సాగుని ప్రేమించి... పది స్వర్ణాలు!

ఎన్ని లక్షలైనా వెచ్చించి మెడికల్‌ సీటు సాధించుకోవాలనే వాళ్లెందరో... అలాంటి పరిస్థితుల్లో వచ్చిన సీటుని కాదని వ్యవసాయంపై మక్కువతో ఆ బాట పట్టింది మోనిక.  ఎంత ఇష్టంగా చదివిందంటే పది స్వర్ణపతకాలు సాధించేంతగా...

Updated : 22 Sep 2021 04:48 IST

ఎన్ని లక్షలైనా వెచ్చించి మెడికల్‌ సీటు సాధించుకోవాలనే వాళ్లెందరో... అలాంటి పరిస్థితుల్లో వచ్చిన సీటుని కాదని వ్యవసాయంపై మక్కువతో ఆ బాట పట్టింది మోనిక.  ఎంత ఇష్టంగా చదివిందంటే పది స్వర్ణపతకాలు సాధించేంతగా...

వైద్యవిద్య కోసం ఆస్తులు అమ్మడానికైనా సిద్ధమయ్యే వాళ్లు ఎందరో! మోనిక ఇందుకు భిన్నంగా ఆలోచించింది. తొలి ప్రయత్నంలోనే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో 200వ ర్యాంకు సాధించింది. బంధువులు, కుటుంబ సభ్యులు ‘మంచి ర్యాంకు... మెడికల్‌ సీటు పక్కా’ అంటూ పొగడ్తలతో ముంచేశారు. కానీ మోనిక సమాధానం విన్నాక అందరూ ఆశ్చర్యపోయారు. తనకి వైద్యవిద్య కన్నా వ్యవసాయమే ఇష్టమని, ఆ కోర్సునే ఎంచుకుంటానని చెప్పింది. అప్పటి తన నిర్ణయం సరైందే అని తాజాగా మోనిక సాధించిన విజయాలే నిరూపించాయి. బెంగళూరులో మంగళవారం నిర్వహించిన బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవంలో 10 స్వర్ణపతకాలు అందుకుంది.

సేవ చేయాలనే తపన ఉంటే ఏ రంగమైనా ఒకటేనని చెబుతోంది మోనిక. కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి ఆమె సొంత ఊరు. అక్కడ సరైన సదుపాయం లేక దగ్గర్లోని మూడబిదరిలోని ఆళ్వాస్‌ పీయూ కళాశాలలో చేరింది. అప్పుడే తనకి తన సొంత ఊర్లోనే కాక, చదువుకుంటున్న చోట కూడా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిశాయి. రైతు కష్టానికి తగిన ఆదాయం పొందలేకపోవడంపై అధ్యయనాలు చేపట్టింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మోనిక తండ్రి సాగులో లాభం రాదని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. కానీ మోనిక మాత్రం వ్యవసాయంలోనే విజయం సాధించాలని నిర్ణయించుకుంది. ఎప్పుడు ఊరు వెళ్లినా... తాతయ్య, చిన్నాన్న, పెదనాన్నలనడిగి పంటల బాగోగులు, మార్కెట్‌ పరిస్థితుల్ని ఆరా తీసేది. సాగుపై మమకారంతో మండ్య వ్యవసాయ కళాశాలలో చేరి నాలుగేళ్ల అగ్రి బీఎస్‌సీని 91.10 సీజీపీఏతో పూర్తి చేసింది. ప్రస్తుతం అసోంలో ఎమ్‌ఎస్సీ చేస్తోంది. ‘మారుతున్న జీవనశైలికి అనుగుణంగా రైతులు తమ పంటల్లో వైవిధ్యత పాటించాలి. ఈ రంగంలో సమస్యల్ని అధ్యయనం చేసి పరిష్కారాలు చూపడం, రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడమే నా లక్ష్యం’ అంటోంది మోనిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్