Updated : 06/02/2022 05:17 IST

గడువు దాటిందేమో చూశారా?

ఎన్ని పనులున్నా... ఎంత పొద్దుపోయినా రాత్రి నిద్రపోయే ముందు మేకప్‌ తప్పకుండా తీసేసి ముఖాన్ని శుభ్రం చేసుకుంటాం. లేదంటే రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. అంటే అలంకరణ గడువు కొన్ని గంటలే అన్నమాట... మరి అందుకు వాడే సాధనాల సంగతేంటి?

ఐలైనర్‌, మస్కారా... చారేడేసి కళ్లను కలువ రేకల్లా కనిపించేలా చేసే ఐలైనర్‌ను ఆరు నెలల నుంచి ఏడాదిలోనే మొత్తం వాడేయండి. కంటిరెప్పలను ఒత్తుగా చేసే మస్కారా గడువూ 3 నెలలే.  

లిప్‌స్టిక్‌... దొండపండు లాంటి అధరాలకు వర్ణాలను అద్దే లిప్‌స్టిక్‌ను రెండేళ్లకు మించి వాడొద్దు. అయితే ఈ సమయం కంటే ముందే రంగు మారినా, వాసన వస్తున్నా పారేయాల్సిందే.

గోళ్లరంగు... మోమే కాదు... నఖాలూ అందంగా, ఆకర్షణీయంగా మెరిపిస్తాం. అయితే వీటికి వేసుకునే నెయిల్‌పాలిష్‌ను రెండేళ్లలోనే వాడేయాలట.

క్లెన్సర్‌, మాయిశ్చరైజర్‌... ముఖాన్ని శుభ్రం చేసి, తేమను అందించే వీటికి కూడా ఉండే జీవిత కాలం ఏడాదే.

పర్‌ఫ్యూమ్స్‌... వీటి గడువు కాస్త ఎక్కువే. దాదాపు రెండు నుంచి పదేళ్ల లోపు ఉంటుంది. అయితే ఉత్పత్తి పైన ఉన్న తేదీని చూడటం మరవొద్దు.

పౌడర్‌లు, బ్లషర్‌లకు రెండేళ్లు. ఫౌండేషన్‌ను 6- 12 నెలల్లోపు, ఐ షాడోను ఆరు నుంచి రెండేళ్లలోపు, లిప్‌ గ్లాస్‌, కన్సీలర్‌లను ఏడాది మించి వాడొద్దు. ఎంత ఖరీదు పెట్టి కొన్నా.. ఎంత నాణ్యమైనవైనా పక్కన పెట్టేయాలి. వీటికోసం వాడే బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలాగే సౌందర్య ఉత్పత్తులను ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే చోట పెట్టకూడదు. చివరగా మీ మేకప్‌ కిట్‌ను ఇతరులతో పంచుకోవద్దు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని