Updated : 08/12/2022 15:42 IST

కాబోయే అమ్మలూ.. ఈ యోగాసనాలతో ఫిట్‌గా మారదాం!

గర్భిణుల శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామాలు ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రెండో, మూడో త్రైమాసికాల్లో కొన్ని యోగాసనాలు ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకు.. ఇద్దరికీ మంచివని నిపుణులు చెబుతుంటారు. నటి గీతాబస్రా కూడా అదే అంటోంది. రెండోసారి తల్లి కాబోతోన్న ఈ ముద్దుగుమ్మ.. కడుపుతో ఉన్నా యోగాను తన రోజువారీ వ్యాయామాల్లో భాగం చేసుకుంది. ఇలా తాను చేస్తోన్న ప్రి-నాటల్‌ యోగా వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. కాబోయే అమ్మలందరికీ ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతోందీ అందాల అమ్మ. ఈ క్రమంలో తాను సాధన చేస్తోన్న ఆసనాలు, వాటివల్ల చేకూరే ప్రయోజనాలను వరుస పోస్టుల రూపంలో పంచుకుంటోందీ మిస్సెస్‌ భజ్జీ.

 

నటిగా, క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ భార్యగా మనందరికీ గీత పరిచయమే! నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. 2015లో భజ్జీని ప్రేమ వివాహం చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016లో హినాయా అనే పాప పుట్టింది. ప్రస్తుతం రెండోసారి గర్భం ధరించిన గీత.. ఈ క్రమంలో తన అనుభవాలు, అనుభూతుల్ని సోషల్‌ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంది.


వార్మప్‌ కోసం..!

ఈ క్రమంలోనే నిండు గర్భిణిగా ఉన్న తాను యోగా చేస్తోన్న వీడియోలను వరుసగా ఇన్‌స్టాలో పంచుకుంటోంది. కాబోయే అమ్మలకు యోగా ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా రెండో, మూడో త్రైమాసికాల్లో కొన్ని సులభమైన యోగాసనాలు చేయడం వల్ల శరీరం, మనసు ఫిట్‌గా మారతాయంటోంది. అయితే అందుకు ప్రతి ఒక్కరూ ముందుగానే గైనకాలజిస్ట్‌ సలహా తీసుకోవడం మాత్రం తప్పనిసరి అంటోంది గీత.

‘ఈ ప్రతికూల పరిస్థితుల్లో గర్భిణులకు అత్యవసరమైతే తప్ప ఎలాగూ బయటికి వెళ్లే అవకాశం లేదు.. పోనీ ఇంట్లోనే యోగా చేద్దామనుకుంటే ఆన్‌లైన్‌ యోగా తరగతులు అందరికీ అందుబాటులో ఉండచ్చు.. ఉండకపోవచ్చు..! ఈ విషయం దృష్టిలో ఉంచుకొనే ప్రస్తుతం నేను సాధన చేస్తోన్న కొన్ని సులభమైన యోగాసనాల్ని మీ అందరితో పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చాను. రెండో, మూడో త్రైమాసికాల్లో ఉన్న గర్భిణులకు ఇవి మరింత ప్రయోజనకరం! నేను చేసే ఈ శ్వాస సంబంధిత ప్రాణాయామాలు కూర్చొనే సులభంగా చేసేయచ్చు. పైగా శరీరానికి ఇవి వార్మప్‌లా పనిచేస్తాయి. వీటివల్ల తల్లీబిడ్డలిద్దరికీ ఎలాంటి అపాయం ఉండదు. ఒకవేళ వీటికంటే మరింత అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో యోగా చేయాలంటే నేను కచ్చితంగా నిపుణుల పర్యవేక్షణలోనే చేస్తాను. కాబట్టి మీరు కూడా సొంతంగా కాకుండా నిపుణుల ఆధ్వర్యంలోనే సాధన చేయండి..’ అంటోందీ అందాల అమ్మ.


 

ఈ ఆసనాలతో మేలు!

మొదటి వీడియోలో భాగంగా కూర్చొని చేసే ప్రాణాయామాల గురించి పంచుకున్న గీత.. ఇప్పుడు ఈ రెండో వీడియోలో నిల్చొని చేసే పలు యోగాసనాలు, వాటి వల్ల కాబోయే అమ్మలకు కలిగే ప్రయోజనాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

‘ఈ వ్యాయామాలన్నీ నిల్చొని చేసేవే! అలాగని పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా! ఇప్పుడిప్పుడే వ్యాయామం మొదలుపెట్టిన వారు వీటిని సులభంగా చేసేయచ్చు.

సూర్యనమస్కారాలు:

వీపు, శరీరంలోని కండరాలను దృఢం చేసుకోవడానికి ఈ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించి, రక్తప్రసరణను క్రమబద్ధీకరించి, జీవక్రియల్ని వేగవంతం చేస్తాయివి! ఈ క్రమంలో సాధారణంగా ఊపిరి తీసుకుంటూ ఒక్కో భంగిమలో సుమారు 10 సెకన్ల పాటు ఉండాలి.

వారియర్‌ పోజ్‌ 1, 2 :

ఈ భంగిమను సాధన చేయడం వల్ల కటి వలయంలోని కండరాలకు చక్కటి వ్యాయామం అంది అవి మరింత దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. తద్వారా ప్రసవం సమయంలో ఇబ్బందులు రావు.

ద్వికోణాసనం :

ఈ ఆసనంతో ఛాతీ, మెడ, వీపు.. వంటి భాగాల్లోని కండరాలకు వ్యాయామం అందించచ్చు. దీనివల్ల ఆయా భాగాలు ఫ్లెక్సిబుల్‌గా మారడంతో పాటు శరీరమూ దృఢమవుతుంది.

నటరాజాసనం :

ఏకాగ్రతను పెంచుకోవడానికి, శరీరాన్ని బ్యాలన్స్‌ చేసుకోవడానికి ఈ ఆసనం ఉపయుక్తం. అయితే ఇది చేయడం కాస్త కష్టమే. కాబట్టి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవచ్చు.. అది వీలు కాకపోతే గోడకు ఆనుకొని చేయచ్చు. ఒకవేళ ఈ భంగిమ చేసే క్రమంలో ఏదైనా ఇబ్బంది, నొప్పి అనిపిస్తే వెంటనే ఆపేయడం మంచిది.

వారియర్‌ పోజ్‌ 3 :

వెన్ను నొప్పిని తగ్గించి వెన్నెముకను దృఢంగా చేస్తుందీ ఆసనం. శారీరక సత్తువనూ పెంచుతుంది.

ఉథ్థిత హస్త పదంగుష్టాసనం :

కుర్చీ సహాయంతో ఈ ఆసనం చేయచ్చు. స్నాయువులు (మోకాలు మడవడానికి సహకరించే కండరాలు), మోకాళ్లు, చీలమండలను దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుకోవడానికి ఈ ఆసనం సహకరిస్తుంది. మానసిక ప్రశాంతతకు, కటి వలయ ప్రాంతం సులభంగా తెరచుకోవడానికి, అక్కడి కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారడానికి తోడ్పడుతుంది.

వృక్షాసనం :

సుఖ ప్రసవం కావడానికి కటి వలయం, పిరుదుల్లోని కండరాలు దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా మారడం ఎంతో అవసరం. వృక్షాసనం వల్ల ఈ రెండు ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే మానసిక ప్రశాంతతకు, శరీరం బ్యాలన్స్‌ అవడానికీ ఈ ఆసనం తోడ్పడుతుంది.


ప్రాణాయామాలతో రిలాక్సవుదాం!

శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికే కాదు.. వర్కవుట్ తర్వాత రిలాక్సవడానికీ కొన్ని యోగాసనాలు దోహదం చేస్తాయంటోంది గీత. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న సమయంలో కొన్ని ప్రాణాయామాలతో రిలాక్సవ్వచ్చంటూ తాను వేసిన ఆసనాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

‘నేను చేసిన మొదటి రెండు వీడియోలకు కొనసాగింపే ఇది. ఈ ప్రాణాయామాలు గర్భిణిగా ఉన్న మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. వారి శరీరం రిలాక్సవడానికి సహకరిస్తాయి.

స్క్వాట్‌ పోజ్‌:

ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం సర్వసాధారణమైన సమస్య. దీన్ని అధిగమించాలంటే ఈ ఆసనం చక్కటి పరిష్కారం. కటి వలయంలో కండరాల్ని దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా చేయడంలోనూ ఇది సహకరిస్తుంది. అయితే బ్రీచ్‌ బర్త్‌ (సాధారణంగా డెలివరీ సమయంలో బిడ్డ తల ముందుగా బయటికి వస్తుంది. అదే కాళ్లు తొలుత బయటికి వస్తే దాన్ని బ్రీచ్‌ బర్త్‌ అంటారు)కి అవకాశం ఉన్న వారు, 34 వారాలు, ఆ పైబడిన గర్భిణులు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది.

ఉష్ట్రాసనం (క్యామెల్‌ పోజ్‌):

వెన్నెముకకు చక్కటి సపోర్ట్‌ అందించడంతో పాటు భుజాలు, ఛాతీ, పిరుదులు.. వంటివి ఫ్లెక్సిబుల్‌గా మారేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. ఇక డెలివరీ సమయంలో బేబీని బయటికి నెట్టేటప్పుడు కాళ్లు ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే మనపై ఒత్తిడి అంత తగ్గుతుంది. ఈ ప్రయోజనం పొందాలన్నా ఈ ఆసనం వేయాల్సిందే!

సీతాకోకచిలుక పోజ్‌:

కడుపుతో ఉన్నప్పుడు పొత్తికడుపులో ఏర్పడే అసౌకర్యాన్ని ఈ ఆసనంతో దూరం చేసుకోవచ్చు. మానసిక ఆరోగ్యానికి, జీర్ణశక్తిని పెంచడానికి, గుండెలో మంటతో బాధపడే గర్భిణులకు ఇది మేలు చేస్తుంది. అలాగే పిరుదులు, తొడలు, కటి వలయంలోని కండరాలు ఫ్లెక్సిబుల్‌గా, తెరచుకునేలా చేసి.. సునాయాసంగా ప్రసవం అయ్యేలా చేస్తుంది.

ఉపవిష్ఠ కోణాసనం:

ఈ ఆసనంతో కటి వలయంలోని కండరాలు దృఢమవుతాయి. అలాగే వెన్నెముక, వెన్నెముక కింది భాగానికి (లోయర్‌ బ్యాక్‌) సైతం చక్కటి వ్యాయామం అందుతుంది. రక్తప్రసరణ మెరుగై.. పురిటి నొప్పులు తట్టుకునే శక్తిని శరీరానికి అందిస్తుంది.

అర్ధ తితిలి ఆసనం:

పిరుదులు, తొడలకు రక్తప్రసరణ మెరుగవడంతో పాటు ఆయా భాగాల్లోని కండరాల్ని దృఢం చేసేందుకు ఈ వ్యాయామం అవసరం.

ఈ ప్రాణాయామాలు గర్భిణుల్లో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, శ్వాస వ్యవస్థను మెరుగుపరచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, మానసిక ఆరోగ్యానికి, పురిటి నొప్పుల్ని తట్టుకోవడానికి.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అయితే ఈ సమయంలో భస్త్రిక, కపాలభాతి.. వంటి కఠినమైన ఆసనాలు సాధన చేయకపోవడమే మంచిది.


గమనిక: ఏ ఆసనమైనా ఎక్కువ సమయం చేయడం మంచిది కాదు. అలాగే శరీరానికి సౌకర్యంగా అనిపించిన భంగిమలే సాధన చేయాలి. అది కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏమాత్రం అసౌకర్యం కలిగినా, పొట్ట బిగుతుగా మారడం/నొప్పిగా అనిపించడం.. వంటివి జరిగినా వెంటనే సాధన ఆపేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గర్భిణిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మీకు మీరే సొంతంగా యోగా సాధన చేయడం కాకుండా.. ముందుగా మీ ఆరోగ్య స్థితిని మీకు తరచూ చెక్‌ చేసే గైనకాలజిస్ట్‌ దగ్గర చూపించుకొని.. వారి సలహా మేరకే ఏ వ్యాయామమైనా చేయడం మంచిది..’ అంటూ తన ఫిట్‌నెస్‌ పాఠాలతో ఎంతోమంది కాబోయే తల్లుల్లో స్ఫూర్తి నింపుతోందీ బాలీవుడ్‌ మామ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని