Updated : 01/12/2021 04:31 IST

చర్మ సంరక్షణ.. మర్మమిదీ!

ఓవైపు చలికాలం.. మరోవైపు వేడుకలు.. మరీ.. మెరిసిపోవాలిగా! మేకప్‌ మాత్రమే సరిపోదు. లోపల్నుంచీ నిగారింపు తోడైతేనే అసలు అందం. అదీ ఒక్కరోజు తీసుకునే శ్రద్ధతో దక్కదు. రోజువారీ సంసిద్ధత కావాలి. ఇవిగో.. నిపుణుల సలహాలు.. చదివేయండి.

చర్మ ఆరోగ్యానికి నిత్య పోషణ తప్పనిసరి. కాబట్టి.. స్కిన్‌ కేర్‌ రొటీన్‌గా వ్యవహరించే దీన్ని రెండు విధాలుగా విభజించుకోవాలి.

రోజువారీలో..

* క్లెన్సర్‌: సబ్బు కన్నా ఇదే మేలు. పీహెచ్‌ 5 - 5.5 మధ్య ఉన్న వాటితో రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు.

* టోనర్‌: చర్మానికి తేమనిస్తుంది. మృతకణాలను తొలగించి, చర్మాన్ని మెరిపిస్తూనే ఆపై రాసే ఉత్పత్తులు చొచ్చుకు పోయేలా చేస్తుంది. ఆస్ట్రింజెంట్స్‌, ఆల్కహాల్‌ లేని, గ్లిజరిన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్‌ ఉన్నవి వాడాలి.

* మాయిశ్చరైజర్‌: చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాలి.

ఆయిలీ స్కిన్‌, యాక్నే ఉన్నవారు: నియాసినమైడ్‌, సాల్సిలిక్‌ ఆసిడ్‌, మాండోలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ సి, టీట్రీ ఆయిల్‌, రెటినాల్‌ ఉన్నవీ;

పొడి చర్మానికి.. అలిగో పెప్టైడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, హైలినాయిక్‌ ఆసిడ్‌, బీ5, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, ప్లాంట్‌ బటర్‌ ఉన్నవీ;

నార్మల్‌, కాంబినేషన్‌ స్కిన్‌ వాళ్లు... హైలినాయిక్‌ ఆసిడ్‌, గ్లైకాలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ సి, అలోవీరా ఉన్నవి వాడాలి.

* సన్‌స్క్రీన్‌: ఆయిలీ స్కిన్‌కి మాటే, జెల్‌ ఆధారితమైనవీ, డ్రై స్కిన్‌కి క్రీమ్‌ బేస్‌డ్‌వీ, కనీసం ఎస్‌పీఎఫ్‌ 30 ఉన్నవి వాడాలి. బయటకు వెళ్తే ప్రతి 2 గంటలకు సన్‌స్క్రీన్‌ రాయాలి.

ఇలా వరుస క్రమంలోనే రాయాలి. ఆపైనే మేకప్‌ ఉపయోగించాలి. ఇక రాత్రిపూట క్లెన్సర్‌తో ముఖాన్ని కడిగాక టోనర్‌, ఆపై మాయిశ్చరైజర్‌ రాస్తే సరిపోతుంది.


సహజ పదార్థాలతో... రెండు చుక్కల నిమ్మరసానికి స్పూన్‌ చొప్పున తేనె, మిల్క్‌ పౌడర్‌, తగినన్ని పాలు కలిపి ముఖానికి మృదువుగా రుద్దుకోవాలి. ఆరాక కడిగేయాలి. క్లెన్సర్‌, స్క్రబ్‌ రెండు విధాలుగా పనిచేస్తుంది. నిమ్మరసం యాక్నే, మచ్చలను తొలగిస్తూనే నింగారింపునిస్తుంది. పాలు క్లెన్సర్‌, మాయిశ్చరైజర్‌గా పనిచేస్తే తేనె తేమనందిస్తుంది. టోనర్‌గా రోజ్‌వాటర్‌ను వాడొచ్చు. ఆపై రెండు చుక్కల అలోవెరా జెల్‌ కానీ, కొబ్బరినూనె రాస్తే సరి. వీటికి బదులుగా మాయిశ్చరైజర్‌ అయినా వాడొచ్చు. సన్‌స్క్రీన్‌ మాత్రం తప్పనిసరి. ఇలా రోజూ చెయ్యచ్చు. రాత్రిపూట ముఖం కడిగి, కొబ్బరినూనె రాస్తే చాలు. మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.


వారానికోసారి..

క్లెన్సింగ్‌ చేశాక.. ఎక్స్‌ఫోలేషన్‌/ స్క్రబింగ్‌ చేయాలి. రోజూ చేస్తే చర్మం సున్నితంగా మారి, యాక్నేకీ దారితీస్తుంది. వారానికోసారి చేస్తే చాలు. మృతకణాలే కాదు చాలావరకూ బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌ కూడా పోతాయి. ఆపై 20 నిమిషాలు హైడ్రేటింగ్‌ మాస్క్‌లు వేసుకోవాలి. నెలకోసారి డెర్మటాలజిస్ట్‌ వద్ద మైక్రోడెర్మాబ్రేషన్‌, రెటినాయిక్‌ ఆసిడ్‌, గ్లైకాలిక్‌ ఆసిడ్‌, మాండాలిక్‌ ఆసిడ్‌, లేజర్‌ పీల్‌ వంటివి చేయించుకోవచ్చు. లేదా.. 3 స్పూన్ల నారింజ గుజ్జుకు, స్పూను చొప్పున పెరుగు, తేనె కలిపి కానీ; కీరదోస, పాలను సమపాళ్లలో తీసుకుని, టేబుల్‌ స్పూను చొప్పున తేనె, బ్రౌన్‌ షుగర్‌ చేర్చి కానీ; సగం ఆపిల్‌కి 7 ద్రాక్ష చేర్చి మెత్తగా చేసుకునిగానీ; రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జుకు, స్పూను తేనె కలిపి కానీ ముఖానికి రాసి, అరగంట తర్వాత కడిగేయాలి. మొదట్నుంచీ సహజ విధానాన్ని పాటిస్తుంటే స్క్రబ్‌ అవసరం లేదు. రోజువారీ ప్రక్రియ తర్వాత ఏదోక ఫ్రూట్‌ మాస్క్‌ వేసుకుంటే చాలు.

వీటితోపాటు ఇ, సి, బి వంటి ఎసెన్షియల్‌ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. ఇవి స్కిన్‌ డ్యామేజ్‌, ఫ్రీరాడికల్స్‌ నుంచి కాపాడతాయి. సిట్రస్‌ ఫలాలు, బీట్‌రూట్‌, ఆపిల్‌, అవకాడో, బెర్రీస్‌, ఆకుకూరలు, బీన్స్‌, తాజా పండ్లు, కూరగాయలు, హోల్‌ గ్రెయిన్స్‌, లీన్‌ ప్రొటీన్‌లను తప్పక తీసుకోవాలి. రోజుకు మూడు లీటర్ల నీటిని తాగాలి. ఎక్సర్‌సైజ్‌, మెడిటేషన్‌తోపాటు కనీసం 8 గంటల నిద్రా ఉండేలా చూసుకోవాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని