Updated : 26/01/2022 05:27 IST

ఫలితం కావాలా.. ఎంపిక మారాలి

ఈకాలం ఎంత మాయిశ్చరైజర్‌ రాసినా.. చాలామందిలో ముఖం కడిగేయగానే చర్మంపై తెల్లగా కనిపిస్తూనే ఉంటుంది. అంటే.. దానికి తగినంత పోషణ అందట్లేదనే. మరేం చేయాలి?

చాలామందికి క్రీమ్‌ల ఎంపిక ఒకరి సలహాపైనే ఆధారపడి ఉంటుంది. ఇంకొందరికి ఒక క్రీమ్‌ పడుతోందంటే.. కాలమేదైనా దాన్నే కొనసాగించే అలవాటు ఉంటుంది. అది అంత మంచి ఆలోచన కాదు. చర్మ తీరు, అవసరాలనూ గమనించాలి.

చలికాలంలో.. సాధారణ చర్మం వారు లోషన్లకు బదులుగా క్రీమ్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది జిడ్డుగా కనిపించకుండానే తగినంత తేమను చర్మానికి అందిస్తుంది. రాత్రిళ్లు వృద్ధాప్య ఛాయలను దూరంగా ఉంచే రెటినాల్‌ గుణాలున్న క్రీమ్‌లను పూయాలి.

పొడిచర్మం వారికి చలికి అదనపు తేమ అవసరమవుతుంది. వీరికి నూనె ఆధారితమైన మాయిశ్చరైజర్‌లు మంచి ఎంపిక. షియాబటర్‌, పొద్దుతిరుగుడు, రోజ్‌హిప్‌ నూనెలున్నవాటిని ఎంచుకోవాలి. హ్యాలురోనిక్‌ ఆసిడ్‌ అధిక మోతాదులో ఉన్నవాటిని రాత్రి సమయంలో రాస్తే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. నిద్రించేముందు కొబ్బరి నూనెను రాసి 20 నిమిషాల తర్వాత కడిగేసినా ఫలితముంటుంది. జిడ్డు చర్మం వారికి నీటి ఆధారిత క్రీమ్‌లు సరైనవి. వీరిలో మొటిమల సమస్యలెక్కువ. కాబట్టి, పెట్రోలియం జెల్లీ వాటికి దూరంగా ఉండాలి. బదులుగా హ్యాలురోనిక్‌ ఆసిడ్‌, జింక్‌ ఆక్సైడ్‌, అలోవెరా గుణాలున్నవి ఎంచుకుంటే మంచిది. వీటితోపాటు వారానికి రెండుసార్లు ఫేస్‌ మాస్క్‌నూ ప్రయత్నిస్తే మంచింది.

* టేబుల్‌ స్పూను చొప్పున పాలపొడి, బాదం నూనె తీసుకుని దానికి అరచెంచా తేనె కలపాలి. అవసరమైతే తగినన్ని నీటిని కలిపి, మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాలకు కడిగేస్తే చాలు.


Advertisement

మరిన్ని