Updated : 30/09/2022 02:49 IST

పొడి చర్మమా... డీహైడ్రేషనేమో!

నిర్జీవంగా తయారవడం, చిన్న చిన్న పొక్కులు, ఎరుపెక్కడం, చర్మ ఛాయలో తేడాలు.... పొడిచర్మంతో ఎన్ని ఇబ్బందులో! దీనికితోడు ముందే వృద్ధాప్య చిహ్నాలు. కళ్లపక్కన, నుదిటి మీదా గీతలు. చర్మతత్వమే అంత అనుకుంటాం కానీ.. శరీరానికి తగినంత నీరు అందకపోయినా ఈ సమస్య ఎదురవుతుందట. దీన్నుంచి తప్పించు కోవాలంటే..

* సబ్బును వదిలి తక్కువ గాఢత గల క్లెన్సర్‌కి మారండి. వాటిలోనూ కృత్రిమ సువాసనలు ఉండకూడదు. కాలమేదైనా గోరు వెచ్చని నీటినే ముఖం కడగడానికీ, స్నానానికీ ఉపయోగించాలి. నీటి ఆధారిత టోనర్‌ని స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. ఇది చర్మంలో పీహెచ్‌ స్థాయుల్ని సమన్వయం చేసి, తిరిగి కోలుకునేలా చేస్తుంది.
* ఉదయం, సాయంత్రం ముఖం శుభ్రం చేసిన ప్రతిసారీ తేమనందించే సీరమ్‌ను తప్పక రాయాలి. హాలురోనిక్‌ యాసిడ్‌, గ్లిజరిన్‌ ఉన్నవి పొడిచర్మం ఉన్నవారికి ఉత్తమ ఎంపిక. ఆపై మాయిశ్చరైజర్‌ రాస్తే.. ముఖానికి తేమ అంది సహజంగా మెరుస్తుంది. దీనిలోనూ సెరామైడ్స్‌, అలోవెరా వంటివి ఉన్నవి ఎంచుకుంటే ఇన్‌ఫ్లమేషన్‌ నుంచీ కాపాడతాయి.

* యూవీ కిరణాలు చర్మానికి హాని చేయడమే కాదు పొడిబారుస్తాయి. ఎండలో ఎక్కువ సేపు ఉండాల్సొచ్చినా ప్రతి రెండు గంటలకూ సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి.

* చర్మానికి ఆహారపరమైన పోషణా కావాలి. రోజుకు 6-8 గ్లాసుల నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అరగంట వ్యాయామం, కనీసం 7 గంటల నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉంటే ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని