పిల్లలు జలుబు, దగ్గు ఎదుర్కొనేదెలా?

మా పిల్లల వయసు ఏడేళ్లు, అయిదేళ్లు. స్కూల్‌కి వెళ్తున్నారు. వర్షాకాలంలో వాళ్లకి తరచూ జలుబు, దగ్గు వస్తాయి. కానీ వారిలో రోగ నిరోధకశక్తి పెరగాలంటున్నారు డాక్టర్లు. ఇందుకోసం ఎలాంటి ఆహారం ఇవ్వాలంటారు? 

Updated : 07 Jul 2022 13:15 IST

మా పిల్లల వయసు ఏడేళ్లు, అయిదేళ్లు. స్కూల్‌కి వెళ్తున్నారు. వర్షాకాలంలో వాళ్లకి తరచూ జలుబు, దగ్గు వస్తాయి. కానీ వారిలో రోగ నిరోధకశక్తి పెరగాలంటున్నారు డాక్టర్లు. ఇందుకోసం ఎలాంటి ఆహారం ఇవ్వాలంటారు? 

- ఒక సోదరి, పల్నాడు

వాతావరణంలో మార్పులు రాగానే కొత్త బ్యాక్టీరియా, వైరస్‌ వస్తాయి. వర్షాకాలంలో ఉండే తేమ దీనికి కారణం. ఇవి దాడి చేయగానే ప్రతి ఒక్కరి శరీరం స్పందిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేవారి మీద వీటి ప్రభావం తక్కువ. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం నిరంతర ప్రక్రియ. ఏడాది పొడవునా పోషకాహారాన్ని తీసుకోవడమే దీనికి మార్గం. పిల్లల శరీరం ప్రతి సీజన్లో కొత్తరకమైన బ్యాక్టీరియా, వైరస్‌లని మొదటిసారి ఎదుర్కొంటుంది. తగిన పోషకాలూ, విశ్రాంతి ఇస్తే వాటిని తట్టుకుంటారు. పెద్ద వయసు వచ్చేవరకు అన్ని రకాల సీజన్లలో వచ్చే వైరస్‌, బ్యాక్టీరియాల్ని శరీరం గుర్తు పెట్టుకుని స్పందిస్తుంది. దాంతో పెద్దయ్యాక ఎక్కువ సమస్యలు రావు. చిన్నప్పుడు మాత్రం ముక్కులోంచి నీరు కారడం, నీరసం, తుమ్ములూ, దగ్గు, కఫం రావడం లాంటి లక్షణాలుంటాయి. వైరస్‌, బ్యాక్టీరియాల్ని చిన్నప్పట్నుంచీ ఎదుర్కోవడమే మంచిది. అదే సమయంలో పిల్లలకి బలమైన ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా మేలైన మాంసకృత్తులు అందించాలి. పాలు, గుడ్లు, పెరుగు, నట్స్‌, గుగ్గిళ్లు, వేరుశనగ, చీజ్‌, పనీర్‌ ఇవన్నీ ఆ కోవకే వస్తాయి. వైవిధ్యమైన ఆహారంతోనూ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చిరుధాన్యాలూ, కూరగాయలు, ఆకుకూరలు, నట్‌్్స.. ఇలా భిన్నరకాలు పిల్లలకు ఇవ్వాలి. పండ్లు, ముఖ్యంగా నిమ్మజాతికి చెందినవి తీసుకోవాలి. ఉసిరి, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, అల్ల నేరేడు... అన్నీ అందివ్వాలి. ఆకుకూరల సూప్‌లనీ తాగించ వచ్చు. నువ్వులు, వేరుశనగ, ఆవ, రైస్‌ బ్రాన్‌.. ఇలాంటి నూనెలతో ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ సరైన మోతాదులో అందుతాయి. ప్రాసెస్డ్‌, డీప్‌ ఫ్రై చేసిన ఆహారం మంచిది కాదు. తృణధాన్యాలూ, గింజ ధాన్యాలు పొట్టుతో తీసుకుంటే మెగ్నీషియం, జింక్‌, విటమిన్‌-ఇ దొరుకుతాయి. ఆహార పదార్థాల మీద ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. తాజాగా, వేడివేడిగా తినాలి. వ్యక్తిగత పరిశుభ్రతా ముఖ్యమే. ఇలా చేస్తే అస్తమానం జబ్బులు రావు, వచ్చినా
తట్టుకోగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్