Published : 09/04/2022 01:49 IST

ముఖానికి.. చాక్లెట్‌ మెరుపులు!

ప్రత్యేకమైన రోజులు.. సంతోషకర సందర్భాల్లో చాక్లెట్‌తో నోటిని తీపి చేసుకుంటాం. దాంతో ముఖాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలానో వివరిస్తున్నారు... ప్రయత్నిస్తారా?

జిడ్డు, మచ్చలకు దూరంగా... చెంచా కోకోవా పొడిలో పావుచెంచా మెత్తని దాల్చిన చెక్క పొడి, చెంచా తేనె వేయాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి అరగంట ఆరనిచ్చి కడిగేయాలి. ఈ లేపనంలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మంలోని సూక్ష్మజీవుల్ని తొలగిస్తాయి. మచ్చలను దూరం చేస్తాయి. జిడ్డుదనం పోయి మృదుత్వాన్నీ, మెరుపును అందిస్తాయి.

రెండు బార్స్‌ డార్క్‌ చాక్లెట్లను కాసేపు ఫ్రిజ్‌ నుంచి తీసి బయట ఉంచి కరిగేలా చేయాలి. దీనికి పావు కప్పు పాలు, చెంచా సీసాల్ట్‌, మూడు చెంచాల బ్రౌన్‌ షుగర్‌ కలిపి ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఆరనివ్వాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మానికి హానికలిగించే ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తాయి. జిడ్డును పోగొడతాయి. వారానికి రెండు సార్లు ఇలా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

పొడి చర్మానికి.. పావుకప్పు కోకోవాపొడిలో తలా రెండు చెంచాల ఫుల్లర్స్‌ ఎర్త్‌ పొడి, పెరుగు, తలా చెంచా నిమ్మరసం, కొబ్బరినూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మృదువుగా రాసి పావుగంటాగి శుభ్రం చేయాలి. నిమ్మరసం, పెరుగు చర్మ రంధ్రాలను మూసి మురికి లోపలికి పోకుండా నిరోధిస్తాయి. తేమగానూ ఉంచుతాయి. కోకోవా పొడిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

50 గ్రాముల చాక్లెట్‌ను కరిగించి అందులో మెత్తగా చేసిన అరటిపండు, కప్పు చొప్పున స్ట్రాబెర్రీ, పుచ్చకాయ గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి 20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండు సార్లు ఈ లేపనాలు వేస్తే చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తాయి. తేమగా ఉంచి మృదుత్వంతోపాటు మెరుపునూ తెచ్చిపెడతాయి. వేసవిలో ముఖచర్మానికి ఇవి మరింత ప్రయోజనాల్నిస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని