Updated : 17/06/2022 11:01 IST

మీ మేకప్‌లో ఇవి ఉన్నాయా?

వర్షాకాలం కదా... మేకప్‌ చెక్కు చెదరకూడదని కంటికి వాటర్‌ప్రూఫ్‌ మస్కారా వేస్తున్నారా? నూనె తక్కువ పడుతుంది... పాత్రలు కష్టపడి తోమే శ్రమ తప్పుతుందని నాన్‌స్టిక్‌ పాత్రల్నే వాడుతున్నారా? మరకలు పడని దుస్తులు, మిసమిసలాడే రగ్గులపై మనసు పారేసుకుంటున్నారా? ఈ అలవాట్లు మీకూ ఉంటే ఫరెవర్‌ కెమికల్స్‌ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు..

నలభై కూడా నిండకుండానే బీపీ పలకరించినప్పుడు... వంశపారంపర్యమనో, ఇంట్లో, ఆఫీసులో ఉండే ఒత్తిడే కారణమనో మనకి మనం సర్దిచెప్పుకుంటాం. కానీ.. ఇలా నడివయసులో రక్తపోటు పెరగడానికి ఒత్తిడి ఒక్కటే కాదు, ఇంటి కాలుష్య కారకాలు కూడా కారణమేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పీఎఫ్‌ఏఎస్‌ వీటినే ‘ఫరెవర్‌ కెమికల్స్‌’ అంటారు, ఇవి మగవాళ్లతో పోలిస్తే స్త్రీల ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌ చెబుతోంది. ఈ కృత్రిమ రసాయనాలు.. ఎప్పటికీ నాశనం కావు. కాబట్టే వీటికి ‘ఫరెవర్‌ కెమికల్స్‌’ అనే పేరు వచ్చింది. నాన్‌స్టిక్‌ పాత్రలు, వాటర్‌ప్రూఫ్‌ దుస్తులు, లిప్‌స్టిక్‌, మస్కారా వంటి సౌందర్య సాధనాల్లో ఈ రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. భూమిలో కలవని ఈ రసాయనాలు.. నీటిలో, గాలిలో కలిసి తద్వారా మన శరీరంలోకీ చేరుతున్నాయి. ఫలితంగా హార్మోన్లు సరిగా విడుదల కాకపోవడం, నెలసరులు గతి తప్పడంతోఆ ప్రభావం సంతానోత్పత్తిపై పడుతోంది.

వాటర్‌ప్రూఫ్‌తో భద్రం: ఎక్కువ సేపు చెదరకుండా ఉండే ఐలైనర్లు, మస్కారాలు, లిప్‌స్టిక్‌, ఫౌండేషన్‌, షాంపూల్లో ఈ తరహా రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా సౌందర్య సాధనాలని కొనేముందు లేబుల్‌పై ‘ఫ్లూరో’ అనే రసాయనం ఉందా అన్నది తప్పక చూడండి. ఉంటే మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనద్దు.

వంట పాత్రలకు ప్రత్యామ్నాయం: నాన్‌స్టిక్‌కి బదులుగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, కాస్ట్‌ ఐరన్‌, గ్లాస్‌, సెరామిక్‌ వంటివి వంటకి చక్కని ప్రత్యామ్నాయాలు. తప్పనిసరై నాన్‌స్టిక్‌ వాడితే వాటిని శుభ్రం చేసేటప్పుడు స్టీల్‌ స్క్రబ్బర్లు వాడొద్దు. అలా వాడితే చెదిరిన టెఫ్లాన్‌ కోటింగ్‌ ఆహారంలోకీ... అక్కడ నుంచి మన శరీరంలోకి చేరుతుంది. అలాగే నాన్‌స్టిక్‌ పాత్రలని అవెన్‌లో అస్సలు పెట్టొద్దు.

పిల్లల దుస్తుల్లో: పిల్లల దుస్తులు, రగ్గులు, కార్పెట్లు వంటివి కొనేముందు పీఎఫ్‌ఏఎస్‌, పీఎఫ్‌సీ రహిత అనే లేబుల్‌ ఉన్నవాటిని ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే పిల్లల దుస్తులు, రెయిన్‌కోట్లలో  ఈ రసాయనాలు అత్యధికంగా ఉంటాయి.

ఫర్నిచర్‌ కొనేముందు: సోఫాలు ఇతరత్రా ఫర్నిచర్‌ కొనేముందు టాక్సిక్‌ ఫ్రీ అనే లేబుల్‌ని పరిశీలించండి. ఎందుకంటే... వాటికి వాడే వస్త్రాలు, వార్నిష్‌ల్లోనూ ఈ రసాయనాలు ఉంటాయి.

ప్యాకేజింగ్‌తో: మనం బయట పాప్‌కార్న్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కొన్నప్పుడు ప్యాకింగ్‌ కోసం ఇచ్చే కాగితం ప్రత్యేకంగా ఉంటుంది. అదే కాదు కేకులు, చికెన్‌ బకెట్‌తో వచ్చే కాగితాల్లో ఈ రసాయనాలు అధికంగా ఉంటాయి. వీలైనంత వరకూ ప్యాకేజింగ్‌ ఫుడ్‌కి దూరంగా ఉండండి. అందుకే ఇంట్లో చేసుకున్నంత ఉత్తమం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని