పిల్లల్ని పెంచడం కష్టంగా ఉందా...

తల ప్రాణం తోక్కొచ్చిందన్నారంటే అది పిల్లల పెంపకం విషయంలోనే అనడంలో అతిశయం లేదు. నేటితరానికి ఇదో పెద్ద సవాలు. వాళ్ల ఇబ్బందిని గుర్తించి.. పిల్లల పెంపకంపైన సోషల్‌ మీడియాలో, ప్రత్యేక శిబిరాల్లో సూచనలూ సలహాలిస్తూ ఈతరం అమ్మానాన్నలకు మార్గనిర్దేశం చేస్తున్నారు పల్లవీ రావు.

Updated : 30 Apr 2022 04:24 IST

తల ప్రాణం తోక్కొచ్చిందన్నారంటే అది పిల్లల పెంపకం విషయంలోనే అనడంలో అతిశయం లేదు. నేటితరానికి ఇదో పెద్ద సవాలు. వాళ్ల ఇబ్బందిని గుర్తించి.. పిల్లల పెంపకంపైన సోషల్‌ మీడియాలో, ప్రత్యేక శిబిరాల్లో సూచనలూ సలహాలిస్తూ ఈతరం అమ్మానాన్నలకు మార్గనిర్దేశం చేస్తున్నారు పల్లవీ రావు.

గెట్‌ సెట్‌ పేరెంట్‌... పిల్లల పెంపకం విభాగంలో సేవలు అందించేందుకు పల్లవి ప్రారంభించిన సంస్థ. ఈ పేరుతో పల్లవి నిర్వహించే ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానెల్‌ను తల్లిదండ్రులెందరో అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాలో అయితే 2.7లక్షల ఫాలోయర్లు ఉన్నారు. ఇంజినీరింగ్‌, ఎంబీఏలతోపాటు ‘మహిళలు-వ్యాపారం’ అంశంపైన పీహెచ్‌డీ చేశారు పల్లవి. ఆపైన చిన్నారుల విద్యకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారంలో అడుగుపెట్టారు. ‘బ్రెయినీ బేర్‌ స్టోర్‌’ పేరుతో పిల్లల చదువు, వాళ్ల సృజనాత్మకతను పెంచే పుస్తకాలూ, వస్తువుల్ని అమ్మే దుకాణాల్నీ, ఆన్‌లైన్‌ పోర్టల్‌నీ నడుపుతున్నారు. ‘బ్రెయినీ బేర్‌ ప్రీ స్కూల్‌ అండ్‌ యాక్టివిటీ క్లబ్‌’నీ ప్రారంభించారు. తన సొంత నగరం భోపాల్‌లో మొదటి స్కూల్‌ని ప్రారంభించి... ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోని 23 కేంద్రాలకు విస్తరించారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి సంస్థనీ నడుపుతున్నారు. ఈ అంశంమీద అనేక అంతర్జాతీయ వేదికలమీద ప్రసంగిస్తుంటారు పల్లవి.

ఇదే ఎందుకంటే...  
‘పిల్లల పెంపకం గురించి ఎవరూ ప్రత్యేక శిక్షణ తీసుకోరు. ఉమ్మడి కుటుంబాల్లో ఇది అందరి బాధ్యతగా ఉండేది. కానీ ఆధునిక యుగంలో తల్లిదండ్రులపైనే ఈ భారం పడుతోంది. దీంతో కొత్తతరం చాలా ఇబ్బందులు పడటం గమనించాను. వారికి తగిన సమాచారం, సలహాలు, సూచనలూ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇటువైపు అడుగులు వేశా’ అని చెబుతారు పల్లవి. దీనిపైన యువ తల్లిదండ్రులకు ప్రత్యేక సదస్సులూ, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు పల్లవి. కొవిడ్‌ సమయంలో పిల్లలు ఇళ్లకే పరిమితమైనపుడు ఈ సమస్య తీవ్రం కావడం గమనించి పిల్లల పెంపకంపైన వీడియోలు చేసి సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆచరణ సాధ్యమైన సలహాలనే పంచుకుంటారామె.
చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొనే రెండు ప్రధాన సమస్యలకు పల్లవి చూపే పరిష్కారాలు..
చదువుపైన ఆసక్తి కలిగించాలంటే...
1. పిల్లలకు ఆరేడేళ్లప్పట్నుంచే వారి దగ్గర కూర్చొని కథలు చదివి వినిపించండి.
2. రోజూ ఒకే సమయానికి చదవడం అలవాటు చేయండి. ఎక్కడున్నా అది రీడింగ్‌ టైమ్‌ అని తెలుసుకుంటారు. ఆ సమయంలో ఫోన్‌, టీవీలకు దూరంగా ఉంచండి.
3. ఎప్పుడూ క్లాస్‌ పుస్తకాలే కాకుండా, వారికి నచ్చే కథలూ, బొమ్మల కథల పుస్తకాల్నీ చదవనీయండి.
4. స్కూల్‌, అపార్ట్‌మెంట్లలో బుక్‌ క్లబ్‌ ఏర్పాటుచేసి అందులో భాగం చేస్తే స్నేహితులు ఏం చదువుతున్నారో తెలుసుకుంటారు. వాటిపై చర్చిస్తారు కూడా.
5. అప్పుడప్పుడూ ప్రత్యేకంగా కాగితంమీద మీరు చెప్పాల్సిన విషయాన్ని రాసివ్వండి. రాయడంలోని మజా తెలుసుకుంటారు.  

బ్రాండ్‌ మోజు పోగొట్టాలంటే...
1. పిల్లల ముందు బ్రాండ్ల గురించి మాట్లాడొద్దు.
2. బ్రాండ్‌ గురించి వాళ్లు మాట్లాడితే దానికంటే నాణ్యత, డబ్బు ముఖ్యమని చెప్పండి.
3. బ్రాండ్‌ వస్తువుల్ని ఉపయోగించడంకంటే ఆరోగ్యంగా ఉండటం, బాగా చదవడం... వీటికే ఎక్కువ విలువ అని వివరించండి.
4. ఎప్పుడూ మాల్స్‌ చుట్టూ తిరగడమే కాకుండా పిల్లల్ని చిన్న దుకాణాలూ, ఎగ్జిబిషన్‌లకీ తీసుకెళ్లి షాపింగ్‌ చేయండి.
5. చూడ్డానికి బాగుండాలే కానీ, బ్రాండ్‌తో సంబంధం లేదని చెప్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్