మేకప్‌ లేకుండానే మెరుపు..

పార్టీ లేదా శుభకార్యాలకెళ్లడానికి అప్పటికప్పుడు ముఖాన్ని ఆకర్షణీయంగా మార్చేయడానికి మేకప్‌ తప్పదనుకుంటాం. అయితే సహజసిద్ధంగానే క్షణాల్లో ముఖ చర్మాన్ని మెరిసేలా చేయొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

Updated : 30 Aug 2022 00:32 IST

పార్టీ లేదా శుభకార్యాలకెళ్లడానికి అప్పటికప్పుడు ముఖాన్ని ఆకర్షణీయంగా మార్చేయడానికి మేకప్‌ తప్పదనుకుంటాం. అయితే సహజసిద్ధంగానే క్షణాల్లో ముఖ చర్మాన్ని మెరిసేలా చేయొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

ముందుగా ముఖాన్ని సీరంతో తేమగా మార్చాలి. ఒక గిన్నెలో రెండు చెంచాల చొప్పున గ్లిసరిన్‌, బంతిపూల టీ, అయిదు చుక్కల లావెండర్‌ ఎస్సెన్షియల్‌ నూనె వేసి బాగా కలపాలి. ఈ సీరంను ఒక ప్లేటు మధ్యలో ఉంచిన కంప్రెస్డ్‌ కాటన్‌ షీట్‌ మాస్క్‌పై పోయాలి. బాగా తడిసిన కాటన్‌షీట్‌ మాస్క్‌ను ముఖానికి వేసి 20 నిమిషాలుంచాలి. ఇందులోని గ్లిసరిన్‌ చర్మానికి హైడ్రేటింగ్‌ ఏజంట్‌గా పనిచేస్తే, బంతిపూల టీ మృదుత్వాన్ని అందిస్తుంది. ఈ మాస్క్‌తో ముఖచర్మం మాయిశ్చరైజ్‌ అవుతుంది.

హెర్బల్‌ స్టీం..

సహజసిద్ధమైన నూనె, గ్లిసరిన్‌తో తయారైన ఫేస్‌వాష్‌ లేదా క్లెన్సర్‌తో ముఖాన్ని ముందుగా శుభ్రం చేయాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. ఆ తర్వాత చర్మరంధ్రాల్లో పేరుకొన్న మురికి, అదనపు నూనె బయటకు పోవడానికి ఓ గిన్నెను ఆరేడుగ్లాసుల మరిగిన నీటితో నింపి అందులో గుప్పెడు గులాబీరేకులు, పల్చని చక్రాలుగా కోసిన నిమ్మకాయ ముక్కలను వేసి పది నిమిషాలు ఆవిరిపట్టాలి. ఈ హెర్బల్‌ స్టీం ముఖచర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నిమ్మ, గులాబీరేకుల నుంచి వచ్చిన ఆవిరి చర్మానికి మెరుపును అందిస్తుంది.

ఎంజైమ్స్‌తో..

రెండు చెంచాల బొప్పాయి లేదా అనాసపండు గుజ్జుకు చెంచా క్రీమ్‌గా మార్చిన పెరుగు, రెండు చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి లేపనంలా రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి చన్నీటితో కడిగితే చాలు. ఈ పండ్లలో పుష్కలంగా ఉండే ఎంజైమ్స్‌ చర్మంలోని మృతకణాలను బయటకు పంపి, శుభ్రపరిచి ఆరోగ్యంగా మారుస్తాయి. తేనె, పెరుగు ముఖానికి మృదుత్వంతోపాటు చర్మానికి సహజమెరుపు అందిస్తాయి.


ఐస్‌తో..

ఫౌండేషన్‌ వంటి క్రీంలు అవసరం లేకుండానే ఐస్‌తో చర్మాన్ని బిగుతుగా అయ్యేలా చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో రెండు చెంచాల కలబంద గుజ్జు, నాలుగైదు చెంచాల రోజ్‌వాటర్‌, గుప్పెడు ఎండిన గులాబీరేకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న కప్స్‌లో నింపి డీప్‌ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా తయారైన ఐస్‌ముక్కలతో కంటి కింద, నుదురు, చెక్కిళ్లపై మృదువుగా రుద్దాలి. ముఖమంతా అయిదు నిమిషాలు ఐస్‌ మసాజ్‌ చేయాలి. దీంతో రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మెరుపులీనుతుంది. కలబంద గుజ్జు చర్మాన్ని తేమగా మారిస్తే, గులాబీనీరు ముఖానికి మృదుత్వాన్నిస్తుంది. ఈ మసాజ్‌తో గీతలు, ముడతలు దూరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని