లు, బెల్లం తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది కరిగి పాకంలా అవుతున్నప్పుడు కొబ్బరితురుము, వేయించిన గసగసాలు, యాలకులపొడి వేసి కలపాలి. మూడు నిమిషాల తరవాత మిశ్రమం దగ్గరికొస్తుంది. అప్పుడు దింపేయాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని బియ్యప్పిండిని తీసుకుని చిన్న చపాతీలా చేసుకోవాలి. అందులో కొద్దిగా బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి, మోదక్‌లా వచ్చేలా చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి. వీటిని పది నిమిషాలు ఆవిరిమీద ఉడికించి తీసుకోవాలి.

పంచరత్న బొబ్బట్లు

కావల్సినవి

* సొరకాయ తురుము - పావుకప్పు

* బీట్‌రూట్ తురుము - పావుకప్పు

* చిలగడదుంప తురుము - పావుకప్పు

* తీపిగుమ్మడి తురుము - పావుకప్పు

* క్యారెట్ తురుము - పావుకప్పు

* మైదాపిండి - 4 కప్పులు

* నెయ్యి - 50 గ్రాములు

* బెల్లం తురుము - 2 కప్పులు

* పాలు - అర లీటరు

* జీడిపప్పు, బాదంపప్పు పొడి - పావుకప్పు

* యాలకుల పొడి - 2 టేబుల్ స్పూన్లు

* నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

మైదాలో కొద్దిగా నీళ్లు, నూనె వేసి పూరీ పిండిలా కలుపుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు పోసి మరిగించాలి. తర్వాత బీట్‌రూట్, చిలగడదుంప, క్యారెట్, గుమ్మడి, సొరకాయ తురుములు వేసి ఉడికించాలి. తర్వాత బెల్లం తురుము, ఎండు కొబ్బరి తురుము, కాస్త నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు పొడులు, యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమం బాగా చిక్కబడిన తర్వాత దించి కాస్త ఆరనివ్వాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మైదాపిండిని పూరీలా వత్తి దాని మధ్యలో ఉడికించిన కూరగాయల మిశ్రమం ముద్దను ఉంచి అంచులు మూసేసి చేత్తోనే బొబ్బట్లు మాదిరిగా వత్తాలి. ఇలాగే అన్నీ చేసి.. వాటిని రెండు వైపులా కాల్చి తీయాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే పంచరత్న బొబ్బట్లు రడీ.

పాలతాలికల పాయసం

కావాల్సినవి

బియ్యం పిండి- పావుకేజీ

బెల్లం- పావుకేజీ

సగ్గుబియ్యం- 50గ్రా||

పాలు- అరలీటరు

కిస్‌మిస్- 50గ్రా||

జీడిపప్పు- 50గ్రా||

యాలకులు- 4

నీళ్లు- తగినన్ని

తయారీ విధానం

ముందు కొద్దిగా నీళ్లు తీసుకుని 10గ్రా|| బెల్లం ముక్కని నీళ్లలో వేసి మరగనివ్వాలి. మరిగిన నీటిలో బియ్యం పిండి వేసి గట్టిగా అయ్యే వరకు బాగా కలపాలి. కలిపిన తర్వాత స్టౌ మీద వెడల్పాటి బాణలి పెట్టుకుని అందులో పాలు, నీళ్లు పోసి, సగ్గుబియ్యం వేయాలి. అవి ఉడికిన తర్వాత ముందుగా తయారుచేసుకున్న బియ్యప్పిండిని జంతికల గొట్టం వేసి నొక్కుకోవాలి. పాలల్లో ఉడికిన వాటిని పైకి తీసి ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేయాలి. కావాలనుకుంటే కిస్‌మిస్, జీడిపప్పు, యాలకుల పొడితో గార్నిష్ చేసుకోవచ్చు. తియ్యతియ్యని పాలతాలికల పాయసం తయార్..

పాలవడలు

కావల్సినవి

మినప్పప్పు - రెండు కప్పులు

చిక్కటి పాలు - లీటరు

చక్కెర - రుచికి సరిపడా

యాలకులపొడి - చిటికెడు

వేయించిన బాదం పలుకులు - కొన్ని

కిస్‌మిస్ - ఐదారు

నూనె - వేయించడానికి సరిపడా.

తయారీ విధానం

మినప్పప్పును ఆరు నుంచి ఎనిమిది గంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత గారెల పిండిలా మెత్తగా, గట్టిగా రుబ్బుకుని తీసుకోవాలి. అలాగే బాణలిలో సరిపడా నూనె వేడిచేసి ఈ పిండిని గారెల్లా వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పాలను ఓ గిన్నెలో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి అరలీటరు అయ్యేవరకూ మరిగించి అందులో సరిపడా చక్కెర, యాలకులపొడి వేయాలి. పాలు ఇంకాస్త చిక్కగా అయ్యాక దింపేయాలి. వడల్ని ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని వాటిపై ఈ పాలను పోయాలి. బాదం పలుకులు, కిస్‌మిస్‌తో అలంకరించాలి. అంతే పాలవడలు సిద్ధం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్