Published : 26/09/2022 00:23 IST

ఒత్తయిన కనుబొమలు కావాలా?

గతంలోలా సన్నగా విల్లులా ఉండే కనుబొమల ఫ్యాషన్‌ మారిపోయింది. ఒత్తుగా కనిపించడమే ట్రెండ్‌. కానీ కొందరిలో ఇవి చాలా పలుచగా ఉంటాయి. సహజంగా పెంచేసుకోవడమెలా అని ఆలోచిస్తున్నారా? చిట్కాలివిగో!

* కేశాల పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆముదం ఎప్పుడూ ముందే. ఇది కనుబొమలకీ వర్తిస్తుంది. కొన్ని చుక్కల ఆముదాన్ని కనుబొమల ప్రాంతంలో రాసి, మర్దనా చేయండి. రాత్రంతా ఉంచుకోవచ్చు. జిడ్డు అనిపిస్తే అరగంట తర్వాత కడిగేసుకున్నా సరిపోతుంది. ప్రతి రెండు రోజులకోసారి రాసుకోవచ్చు.

* స్పూను తాజా ఉల్లిరసానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. దూదితో కనుబొమల ప్రాంతంలో రాసి, ఆరనివ్వాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరి. కొంచెం ఘాటు ఉంటుంది. జాగ్రత్తగా రాసుకోవాలి. ప్రతి రెండు రోజులకోసారి ప్రయత్నించండి.

* కోడిగుడ్డులోని పసుపు సొనా కనుబొమల వెంట్రుకల పెరుగుదలలో సాయపడుతుంది. పసుపు సొనకు కొన్నిచుక్కల నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. దాన్ని కనుబొమలకు రాసి 20 నిమిషాలు ఆరనిస్తే సరి. వారానికి రెండుసార్లు రాస్తే సరిపోతుంది.

* అలోవెరా చెక్కు తీసి నేరుగా కనుబొమలను రుద్ది, ఆరనిచ్చి కడిగినా ఫలితం ఉంటుంది. చలికాలంలో చర్మం పగలకుండా పెట్రోలిజం జెల్లీ రాస్తుంటాం కదా! అదీ కనుబొమల పెరుగుదలకు సాయపడుతుంది. వేలితో కొద్దిగా తీసుకొని కనుబొమలకు రోజూ రాత్రి పడుకోబోయే ముందు రాస్తుండండి. అక్కడి చర్మం తేమగా మారడమే కాదు.. వెంట్రుకలు వేగంగా పెరగడానికీ సాయపడుతుందట. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగితే సరి. దీన్ని రోజూ ప్రయత్నించవచ్చు. అయితే యాక్నే ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మేలు.

* పాలల్లో ముంచిన దూదితో కనుబొమలపై అద్దండి. 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయండి. పాలకి తేనెను చేర్చినా మంచి ఫలితం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని