శ్రీవారి పూలకు... వన్నెలద్దుతున్నారు!

శ్రీవారిసేవలో తరించిన పుష్పాలు ఇకపై భక్తుల ఇళ్లలో అందమైన కళాకృతులుగా దర్శనమివ్వనున్నాయి..  అమ్మవారిని అలంకరించిన కుసుమాలు అగరొత్తులుగా మారి పరిమళాలు పంచనున్నాయి. పూలను పునర్వినియోగంలోకి తీసుకురావాలకున్న తితిదే ప్రయత్నానికి మహిళల నైపుణ్యాలు తోడై వారికి సరికొత్త ఉపాధిమార్గాలుగా మారాయి.. 

Updated : 01 Oct 2021 08:59 IST

శ్రీవారిసేవలో తరించిన పుష్పాలు ఇకపై భక్తుల ఇళ్లలో అందమైన కళాకృతులుగా దర్శనమివ్వనున్నాయి..  అమ్మవారిని అలంకరించిన కుసుమాలు అగరొత్తులుగా మారి పరిమళాలు పంచనున్నాయి. పూలను పునర్వినియోగంలోకి తీసుకురావాలకున్న తితిదే ప్రయత్నానికి మహిళల నైపుణ్యాలు తోడై వారికి సరికొత్త ఉపాధిమార్గాలుగా మారాయి.. 

తితిదే పరిధిలోని తిరుపతి ఆలయాల్లో స్వామివారి కైంకర్యాలకోసం వినియోగించిన పూలను పునర్వినియోగంలోకి తెస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది తితిదే. డ్రైఫ్లవర్‌ టెక్నాలజీని వాడితే మంచి ఫలితాలు పొందొచ్చన్నారు వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అనుకున్నదే తడవుగా తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన క్షేత్రంలో డ్రైఫ్లవర్‌ టెక్నాలజీ ద్వారా కళాకృతుల తయారీపై శిక్షణ ప్రారంభించారు. ఎంతో ఓపిగ్గా చేయాల్సిన పని కాబట్టి ఈ శిక్షణకు మహిళలని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. తొలిదశలో 30 మందికే శిక్షణ ఇద్దామని మొదట అనుకున్నా  స్పందన అధికంగా ఉండటంతో 60 మందికి ఇచ్చారు. సేకరించిన పూలను మూడు రకాల పద్ధతుల్లో ఎండపెట్టి వాటిని కళాకృతులుగా మారుస్తారు. ఇందుకోసం సిలికాజెల్‌, ఎంబెడెడ్‌, హాంగింగ్‌ విధానాలని అమలుచేస్తారు. మొదటిసారి శిక్షణ తీసుకున్న 60 మంది మహిళలు శంఖుచక్రాలు, నామాలు, స్వామి, అమ్మవార్ల చిత్ర పటాలను ఎండు పూలతో తయారు చేశారు. వాటిని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ‘గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం ఆలయాల్లో వినియోగించిన పూలతో ఈ కళాకృతులను తయారు చేస్తున్నాం. ఆగమసలహాదారుల సూచనలు తీసుకొని త్వరలోనే తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించిన పుష్పాలను కూడా ఇలా కళాకృతులకు మార్చే ఆలోచనలు చేస్తున్నాం. ప్రస్తుతానికి పూల ఫొటో ఫ్రేంలతోపాటు టేబుల్‌ వెయిట్‌లు, రాఖీలు వంటి ఐదు రకాల ఆకృతులను తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం’ అంటున్నారు తితిదే జేఈఓ సదాభార్గవి. వీటితోపాటు అగరొత్తుల తయారీలోనూ 250 మంది మహిళలు 20 రోజులపాటు శిక్షణ తీసుకొన్నారు. దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో వారంతా ఆలయాల్లో సేకరించిన పూలతో అగరొత్తులు తయారుచేసి ఏడు రకాల బ్రాండ్లని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. వీరు తయారుచేసిన అగరొత్తులని లడ్డూ తయారీ కేంద్రాల్లో తితిదే విక్రయిస్తోంది. ఈ అగరొత్తులకు డిమాండ్‌ పెరగడంతో మరిన్ని పూలను సేకరించాలని తితిదే ఆలోచిస్తోంది.

- వేలూరి నారాయణప్ప, ఈటీవీ తిరుపతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్