197 వీడియోలు... 79 లక్షల వీక్షణలు

పెళ్లయ్యాక ఏమాత్రం అవగాహన లేని దేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తన చదువుకు తగిన ఉద్యోగాల్లేవు. కెరియర్‌ మార్చుకోవడానికి కోర్సులు చేసింది. ఇంతలో పాప! ఈసారి యూట్యూబ్‌ ఛానెల్‌పై దృష్టిపెట్టింది. అక్కడా చుక్కెదురే! కానీ ఏదైనా ప్రయత్నించాలనే తపన లావణ్యా రెడ్డిది. ఈసారి పంథా మార్చింది.. నీలూస్‌ వ్ల్లాగ్స్‌ ఫ్రమ్‌ ఆఫ్రికా పేరుతో ఆ దేశ విశేషాలను పంచుకుంటోంది. ఈసారి పేరు, ఆదాయం రెండూ వచ్చాయి. ఆ విశేషాలు.. తన మాటల్లోనే..!

Updated : 30 Aug 2022 13:01 IST

పెళ్లయ్యాక ఏమాత్రం అవగాహన లేని దేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తన చదువుకు తగిన ఉద్యోగాల్లేవు. కెరియర్‌ మార్చుకోవడానికి కోర్సులు చేసింది. ఇంతలో పాప! ఈసారి యూట్యూబ్‌ ఛానెల్‌పై దృష్టిపెట్టింది. అక్కడా చుక్కెదురే! కానీ ఏదైనా ప్రయత్నించాలనే తపన లావణ్యా రెడ్డిది. ఈసారి పంథా మార్చింది.. నీలూస్‌ వ్ల్లాగ్స్‌ ఫ్రమ్‌ ఆఫ్రికా పేరుతో ఆ దేశ విశేషాలను పంచుకుంటోంది. ఈసారి పేరు, ఆదాయం రెండూ వచ్చాయి. ఆ విశేషాలు.. తన మాటల్లోనే..!

మాది నెల్లూరులోని వెంకటగిరి దగ్గర చిన్న పల్లెటూరు. నాన్న ఈశ్వర్‌ రెడ్డి రైతు. అమ్మ పోలమ్మ. నా బీటెక్‌ తర్వాత పెళ్లైంది. మావారు శ్రీనివాసరెడ్డి ఆఫ్రికాలో నిర్మాణ సంస్థకి జనరల్‌ మేనేజర్‌. ఉద్యోగం చేద్దామంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లేవు. అకౌంటింగ్‌ ప్రయత్నిద్దామని కోర్సులూ చేశా. కానీ తర్వాత పాప, తన ఆలనాపాలనతోనే సరిపోయేది. తను కాస్త పెద్దదైంది. స్కూలుకి వెళుతోంది. చేతిలో కావాల్సినంత సమయం. ఖాళీగా ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. యూట్యూబ్‌ ఛానెల్‌ పెడదామనిపించింది. పోషకాహారమన్నా, ప్రయాణాలన్నా నాకాసక్తి. వాటిపై వీడియోలు చేస్తానంటే మా వారూ ప్రోత్సహించారు. అలా 2020 జనవరిలో ‘నీలూస్‌ హెల్దీ కిచెన్‌ అండ్‌ వ్లాగ్స్‌’ ప్రారంభించా.

సంక్రాంతితో మొదలు... మేముండే చోట భారతీయులు ఎక్కువ. కాబట్టి సంక్రాంతి సంబరాల్ని తొలి వీడియోగా పెట్టా. తర్వాత కొద్ది రోజులకు కొవిడ్‌ లాక్‌డౌన్‌! దీంతో పోషకాహారంపై వీడియోలు చేసేదాన్ని. వైవిధ్యంగా చేయాలనేది నా ఆలోచన. కానీ ఇదేమో వంటల ఛానెల్‌లా తయారైంది. అందుకే బానే నడుస్తున్నా ఆపేశా. అప్పుడే లాక్‌డౌన్‌లో సడలింపులొచ్చాయి. మాకు దగ్గర్లోనే పర్యటనకు వెళ్లాం. దాని వీడియో పెట్టా. వీక్షణలు తక్కువే. ఎలా విజయవంతం చేయాలా అని అధ్యయనం చేశా. రెండంశాలు తట్టాయి. ఆఫ్రికన్ల గురించి తెలియని నిజాలు, వాళ్ల సంస్కృతి, జీవన విధానాలను పరిచయం చేయాలనుకున్నా. రెండోది.. వీడియోల్లో కనపడే దాన్ని కాదు. ఇలాగైతే నేను చెబుతున్నది నిజమేనని వీక్షకుల్ని ఒప్పించలేను కదా! కాబట్టి వీటిపై దృష్టిపెట్టాలనుకున్నా. ఇక్కడ ఓ సమస్య.. నేను పెరిగింది పల్లెలోనే. బిడియం, మొహమాటం... ఏమనుకుంటారోనన్న సంకోచం. ఇంట్లో వాళ్లతో మాట్లాడితే భయపడొద్దని అన్నయ్య ప్రోత్సహించాడు. అప్పట్నుంచి వీడియోల్లో నేనూ కనిపిస్తూ, విశేషాలను పరిచయం చేస్తున్నా. ఛానెల్‌నూ ‘నీలూస్‌ వ్లాగ్స్‌ ఫ్రమ్‌ ఆఫ్రికా’గా మార్చా. నా పదేళ్ల కూతురు మోక్షజ్ఞ కూడా వీడియోల్లో కనిపిస్తుంటుంది.

నిజాల్నే చూపిస్తా... నెమ్మదిగా వీక్షణలు, అనుసరించే వారి సంఖ్య పెరిగింది. మేం ఉండేది టాంజానియా. గతంలో ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాం. పదేళ్లకుపైగా ఇక్కడ ఉండటంతో స్థానిక భాష ‘స్వహిలీ’ వచ్చేసింది. ఎవరికైనా వాళ్ల భాషలో మాట్లాడితే సంతోషమే కదా. అలా ఇక్కడి వాళ్లూ ఆప్యాయంగా ఉంటారు. ఇళ్ల కంటే మొక్కలే ఎక్కువ ఉంటాయి. అందుకే చల్లగా, హాయిగా ఉంటుంది. కాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహారం ఉండవు. అమ్మాయిలను ఏడిపించడం అరుదు, నేరాల శాతమూ తక్కువే. 16 ఏళ్లకే ఆడ, మగ తేడా లేకుండా స్వతంత్ర జీవనం ప్రారంభిస్తారు. హడ్జాబే, మసాయి వంటి తెగలనూ కలిశా. వాళ్లదింకా ఆదిమ కాలపు జీవనశైలే. వేట, చెట్ల వేళ్లు వంటివే ఆహారం, జంతువుల చర్మాలే దుస్తులు. వీళ్లని చూస్తే చిన్న చిన్న ఆనందాలు, సింపుల్‌గా జీవించడం వంటివి నేర్చుకోవచ్చు. నిజాల్ని చూపించడంపైనే నా దృష్టి. అందుకే నా వీడియోలను 79 లక్షల మంది చూశారనుకుంటా. మంచి ఆదాయమూ వస్తోంది. ఈ రెండేళ్లలో 197 వీడియోలు చేశా. చిత్రీకరణ, ఎడిటింగ్‌ అన్నీ నేనే చూసుకుంటా. 69 వేల మంది అనుసరిస్తున్నారు. ఆఫ్రికా కుటుంబాలతో ఒక రోజు గడిపినవీ, స్ట్రీట్‌ ఫుడ్‌, డాడాల దినచర్య, పెళ్లి వీడియోలను లక్షల్లో వీక్షించారు. నాకిదో వ్యాపకం మాత్రమే. మొదటి ప్రాధాన్యం కుటుంబమే. తోటి మహిళలకు... మీరనుకున్నది జరగనప్పుడు నిరుత్సాహపడకండి. దాన్ని నెరవేర్చుకునే మార్గాల్ని అన్వేషించండి. బెరుకుదనాన్ని, సంకోచాలను వదిలిపెట్టి ధైర్యంగా ముందడుగు వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్