ఈ పొడులకు లక్షల్లో ఆదాయం...

బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ.. ఆరోగ్యాన్ని పెంపొందించే ఉత్పత్తుల తయారీ ప్రారంభించారామె. పోషకవిలువలు పుష్కలంగా ఉండే మునగాకు, కరివేపాకు చిరుధాన్యాలు, పనసపండు, అరటికాయలతో పొడులను

Updated : 21 Apr 2022 06:02 IST

బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ.. ఆరోగ్యాన్ని పెంపొందించే ఉత్పత్తుల తయారీ ప్రారంభించారామె. పోషకవిలువలు పుష్కలంగా ఉండే మునగాకు, కరివేపాకు చిరుధాన్యాలు, పనసపండు, అరటికాయలతో పొడులను తయారుచేసి దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు. తన ఆసక్తికి, మహిళలు- రైతులకూ ఉపాధినీ అనుసంధానించిన... 52 ఏళ్ల అంబిక విజయగాథ ఇదీ...

అంబిక ఓ బ్యాంకులో 17 ఏళ్లు విధులు నిర్వహించారు. ఆ బాధ్యతల్లో భాగంగా స్వయం సహాయక బృందాలతో కలసి పని చేసేవారు. కేరళ, త్రిశూరులో చాలామంది గృహిణుల ఆలోచనలు, స్వయం ఉపాధి కోసం వారి ప్రయత్నాలను దగ్గర్నుంచి పరిశీలించేవారు. ఉపాధి లేక, ఉన్నా సరైన ఆదాయం లేక ఇబ్బందులు పడటం గుర్తించారు. అప్పుడే అంబికకు తనూ ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. లాభం కోసమే కాకుండా మహిళలకు, రైతులకూ సహాయ పడాలనుకున్నారు. అదే ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది... 2018లో ‘కారియట్‌ డ్రై ఫుడ్స్‌’ ప్రారంభించేలా చేసింది.

పుట్టుపొడితో...
మొదట కరివేపాకు పొడి తయారీని ఏడుగురు మహిళలతో కలిసి ప్రారంభించారు అంబిక. ‘అరటి చిప్స్‌ను కూడా విక్రయించేవాళ్లం. ఒకసారి అరటి ముక్కలు భారీగా మిగిలిపోయాయి. వాటిని వృథా చేయడం ఇష్టం లేక, పొడిగా చేశాం. దీనికి బియ్యప్పిండిని కలిపి పుట్టుపొడిగా మార్చాం. దీనికి బాగా గిరాకీ వచ్చింది. దాంతో క్యారెట్‌, బీట్‌రూట్‌, పనస, పనస గింజలు, రాగి, మొక్కజొన్న, పెసలు, వేరుశనగ, నవరా బియ్యం ఇలా మొత్తం పది రకాల పుట్టు పొడుల తయారీ మొదలుపెట్టాం. ఇవీ అందరికీ నచ్చాయి. కాంబో ప్యాక్‌గా చేయడంతో విక్రయాలు పెరిగాయి. న్యూట్రీ, మొరింగా, చాకో మిల్లెట్‌గా చిరుధాన్యాల పొడి కూడా విపరీతంగా మార్కెట్‌ అయ్యింది. ఆ తర్వాత మునగాకులతో పొడి, రైస్‌ ఫ్లోర్‌, సూప్‌ మిక్స్‌ రూపొందించాం. వీటికి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం సంతోషాన్ని కలిగించింది. మొదటిసారి టన్ను మునగాకు పొడిని ఎగుమతి చేశాం. ఆ తర్వాత మిగతావాటికీ ఆర్డర్లు వస్తున్నాయి. నాణ్యతకు పెద్దపీట వేయడమే మా విజయ రహస్యం’ అంటారు అంబిక.

రైతుల కోసం...
విక్రయాలు పెరుగుతుండటంతో రైతుల గురించి ఆలోచించారు అంబిక. మునగ మొక్కలను రైతులకు పంపిణీ చేయాలనుకున్నారు. ఇందులో ప్రభుత్వ సాయాన్నీ అందుకున్నారు. అలా 10,000 మొక్కలను తాను నివసిస్తున్న ఒల్లూరు పంచాయతీ అంతా పంపిణీ చేశారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ సాయంతో వారికి శిక్షణ కూడా ఇప్పించారు. వారు పెంచిన తర్వాతఆ మునగాకును అంబిక కొనుగోలు చేస్తున్నారు. ఈ ఉత్పత్తుల తయారీ, విక్రయాల్లో త్రిశూరు కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ కుటుంబశ్రీకి చెందిన మహిళలు రెండు వందలమందికిపైగా ఉపాధి కల్పిస్తున్నారు. దిల్లీ, సూరత్‌, భువనేశ్వర్‌ వంటి రాష్ట్రేతరప్రాంతాల్లోనూ ‘కారియట్‌ డ్రై ఫుడ్స్‌’ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించి మరీ వీటితో అందే పోషక విలువలపై అవగాహన కలిగిస్తున్నారు అంబిక. కొవిడ్‌కు ముందు నెలకు రూ.లక్ష ఆదాయం ఉండే ఈ సంస్థ ఆ తర్వాత రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం కారం, మిరియాలు, ధనియాలు, పసుపు, ఎండిన అల్లం పొడులు సహా 30కిపైగా రూపొందుతున్న ఈ ఉత్పత్తుల తయారీలో 30మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్