Updated : 13/07/2022 04:19 IST

పచ్చబొట్టుకు కొన్ని జాగ్రత్తలు

తారల్ని చూసో, ఫ్యాషన్‌లో భాగమనో పచ్చబొట్టుపై మనసు పారేసుకుంటున్న అమ్మాయిలెందరో. మీరూ వేయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోండి.

* శుభ్రత.. టాటూలో ఇంక్‌ని శరీరంలోకి చొప్పిస్తారు. కాబట్టి, ఆ ప్రదేశం శుభ్రంగా లేకపోతే అలర్జీలకు దారి తీయొచ్చు. వెళ్లే ముందు శుభ్రం చేసుకొని, ఆపై మాయిశ్చరైజర్‌ రాయడం మర్చిపో వద్దు. ఆ ప్రదేశంలో వెంట్రుకలు ఉంటే వాటినీ తొలగించుకోవాలి.

* వదులు వస్త్రాలు.. పచ్చ బొట్టు పొడిపించుకోవడం నొప్పని తెలుసుగా! వేయించుకునే ప్రదేశాన్ని బట్టి నొప్పి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఇంకా.. నొప్పి పుడుతోంటే తెలియకుండానే శరీరాన్ని బిగబడతాం. ఆ సమయంలో బిగుతైన వస్త్రాలు మరింత నొప్పికి కారణమవుతాయి. కాబట్టి వదులైన దుస్తులను వేసుకోవడం మంచిది.

* సలహా తీసుకున్నాకే.. ట్రెండ్‌ అనీ, అందంగా ఉంటుందనీ ఎక్కడ వేయించుకోవాలో ఎంచుకున్నారు. అది సరైనదేనా అని నిపుణుల సలహా కోరండి. కొన్ని ప్రదేశాలు సున్నితంగా ఉంటాయి. నొప్పి, వాపు వంటివి త్వరగా నయమవవు. ఆక్సెసరీస్‌ పెట్టుకుంటే సరిపోయే వేళ్లు, మెడ వంటి వాటిని ఎంచుకోకపోవడమే మంచిది. ఇక రాపిడి ఉండే ప్రదేశాలైతే పదే పదే టచప్‌ చేయించుకోవాల్సి రావొచ్చు. నొప్పి, ఖర్చు అదనం.

* తిన్నాకే.. పొట్టగా నిండుగా ఉండేలా చూసుకోండి. ‘ఆ చిన్నదేలే.. ఫర్లేదు’ అనుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రక్రియలో రక్తంలో చక్కెర శాతాలు పడిపోయే ప్రమాదమెక్కువ. అసలే డైట్‌ అనీ, బరువు పెరగొద్దనీ తక్కువ తింటుంటాం. కళ్లు తిరిగి పడి పోయే ప్రమాదమెక్కువ. కాబట్టి కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తిని వెళ్లడం తప్పనిసరి.

* ఆ తర్వాత.. పచ్చబొట్టు వేయించుకున్నాకా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ముందుగానే తెలుసుకోండి. లేదంటే నొప్పి తగ్గకపోవడం, ఇంక్‌ పోవడం వంటివి జరుగుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని