రజ ప్రభ.. నెలసరికో పండగ!

నెలసరి అనగానే చాలామందిలో అదో అపవిత్రమనే భావన ఉంటుంది. పండగలు, దైవ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు. కొన్నిచోట్ల ఆడవాళ్లను ఇంటి బయటో, ఊరి చివరో ఉంచే నియమాలూ లేకపోలేదు. కానీ దీన్నో పండగలా చేస్తారన్నది తెలుసా? ఎక్కడో కాదు.. మన దేశంలోనే!

Updated : 31 Jul 2021 05:27 IST

నెలసరి అనగానే చాలామందిలో అదో అపవిత్రమనే భావన ఉంటుంది. పండగలు, దైవ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు. కొన్నిచోట్ల ఆడవాళ్లను ఇంటి బయటో, ఊరి చివరో ఉంచే నియమాలూ లేకపోలేదు. కానీ దీన్నో పండగలా చేస్తారన్నది తెలుసా? ఎక్కడో కాదు.. మన దేశంలోనే!
ఒడిశా ప్రజలు ఏడాది పొడవునా పండగలు చేసుకుంటూనే ఉంటారు. వారు చేసుకునే వాటిలో ‘రజ ప్రభ’ ఒకటి. నెలసరిని వేడుకగా చేసుకోవడమని అర్థం. వ్యవసాయదారులు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చే పండగిది. దీన్ని జూన్‌ మధ్యలో మూడు రోజులు జరుపుకొంటారు. ఈ సమయంలో భూమాత నెలసరిలో ఉంటుందని వారి విశ్వాసం. ఆమె తిరిగి వర్షాకాలంలో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నట్లు భావిస్తారట. అందుకే ఈ రోజుల్లో దున్నడం, మొక్కలు నాటడమేకాదు.. నిర్మాణాలనూ ఆపేస్తారు. భూమాతకు ఎలాంటి అసౌకర్యమూ కలిగించకూడదనేది వారి ఉద్దేశం.
ఈ మూడు రోజులూ ఆడ వారికి ఏ పనీ ఉండదు. ఇంటి, వంట పనుల నుంచీ వారికి విశ్రాంతినిస్తారు. అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది. పహిలీ రజా, రజ సంక్రాంతి, బసి రజా ఇలా.. ఒక్కోరోజును ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ మూడు రోజులూ కొత్తబట్టలు, నగలు, పారాణితో అందంగా తయారవుతారు. దగ్గర్లో జరిగే జాతరలకు వెళ్లడమో, స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవడమో చేస్తారు. వీరి కోసం ప్రతి ఇంట్లోనూ, బహిరంగ ప్రదేశాల్లో ఉయ్యాలలను కట్టి, పూలతో అలంకరిస్తారు. అమ్మాయిలు వీటిపై ఊగుతూ అమ్మాయిగా పుట్టడం ఎంత ఆనందకరమైన విషయమో చెప్పేలా పాటలను పాడతారు. ‘పోడా పితాస్‌’ అనే స్వీట్లను పంచుతారు. ఉప్పు, వండిన వాటిని ఆహారంగా తీసుకోరు. ఉట్టి పాదాలతో నేలను తాకరు.
నాలుగో రోజు ‘వసుమతి గధువ’. ఆరోజు భూదేవి విగ్రహానికి స్నానం చేయించి, పూజలు చేసి, ప్రసాదాలను సమర్పించడంతో ఇది ముగుస్తుంది. పండగను పక్కనపెడితే.. దీని సారాంశం.. సంతానోత్పత్తికి ప్రాధాన్యం, గౌరవం ఇవ్వడం. ఇప్పటికీ ఎన్నో చోట్ల నెలసరిని అపవిత్రతకు గుర్తుగా చూస్తున్న వారున్నారు. అలాంటిది దీన్నో వేడుకగా, పండగగా నిర్వహించడం గొప్పే కదా! దీన్ని జాతీయ పండగగా చేయాలనే వారూ లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్