Published : 06/03/2022 01:06 IST

అలనాటి వస్త్రానికి ఆదరణ కల్పిస్తోంది!

వేడుక ఏదైనా అమ్మావాళ్లు ఒక రకమైన వస్త్రంతో దుస్తులు కుట్టించుకునేవారు. తనూ వాళ్లని అనుకరించి, బొమ్మలకు కుట్టేది. తన కెరియర్‌ ఎంపికా ఆమెకు అక్కడే మొదలైంది. ఆ బాల్యస్మృతులతో ముడిపడిన ఆ వస్త్రం కనుమరుగవుతోంటే తట్టుకోలేకపోయింది జాహ్నవి. నాలుగు వేల ఏళ్ల నాటిదానికి పూర్వ వైభవం తేవడమే కాదు ఆధునికతను అద్దుతూ విదేశాల్లోనూ గుర్తింపు తెస్తోంది. ఆమె ఎవరో.. ఆమెకిదెలా సాధ్యమైందో.. చదివేయండి.

న నాలుగో తరగతిలో ఉన్నప్పుడు జాహ్నవికి కుట్లపై ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలో ఆమె అమ్మ, పిన్నివాళ్లు, అత్తలు.. కున్‌ అనే ఒక రకమైన వస్త్రంతో జాకెట్లు, గాగ్రాలు కుట్టుకునేవారు. తనూ మిగిలిన చిన్న చిన్న ముక్కలతో బొమ్మలకు దుస్తులు కుట్టుకునేది. ఆ ఆసక్తే ఆమెను డిజైనింగ్‌ వైపు నడిపింది. 1999లో ముంబయిలో ఎస్‌ఎన్‌డీటీ విశ్వవిద్యాలయం నుంచి పట్టాతో పాటు బంగారు పతకాన్నీ పొందింది. తర్వాత వస్త్ర, గృహాలంకరణ సంస్థల్లో ఉద్యోగాలు చేసింది. పెళ్లి, పిల్లలతో తీరిక లేకుండా పోయింది. ఓరోజు తనకు కున్‌ గుర్తొచ్చింది. ఎంత ప్రయత్నించినా ముంబయిలో దొరకలేదు. కాటన్‌, సిల్క్‌ మేళవింపుతో ఉండే ఆ వస్త్రానికి 4 వేల ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని 8వ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో కనుక్కున్నారని చరిత్ర చెబుతోంది. అంత చరిత్ర ఉన్నా దీనికి పెద్దగా ప్రాచుర్యం లేకపోవడం ఆమెను బాధించింది. తనే రంగంలోకి దిగి ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో 2012లో ‘కాలేనాలే’ ప్రారంభించింది.

కర్ణాటకలోని ‘గులేడ్‌గుడ్డ’ అన్న పల్లెలోనే దీన్ని నేస్తారు. అక్కడికి వెళ్లేసరికి పరిస్థితి దయనీయంగా ఉంది. చాలా మంది వృత్తిని వదిలి వలస వెళ్లిపోయారు. ఉన్నవారూ వేరే పనులు చేస్తున్నారు. కొద్దో గొప్పో చేస్తున్న వాళ్లందరినీ కూడగట్టింది. వస్త్రం నేయించి మార్కెటింగ్‌ చేసేది. ఇది కాటన్‌, సిల్క్‌ల కలబోత వస్త్రం. బెంగళూరు, మహారాష్ట్రల్లో పరిచయం ఉంది. కాబట్టి, అక్కడ బాగానే అమ్ముడయ్యేది. వేరే ప్రాంతాలకొచ్చే సరికే సమస్య. దీన్ని వివిధ మోటిఫ్‌లతో తానులుగా నేసేవారు. దీంతో జాకెట్లు, లెహెంగాలకే పనికొచ్చేవి. వీటిలో చీరలనూ తేవాలనుకుంది జాహ్నవి. కానీ అక్కడివాళ్లకి దాని పరిచయమే లేదు. డిజైన్‌ సంస్థల వారితో అక్కడి వారికి శిక్షణనిప్పించి మరీ నేయించింది. 2016లో మొదటి చీర చేతికొచ్చింది.

‘సంస్థను ప్రారంభించడం కంటే.. వీరిని ఒప్పించడం పెద్ద సమస్యైంది. మొదట తెలిసిన దానిలో ఉపాధి దొరికిందని ఒప్పుకొన్నారు. కానీ దీనిలో నేతే పెద్ద చిక్కు. చిన్న పొరబాటు జరిగినా అప్పటిదాకా చేసిందంతా వృథానే. దీంతో నీరసపడిపోయారు. అయితే నేను దాంతో బ్యాగులు, గృహాలంకరణ వస్తువులు, నగలూ, డోర్‌మ్యాట్‌లు తయారు చేయించా. రకరకాల ఉత్పత్తులు ఉంటేనే కదా వినియోగదారులనీ ఆకర్షించేది! అందుకని ఇక్కడి మహిళలకు ఎన్‌జీఓలతో శిక్షణనిప్పించా. దీంతో వృథా తగ్గిపోయింది, వాళ్లకీ ఉపాధి. చీరలు నేయించేప్పుడూ ఇదే సమస్య. కానీ ఓపిగ్గా వాళ్లని నడిపించా. డిజైనింగ్‌ నిపుణులను రప్పించి శిక్షణనిప్పించా. సాధారణంగా రంగులేవైనా కున్‌కి అంచు మాత్రం ఎరుపే ఉండేది. అన్నింటికీ ఇలానే మళ్లీ వినియోగదారులతో కొనిపించడం ఇబ్బంది. దీంట్లోనూ ప్రయోగాలు చేశాం. ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర సిల్క్‌ బోర్డు కూడా వీరి పనితనాన్ని మెచ్చి అండగా నిలుస్తోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తేవడం నా కల’ అని చెబుతోంది జాహ్నవి. వీటి అమ్మకాలను ఈమె వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారానే అమ్మేది. దేశవ్యాప్తంగానే కాక.. యూకే, యూఎస్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా సహా ఎన్నో దేశాలకూ సరఫరా చేస్తోంది. గత ఏడాది నుంచే దుకాణాన్ని ఏర్పాటు చేసింది. కొవిడ్‌కు ముందే రూ. కోటి టర్నోవర్‌నూ అందుకుంది. ఇప్పుడది కనీసం కోటిన్నరకు చేరిందని అంచనా వేస్తున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని