Updated : 13/02/2022 04:51 IST

పాలతో మృదువైన పాదాలు...

సీజన్‌ మారినప్పుడల్లా పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతుంది రాధిక. కొన్ని సందర్భాల్లో చెప్పులు కూడా వేసుకోలేదు. ఎన్ని క్రీంలు రాసినా పాదాల పైచర్మం పేలవంగానే కనిపిస్తోంది. ఇటువంటి సమస్యలకు పాలతో చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.

వెడల్పైన ప్లాస్టిక్‌ టబ్‌ను గోరువెచ్చని నీళ్లతో నింపాలి. ఇందులో రెండు చెంచాల చొప్పున ఉప్పు, వంట సోడా వేసి బాగా కలిపి పాదాలను మునిగేలా ఉంచాలి. పావుగంట తర్వాత మెత్తని వస్త్రంతో శుభ్రంగా పాదాలను తుడిచి, వాటి అడుగుభాగం, పైభాగాలను ఆకురాయితో మృదువుగా పది నిమిషాలు రుద్దాలి. ఇలా చేస్తే పాదాలపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. పగుళ్లలో చేరిన మురికీ పోతుంది. తర్వాత నాలుగుచెంచాల చొప్పున కొబ్బరినూనె, ఓట్స్‌, చక్కెరను గిన్నెలోకి తీసుకొని అందులో సమానపాళ్లలో పాలు పోయాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని  పాదాలకు రెండువైపులా పట్టించి రెండు చేతులతోనూ పదినిమిషాలు మర్దన చేయాలి. గోరువెచ్చని నీటితో కడిగి తడి లేకుండా ఆరనిచ్చి కొబ్బరినూనె లేదా మాయిశ్చరైజర్‌ను రాస్తే చాలు. ఇలా వారానికి 2, 3 సార్లు చేస్తే పాదాల్లో మురికి, మృత కణాలు దూరమవుతాయి. పగుళ్లు తగ్గుముఖం పడతాయి. అలాగే పచ్చిపాలను వినియోగిస్తే మరీ మంచిది. ఇందులోని ఏ,డీ,ఈ,కె విటమిన్లు సహా ప్రొటీన్లు చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది క్లెన్సర్‌గా పనిచేయడంతో పాదంపై నిర్జీవంగా మారిన చర్మం మెరుపులీనుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని