ఆన్‌లైన్‌లో.. ఆటాడేస్తున్నారు!

‘ఆన్‌లైన్‌ లైవ్‌ గేమింగ్స్‌’ అంటే మనకు అబ్బాయిలే గుర్తుకొస్తారు... కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలూ ఈ రంగంలోకి వస్తున్నారు. గేమింగ్‌ రంగంలో కంటెంట్‌ క్రియేటర్లుగా మారి ఉపాధి బాటపడుతున్నారు. అలా లైవ్‌ స్ట్రీమింగ్‌తో లక్షలమంది అభిమానులని సంపాదించుకున్న అపర్ణా, కంకనాలను ఫేస్‌బుక్‌ ప్రశంసించింది... 

Updated : 21 Nov 2022 15:34 IST

‘ఆన్‌లైన్‌ లైవ్‌ గేమింగ్స్‌’ అంటే మనకు అబ్బాయిలే గుర్తుకొస్తారు... కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలూ ఈ రంగంలోకి వస్తున్నారు. గేమింగ్‌ రంగంలో కంటెంట్‌ క్రియేటర్లుగా మారి ఉపాధి బాటపడుతున్నారు. అలా లైవ్‌ స్ట్రీమింగ్‌తో లక్షలమంది అభిమానులని సంపాదించుకున్న అపర్ణా, కంకనాలను ఫేస్‌బుక్‌ ప్రశంసించింది... 

పర్ణ అనుకోకుండా ఈ రంగంలో అడుగుపెట్టింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒత్తిడిని అధిగమించేందుకు ఫోన్‌లో గేమింగ్‌ మొదలుపెట్టింది. క్యాండీ క్రష్‌ వంటివి ఆడుతూ తన వేగాన్ని ప్రదర్శించేది. ఈ వేగమే తనని ఇందులో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపి డబ్బు సంపాదించేలా చేసింది. ‘మనకు మామూలు క్రీడలు... వాటికి సంబంధించిన టోర్నమెంట్లు ఉన్నట్టుగానే ఆన్‌లైన్‌ గేమ్స్‌లో కూడా టోర్నమెంట్లు ఉంటాయి. అందులో గెలిస్తే డబ్బొస్తుంది. కానీ నా దగ్గర ఈ గేమ్స్‌ ఆడేందుకు అవసరమైన కంప్యూటర్‌ కానీ కెమెరా కానీ లేవు. మాది కాన్పూర్‌. నాన్న ఓ చిన్న సంస్థలో అకౌంటెంట్‌. నాన్నని ఒప్పించి లోన్‌ తీసుకుని కంప్యూటర్‌ కొన్నా. ఫేస్‌బుక్‌లో రెండేళ్ల క్రితం ‘రాగ్‌ స్ట్రీమ్‌’ పేరుతో సొంతంగా గేమ్స్‌ ఆడుతూ వాటిని స్ట్రీమింగ్‌ చేయడం మొదలుపెట్టా. అలా వచ్చిన డబ్బుతో కెమెరా కొన్నా. అప్పటి దాకా ఫోన్‌ కెమెరా వాడేదాన్ని. తర్వాత కాలంలో నా ఆటకు 23 లక్షలమంది ఫాలోవర్లు వచ్చారు. పల్లెటూరి అమ్మాయిని కావడంతో మొదట్లో సిగ్గుతో అర్ధరాత్రిళ్లు  ఈ వీడియోలు స్ట్రీమింగ్‌ చేసేదాన్ని. ఇది చూసి అమ్మానాన్నలు చదువుకోకుండా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఏంటని భయపడేవారు. ఇది కూడా వృత్తే అని వాళ్లకు నచ్చచెప్పాను. మగవాళ్లు ఎక్కువగా ఉండే ఈ గేమ్స్‌లో అవమానాలనీ ఎదుర్కొన్నా. ఆన్‌లైన్‌ షేమింగ్‌, వివక్షకు గురయ్యా. మేల్‌ స్ట్రీమర్స్‌తో ఆడేటప్పుడు వాళ్ల కామెంట్లు బాధపెట్టేవి. అవేమి పట్టించుకోలేదు. ఇప్పుడు నెలకు ఈ గేమ్స్‌ ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆర్జిస్తున్నా’ అని అంటోంది అపర్ణ.

తొలి మహిళగా... చిన్నప్పట్నుంచీ కజిన్స్‌తో కలిసి కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం అలవాటు గువాహటికి చెందిన కంకనా తాలుక్దార్‌కు. కాలేజీకి వెళ్లిన తర్వాత ఆటలో ఆమె వేగం, తెలివితేటలు చూసి స్నేహితులు ప్రశంసించే వారు. అదే నాలో ఉత్సాహాన్ని నింపింది అంటుంది కంకనా. ‘మిస్టిక్‌ ఇగ్నైట్‌’ పేరుతో ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సంబంధించిన విశేషాలు అందించడం, సొంతంగా ఆడుతూ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం వంటివి చేసేదాన్ని. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో నాకు 67వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదేం వృత్తి అంటూ మొదట్లో చాలామంది హేళన చేసేవారు. స్ట్రీమింగ్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌లో విదేశీ అమ్మాయిలా కనిపించడానికి హెయిర్‌కలర్‌ వేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం భారతీయురాలిగానే కనిపించడానికి ఇష్టపడుతున్నా. 2019 నుంచి మన దేశంలోనూ ఈ రంగంలో మహిళల సంఖ్య పెరుగుతోంది’ అంటోన్న కంకనా ఈ ఏడాదే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. ఈ రంగంలో మహిళలని ప్రోత్సహించేందుకు ఫేస్‌బుక్‌ కంకనాతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్