పసి మనసుల్ని గెలవాలంటే..

ఐశ్వర్య తన తొమ్మిదేళ్ల పాప నిత్యను ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటుంది. అయినా కూతురు మాత్రం తన స్నేహితుల తల్లిదండ్రుల్లా ఉండటం లేదంటోంది. తనని ఎలా సంతోషంగా ఉంచాలో,

Updated : 04 Oct 2021 12:22 IST

ఐశ్వర్య తన తొమ్మిదేళ్ల పాప నిత్యను ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటుంది. అయినా కూతురు మాత్రం తన స్నేహితుల తల్లిదండ్రుల్లా ఉండటం లేదంటోంది. తనని ఎలా సంతోషంగా ఉంచాలో, ఆ పాపాయి మనసులో స్థానం ఎలా సంపాదించాలో ఐశ్వర్యకు అర్థంకావడంలేదు. పిల్లల అవసరాలను తీర్చడం మాత్రమే బాధ్యత అనుకోవడం పొరపాటు అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. వారి మనసును అర్థం చేసుకోవడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే...

రోల్‌మోడల్‌గా... ఉదయం నిద్రలేవాలి, సమయపాలన పాటించాలంటూ పిల్లలకు పాఠంలా చెప్పకుండా, ముందుగా తల్లిదండ్రులు వాటిని పాటించాలి. సమయాన్ని వృథా చేయకుండా ఎలా వినియోగించుకోవాలో చిన్నారులు చూసి నేర్చుకునేలా పెద్దలు ప్రవర్తించాలి.  మీ నుంచి మంచి మాటతీరు, సమయ స్ఫూర్తి, జీవననైపుణ్యాలు వంటి లక్షణాలను ఒంటపట్టించుకునేది ఈ చిన్న వయసులోనే. మీరు రోల్‌ మోడల్‌గా నిలవాలంటే ముందు మీరు క్రమశిక్షణ అలవరుచుకోవాలి.

వారు చెప్పేది వింటే... పిల్లలను ఏ తల్లిదండ్రులైనా ప్రేమిస్తారు.. మేమూ అంతే.. అని అక్కడితో ఆగిపోకండి. మీకు వారి మీద ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉందని చెప్పేలా ప్రవర్తించండి. వాళ్ల కోసం సమయం కేటాయించడం, వారు చెప్పే ప్రతి విషయాన్ని పూర్తిగా వినడం, సరైన సలహాలు ఇవ్వడం, స్నేహితులుగా మెలగడం వంటిపనులతో మీతో ఉన్న సాన్నిహిత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు మిమ్మల్ని వారు కూడా ప్రేమించడం మొదలుపెడతారు. తమ సమస్యలను చెబితే, వాటికి పరిష్కారం దొరుకుతుందనే ధైర్యం, భరోసా మీ నుంచి పొందుతారు.

సానుకూలంగా... చిన్నప్పటి నుంచే పంచుకునేతత్వాన్ని అలవాటు చేయాలి. నేను, నాది అని కాకుండా మనం అని ఆలోచించే దిశగా వారిని నడిపించాలి. కష్ట, సుఖాలకు స్పందించే తీరుని, భావోద్వేగాలను సమన్వయం చేసుకునే అవసరానీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇవన్నీ వారిలో సానుకూలత్వాన్ని, దయాగుణాన్ని పెంచుతాయి. కుటుంబ విలువలు, మానవ సంబంధాలు వంటివన్నీ చిన్నప్పటి నుంచి చిన్నారులకు ఇంటి నుంచే అలవడాలి. అప్పుడే ప్రతికూలతలకు దూరంగా ఉండగలరు.

ఒత్తిడి అధిగమించేలా... ప్రతి చిన్న విషయానికి ఇంట్లో పెద్దవాళ్లు ఆందోళనకు గురైతే, ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అది వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. సమస్య పెద్దదైనా, చిన్నదైనా దాన్ని పరిష్కరించుకోవడంలో పాటించే అంశాలు చిన్నారులకు పాఠాలుగా మారతాయి. తోట పెంపకం, పుస్తకపఠనం, క్రీడలపై ఆసక్తిని పెంచడం, స్ఫూర్తిదాయకమైన వారి కథలను వినిపించడం వల్ల వారు ఒత్తిడిని జయించడమెలాగో తెలుసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్