రాసే ముందు చూస్తున్నారా?
close
Published : 23/02/2022 00:35 IST

రాసే ముందు చూస్తున్నారా?

క్రీముల విషయంలో ఒకే సారి కొనేస్తాం.. కొత్తవీ ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే తీసుకునే ముందే కొన్ని విషయాలను చూసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే ముప్పు తప్పదంటున్నారు.

సౌందర్య సాధనాలన్నింటిలోనూ రసాయనాలు సాధారణమే. అయితే వాటి శాతంపై మాత్రం అవగాహన ఉండాలి. కవర్‌పై వివరాలు, గడువు తేదీలను గమనించండి. ఆ తర్వాతే కొనాలో వద్దో నిర్ణయించుకోండి. అలాగే ముఖానికీ, ఒంటికీ ఒకే సబ్బు, బాడీ లోషన్లనూ వాడొద్దట. ముఖంపై చర్మానికీ, మిగతా దానికీ కూడా తేడా ఉంటుంది. ముఖ చర్మాన్ని రసాయనాలకు దూరంగా ఉంచితే మంచిది. సెనగ లేదా పెసరపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తేమ అందడంతోపాటు ఆరోగ్యంగానూ ఉంటుంది. చర్మ సమస్యలకూ దూరంగా ఉండొచ్చు.

శుభ్రత..

నాణ్యమైన ఉత్పత్తులు వాడటమే కాదు.. వాటిని రాయడానికి ఉపయోగించే పౌడర్‌ పఫ్‌, బ్రష్‌, స్పాంజిలను ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకోవాలి. లేదంటే వాటిపై మురికితో పాటు సూక్ష్మజీవులూ చేరి ముఖానికి హాని చేస్తాయి. వీటన్నింటికి ప్రత్యేక బాక్సులు, పౌచ్‌లు లభ్యమవుతున్నాయి. శుభ్రం చేసి, ఆరాక వాటిలో పెడితే సరి. దువ్వెననూ వారానికోసారి సర్ఫ్‌, వంటసోడా కలిపిన నీళ్లలో నానబెట్టి కడగాలి.

గడువు..

మస్కారా ఖాళీ అవలేదని నెలల తరబడి వాడకూడదు. కొనేటప్పుడే చిన్నది తీసుకుంటే గడువుతేదీ అయ్యేలోపు పూర్తవుతుంది. ఎక్కువరోజులు వాడాల్సిన అవసరమూ ఉండదు. తద్వారా నేత్రసంబంధిత సమస్యలకూ దూరంగా ఉండొచ్చు. ఏ ఉత్పత్తి అయినా ఈ పద్ధతిని పాటించాలి. కనుబొమలు తీర్చిదిద్దుకునే బ్రష్‌నూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. లేదంటే దీనివల్లా అలర్జీలొస్తాయి. వీలైనంత వరకూ సహజసిద్ధమైన వాటితో చేసినవి ఎంచుకుంటే ఏ సమస్యలూ ఉండవు.


Advertisement

మరిన్ని