ప్లాస్టిక్‌ ర్యాపర్స్‌కు పనిచెప్పింది...

వృథాగా పడేసే ప్లాస్టిక్‌ ర్యాపర్స్‌ని అందమైన బ్యాగులు, పోట్లీ, స్టోరేజ్‌ బాస్కెట్స్‌గా మార్చి దేశ వ్యాప్తంగా విక్రయిస్తోంది. వృథాను రీసైకిల్‌ చేసే ఈ ప్రాజెక్టులో చరఖాలను మాత్రమే ఉపయోగించడం విశేషం. మహిళలకు ఉపాధిని అందిస్తూ,

Updated : 28 Dec 2021 05:54 IST

వృథాగా పడేసే ప్లాస్టిక్‌ ర్యాపర్స్‌ని అందమైన బ్యాగులు, పోట్లీ, స్టోరేజ్‌ బాస్కెట్స్‌గా మార్చి దేశ వ్యాప్తంగా విక్రయిస్తోంది. వృథాను  రీసైకిల్‌ చేసే ఈ ప్రాజెక్టులో చరఖాలను మాత్రమే ఉపయోగించడం విశేషం.  మహిళలకు ఉపాధిని అందిస్తూ, లక్షల్లో లాభాలను పొందుతోంది పుణెకు చెందిన అమితాదేశ్‌పాండే...

మిత చదివింది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌. ప్రకృతి సిద్ధంగా పచ్చదనంతో నిండి ఉండే సిల్వస్సాలోని నగర్‌ హవేలీలో పుట్టి పెరిగిందీమె. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణం ఈమెకు. హైస్కూల్‌ స్థాయి నుంచి సమీపంలోని కొండలపైకి ట్రెక్కింగ్‌కు వెళ్లేది. స్వచ్ఛమైన గాలిని మాత్రమే అనుభవించిన అమిత చదువు నిమిత్తం పుణె వచ్చినప్పుడు అక్కడి కాలుష్యం కలవర పరిచింది. చదువు పూర్తయిన తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, నాలుగేళ్లకే ఉద్యోగానికి రాజీనామా చేసి మాస్టర్స్‌ చేయడానికి అమెరికా వెళ్లింది. 2013లో ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత ‘ఆరోహనా ఈకో సోషల్‌ ఫౌండేషన్‌’ పేరుతో  కన్సెల్టిన్సీ ప్రారంభించి, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్‌ఆర్‌)కు సంబంధించి పలు ప్రాజెక్టులకు పనిచేసింది.

రీ చక్రా... పర్యావరణానికి సంబంధించి ఏదైనా చేయాలనుకుంది అమిత. దాంతో కన్సల్టెన్సీ నుంచి ప్లాస్టిక్‌ రీసైకిలింగ్‌ చేయడంవైపు అడుగులేసి, 2015లో ‘రీ చక్రా’ ఈకో సోషల్‌ ఫౌండేషన్‌ను స్థాపించింది. ప్లాస్టిక్‌ వృథాను దారాలుగా మార్చడానికి చరఖాలను వాడాలనుకుంది. ముందుగా ప్లాస్టిక్‌ ర్యాపర్స్‌, సంచులను సేకరించి వాటిని నీటిలో, ఆ తర్వాత బయోడిగ్రేడబుల్‌ సొల్యూషన్‌లో శుభ్రపరిచి దారాలుగా మారుస్తోంది. దీనికి చరఖాను ఉపయోగిస్తోంది. ఈ దారాలను మగ్గంపై నేసి, దాన్ని బ్యాగుల తయారీకి వాడతారు.

తిరస్కరించేవారు... ఈ బ్యాగులను దుకాణాలకు తీసుకెళ్లినప్పుడు మొదట చాలామంది తిరస్కరించేవారని చెప్పుకొచ్చింది అమిత. ‘ప్లాస్టిక్‌ సంచులను రీసైకిల్‌ చేసే ఉత్పత్తులపై ఎవరూ ఆసక్తి చూపించరంటూ దుకాణదారులు అనేవారు. వీటి గురించి వివరించి, వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాలని కోరేదాన్ని. అలా నెమ్మదిగా ప్రజలకు పరిచయం చేయగలిగా. ప్రతి పట్టణానికీ వెళ్లి నేనే మార్కెటింగ్‌ చేసే దాన్ని. గ్రామీణమహిళలకు ఈ ప్లాస్టిక్‌ దారాలతో బ్యాగులే కాకుండా పోట్లీలు, చాపలు, కాయగూరలు, నిత్యావసర వస్తువులుంచే స్టోరేజ్‌ సంచులు వంటి పలురకాల ఉత్పత్తుల తయారీలో శిక్షణనందించాం. ఈ ప్రాజెక్టు సక్సెస్‌ అవడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. ప్రస్తుతం ఇందుకు కావాల్సిన ముడిసరుకును మొత్తం పుణెలో చెత్తను సేకరించేవారి వద్ద తీసుకుంటున్నా. ఇప్పటి వరకు ఏడు లక్షల ప్లాస్టిక్‌ బ్యాగులను రీసైకిల్‌ చేసి ఎలక్ట్రానిక్‌ కేసెస్‌, స్పోర్ట్స్‌ బ్యాగులు, పర్సులు, పౌచెస్‌ తదితర 20 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. అలాగే పండుగలు, శుభకార్యాలకు గిఫ్ట్స్‌ను రూపొందిస్తున్నాం. పలు కార్పొరేట్‌ సంస్థలు మా ఉత్పత్తులను తీసుకుంటున్నాయి.  వీటి తయారీలో పాతికమందికిపైగా పని చేస్తారు. గతేడాది రూ.70లక్షల టర్నోవరు సాధించాం’ అంటోన్న అమిత సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్